breaking news
tuni kapu agitation
-
ఆయనవి ఆటవిక పద్ధతులు.. మానుకోవాలి
-
ఆయనవి ఆటవిక పద్ధతులు.. మానుకోవాలి
తుని మంటలతో చలికాచుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, అమాయకులను శలభాలుగా మార్చాలని చూడటం అన్యాయం, ఆటవికం, అనాగరికమని.. ఈ ఆటవిక పద్ధతులను చంద్రబాబు మానుకోవాలని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అన్నారు. తుని ఘటనకు సంబంధించి సీఐడీ పోలీసులు రెండోరోజు ఆయనను దాదాపు ఏడున్నర గంటల పాటు విచారించారు. బయటకు వచ్చిన తర్వాత భూమన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ''చంద్రబాబు పాపాల గని. ఆయన చరిత్ర అంతా కుట్రలు, కుతంత్రాలు, వంచన. వీటితోనే ముఖ్యమంత్రి చంద్రబాబు పెరిగారు. అమాయకులను వేధించడంలో ఆయన దిట్ట. తనను అధిక్షేపించేవాళ్లను, తన అప్రజాస్వామిక విధానాలను వ్యతిరేకించే వాళ్లను ఆయన సహించలేరు. విరుద్ధ అభిప్రాయాల పట్ల ఆయనకు గౌరవం లేదు. తనకు వ్యతిరేకంగా ఆలోచన చేసేవారిని సహించలేక.. వాళ్లను అరాచకవాదులుగా చిత్రించడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. అందులో భాగంగానే నామీద కక్షతో నన్ను తుని కేసులో విచారణకు పిలిపించారు. తమకు జరిగిన అన్యాయాన్ని ప్రతిఘటించడమే కాపు ఉద్యమం. తమను బీసీలలో చేరుస్తామని ఇచ్చిన హామీని చంద్రబాబు తుంగలో తొక్కడం వల్లే వాళ్లు ఉద్యమించారు. ఆ సంఘటనతో ఏమాత్రం సంబంధం లేని నన్ను విచారణకు పిలిపించడం వల్ల కాపుజాతి యువకుల గుండెలు రగులుతున్నాయి. వాళ్లందరూ నాకు పరిపూర్ణమైన మద్దతును తెలియజేసినందుకు వారికి వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని సంఘ విద్రోహశక్తిగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చంద్రబాబు మొదటి రోజు నుంచి చేస్తున్నారు. తుని ఘటన వెనక జగన్ ఉన్నారని చంద్రబాబు, హోం మంత్రి మొదటిరోజు నుంచే చెబుతుంటే దాని ప్రభావం విచారణ సంస్థపై ఉండక తప్పదు. ఏదో ఒక రకంగా ఈ తుని ఘటన మేం చేయించామనే కుట్రపూరితమైన ఆలోచనతోనే చంద్రబాబు ఈ ప్రకటన చేశారు. తునిలో ఆరోజు జరిగిన బహిరంగ సభ తర్వాత చోటుచేసుకున్న విధ్వంసాన్ని ప్రజాస్వామ్యవాదులు ఎవరూ హర్షించరు. స్వయంగా ముద్రగడ సహా అందరూ దాన్ని ఖండించారు. కానీ దానికి అమాయకులను బలిచేయడం అంతకంటే పెద్ద నేరం. అలాంటి నేరం చేయడానికి చంద్రబాబు పూనుకున్నారు. ఈ రోజు, నిన్న దానిపై నన్ను విచారించారు. విచారణాధికారులు హరికృష్ణ, భాస్కర్ చాలా సంస్కారవంతంగా, సభ్యతతో ఆ ఘటన గురించి తెలిసిన విషయాలు మాట్లాడమని అడిగారు. ఏమాత్రం నొప్పించలేదు. వాళ్లను కూడా అభినందిస్తున్నా. కానీ దీని వెనక ఉన్న కుత్సితమైన ప్రేరకం చంద్రబాబుదే. నన్ను పిలిపించడానికి ఆరోజు చంద్రబాబు చేసిన ప్రకటనే కారణం. నాకు ఆ ఘటనతో ఎలాంటి సంబంధం లేదని చెప్పాను. ఈ రోజుకు నన్ను పంపించారు, మళ్లీ ఎప్పుడు రమ్మంటారో తెలియదు. విచారణలో భాగంగా పిలిపించినట్లు నాకు చెప్పారు. నేను నేరస్థుడినని సీఐడీ వాళ్లు ఏమీ చెప్పలేదు. నేను ఏ ప్రభావాలకూ భయపడే వ్యక్తిని కాను. కాపుల న్యాయమైన కోరిక అయిన బీసీ రిజర్వేషన్లు వెంటనే అమలుచేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. ప్రత్యేక హోదా ఇవ్వాలని ఒకరోజు, దానికంటే ఎక్కువ ప్యాకేజి ఇస్తున్నారంటూ ఈరోజు వాజమ్మ ప్రకటనలు చేయడం తగదు. తుని ఘటనపై సీబీఐ విచారణ లేదా, సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేయిస్తే నిజానిజాలు నిగ్గుతేలుతాయి. విచారణాధికారులు కొండను తవ్వి ఎలుకను పట్టారు'' అని భూమన కరుణాకర రెడ్డి చెప్పారు. -
భూమనను అరెస్టుచేస్తే తీవ్ర పరిణామాలు
-
భూమనను అరెస్టుచేస్తే తీవ్ర పరిణామాలు
వైఎస్ఆర్సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డిని అరెస్టు చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి హెచ్చరించారు. తుని ఘటనలో విచారణ పేరుతో ఆయనను గుంటూరుకు తీసుకొచ్చి వేధిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఇక్కడ పోలీసులు చేస్తున్న హడావుడి చూస్తుంటే కరుణాకరరెడ్డిని అరెస్టు చేస్తారేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. అలా చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. ప్రజాసమస్యల పరిష్కారంలో విఫలం కావడంతో పాటు ఓటుకు కోట్లు కేసు తదితర అంశాల్లో టీడీపీ సర్కారును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దోషిగా నిలబెట్టనుందని, దాన్ని డైవర్ట్ చేయడానికే ఈ డ్రామా చేస్తున్నట్లు కనిపిస్తోందని ఆయన అన్నారు. చంద్రబాబు వ్యక్తిగత ప్రయోజనాలతో ప్రత్యేక హోదాను పక్కన పెట్టించి ప్యాకేజి కోసం మంత్రులతో బేరసారాలు ఆడిస్తున్నారని, రేపు హోదా కోసం ప్రజల్లో తిరుగుబాటు వస్తే, వైఎస్ఆర్సీపీ దానికి నాయకత్వం వహిస్తుందని తెలిసి, దాన్ని పక్కదోవ పట్టించడానికి వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులను అరెస్టు చేయాలని చూస్తున్నారని ఆయన అన్నారు. గుంటూరుకు హడావుడిగా అర్ధరాత్రి భారీ సంఖ్యలో పోలీసు బలగాలను తరలించారని, ఇదంతా చూస్తుంటే తమకు భూమనను అరెస్టు చేస్తారేమోనన్న అనుమానాలు వస్తున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. దీనిపై లోపలున్న పోలీసులను అడిగినా తమకు ఎలాంటి సమాచారం లేదని వాళ్లు చెబుతున్నారన్నారు. విచారణ తర్వాత కరుణాకరరెడ్డిని అరెస్టు చేసే అవకాశం ఉంటే మాత్రం తప్పనిసరిగా తమకు ముందుగా సమాచారం ఇవ్వాలని ఆయన అన్నారు. భూమనను రహస్యంగా తీసుకెళ్లాల్సిన అవసరం లేదని, ఇప్పటివరకు మాత్రం అరెస్టు చేస్తామని గానీ.. చేయబోమని గానీ ఏమీ చెప్పలేదని తెలిపారు. సాధారణంగా చంద్రబాబు, లోకేష్ ఏం చెబితే సీఐడీ వాళ్లు అదే చేస్తారని.. వాళ్లు ఏం చెప్పారో చూడాలని అంబటి అన్నారు. కరుణాకరరెడ్డిని అరెస్టు చేసి రాజమండ్రి జైలుకు తరలిస్తారని టీడీపీ నేత వర్ల రామయ్య చెప్పారంటే చంద్రబాబు అలాగే ఆదేశించారేమో చూడాల్సి ఉందన్నారు.