breaking news
TSCSCL
-
రుణ బకాయిలు రూ.33,787 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ (టీఎస్సీఎస్సీఎల్) బ్యాంకులకు చెల్లించాల్సిన రుణ బకాయిలు ఏయేటికాయేడు పెరిగి పోతున్నాయి. ధాన్యం కొనుగోళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీతో బ్యాంకుల నుంచి అప్పులు తెస్తున్న కార్పొరేషన్ పూర్తిస్థాయిలో చెల్లింపులు జరపని కారణంగా అప్పుల భారం పెరిగిపోతోంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత అప్పటికే ఉన్న బకాయిలతో పాటు ప్రతి ఏటా బ్యాంకులకు చెల్లించాల్సిన మొత్తం పెరుగుతూనే వచ్చింది. ఈ విధంగా 2014 –15 నుంచి 2021–22 వరకు బ్యాంకులకు కార్పొరేషన్ చెల్లించాల్సిన బకాయిలు ఏకంగా రూ.33,787.26 కోట్లకు చేరాయి. రాష్ట్ర ప్రభుత్వ చెల్లింపులు లేకనే.. రాష్ట్రం ప్రభుత్వం పౌరసరఫరాల కార్పొరేషన్ ద్వారా కనీస మద్దతు ధరతో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి, సెంట్రల్ పూల్ కింద కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను ఎఫ్‌సీఐకి అప్పగిస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా కార్పొరేషన్ ఏటా వేల కోట్ల రూపాయల అప్పులు చేసి ధాన్యం కొనుగోలు చేస్తోంది. సీఎంఆర్ తీసుకున్న తరువాత కార్పొరేషన్‌కు ఎఫ్‌సీఐ ఆ మొత్తాన్ని చెల్లిస్తుంది. ఈ విధంగా ఎఫ్‌సీఐ తీసుకున్న సీఎంఆర్‌కు అనుగుణంగా కిలోకు రూ.32 చొప్పున రాష్ట్రానికి క్రమం తప్పకుండా చెల్లిస్తోంది. అయితే సీఎంఆర్ ఆలస్యం అవుతున్న కొద్దీ ఎఫ్‌సీఐ చెల్లింపులు కూడా ఆలస్యంగానే ఉంటున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై కొంత వడ్డీ భారం పడుతున్నా.. అది కొంతే. కాగా రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ నుంచి తీసుకున్న బియ్యానికి గాను చెల్లించాల్సిన మొత్తం చెల్లించక పోవడంతో సంస్థపై భారం అధికంగా పడుతోంది. బ్యాంకులకు రుణ బకాయిలు కట్టడం కష్టమవుతోంది. రూ.4,747 కోట్ల నుంచి పెరుగుతూ.. పీడీఎస్ బియ్యం, హాస్టళ్లు, గురుకులాల వంటి రాష్ట్ర అవసరాల కోసం స్టేట్‌పూల్ కింద ప్రభుత్వం పౌరసరఫరాల కార్పొరేషన్ నుంచే బియ్యాన్ని తీసుకుంటుంది. అలా తీసుకుంటున్న బియ్యానికి కిలో రూ.32 లెక్కన చెల్లించాలి. ఆ సొమ్ము చెల్లించకపోవడంతో బకాయిలు రూ.వేల కోట్లలో పేరుకుపోయాయి. తెలంగాణ ఏర్పాటు అయిన 2014–15, ఉమ్మడి రాష్ట్రం నాటి బకాయిలు కలిపి రూ.4,747 కోట్లు ఉండగా, అవి క్రమంగా పెరుగుతూ వచ్చాయి. 2019–20లో బ్యాంకు రుణ బకాయిలు రూ.15,302.79 కోట్లు ఉండగా, 2021–22 నాటికి రూ. 33,787.26 కోట్లకు పెరిగిపోయాయి. కరోనా కారణంగా రెండేళ్ల పాటు సాగిన ఉచిత బియ్యం పంపిణీ, అదనపు కోటా విడుదల, తదితర కారణాలతో రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ నుంచి పెద్ద ఎత్తున బియ్యం కొనుగోలు చేసి పంపిణీ చేసింది. కానీ డబ్బులు చెల్లించలేదు. వడ్డీలకే వేల కోట్లు పౌర సరఫరాల సంస్థ తీసుకున్న అప్పులకు గాను వడ్డీల కింద ఏటా రూ.వేల కోట్లు చెల్లిస్తోంది. 2021–22 లో పౌరసరఫరాల సంస్థ బ్యాంకుల నుంచి రూ. 29,804 కోట్లు అప్పు తీసుకోగా, ఇందుకు చెల్లించాల్సిన వడ్డీ రూ.1, 568 కోట్లు. కాగా బకాయిలకు సంబంధించిన వడ్డీ కూడా కలుపుకొని చెల్లించిన మొత్తం రూ. 2,100.55 కోట్లు. 2014–15లో రూ.146.80 కోట్లు వడ్డీగా చెల్లించిన పౌరసరఫరాల శాఖ 2015–16 లో రూ.1,012.48 కోట్లు చెల్లించింది. ఇలా పెరుగుతూ వచ్చి 2022–23 నాటికి చెల్లించాల్సిన వడ్డీ రూ. 9,222.50 కోట్లకు చేరింది. కాగా ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే రూ.360.68 కోట్లు వడ్డీ కింద కార్పొరేషన్ చెల్లించడం గమనార్హం. -
ఆగస్టు 15 నుంచి ఫుల్ కరెంట్!
♦ వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా ♦ తొలుత ఒక జిల్లాలో అమలు ♦ క్రమంగా మిగతా జిల్లాలకు.. సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా ఆగస్టు 15 నుంచి వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరాను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతోంది. ఒక జిల్లాలో ప్రయోగాత్మకంగా మొదలుపెట్టి.. తర్వాత మిగతా జిల్లాలకూ విస్తరించనుంది. రబీ సీజన్ ప్రారంభమయ్యే అక్టోబర్‌లోగా రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేయనుంది. ఈ మేరకు ట్రాన్స్‌కో, డిస్కంలు ఏర్పాట్లు చేస్తున్నాయి. శరవేగంగా ఏర్పాట్లు.. గతంలో పంటలకు గరిష్టంగా ఏడు గంటల విద్యుత్ సరఫరా చేసేవారు. రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కాలంగా పగటి పూటే 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తోంది. తాజాగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు.. వచ్చే రబీ నుంచి విద్యుత్ సరఫరాను 24 గంటలకు పెంచేందుకు ట్రాన్స్‌కో, డిస్కంలు ఏర్పాట్లు చేస్తున్నాయి. రూ.1,000 కోట్ల వ్యయంతో కొత్త లైన్లు, సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు, ఇతర మౌలిక సదుపాయాలను సిద్ధం చేస్తున్నాయి. టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీ డీసీఎల్ తొలుత తమ పరిధిలోని ఒక్కో పాత జిల్లా పరిధిలో ఆగస్టు 15 నుంచి పంటలకు 24 గంటల విద్యుత్‌ను సరఫరాను ప్రారంభించనున్నాయి. రాష్ట్రంలో 23 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లుండగా.. 24 గంటల సరఫరాతో విద్యుత్ డిమాండ్ బాగా పెరుగుతుందని అంచనా. 24 గంటల సరఫ రాతో వ్యవసాయ విద్యుత్ డిమాండ్ 5 వేల మెగావాట్లకు పెరుగుతుందని.. మొత్తంగా రాష్ట్ర విద్యుత్ డిమాండ్ 10,000 మెగావా ట్లను మించనుందని డిస్కంలు అంచనా వేశాయి. ఈ మేరకు విద్యుత్‌ను సమీకరణకు చర్యలు తీసుకుంటున్నాయి. ఇక వ్యవసాయ విద్యుత్ సరఫరాను 24 గంటలకు పెంచితే డిస్కంలపై అదనంగా ఏటా రూ.1,000 కోట్ల భారం పడుతుందని అధికారులు భావిస్తు న్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీల రూపంలో ఈ భారాన్ని భరించనుంది.