breaking news
Tribal kids
-
ట్రయినింగ్లో...సింగ్ ఈజ్ కింగ్
క్రీడాకారులు ఎవరైనా గెలవాలనే లక్ష్యంతో అహర్నిశలూ శ్రమించి పోటీల్లో పాల్గొంటారు. కానీ ఢిల్లీకి చెందిన కరణ్ సింగ్‌కు మాత్రం ఆ అదృష్టం దక్కలేదు. తాను ఎంతో కష్టపడి ప్రాక్టిస్ చేసినప్పటికీ పోటీలో పాల్గొనలేకపోయాడు. ఆరేళ్లపాటు శిక్షణ తీసుకుని దేశం తరపున అథ్లెటిక్స్‌లో పాల్గొనాలన్న కరణ్ కల విధి వక్రీకరించడంతో... అనేకమార్లు మోకాళ్ల గాయాలు, సర్జరీల మూలంగా ఆ ఆశలు ఆవిరైపోయాయి. ఇక ఎప్పటికీ తాను పోటీలలో పాల్గొనలేను అని తెలిసినప్పుడు ఎంతో బాధపడ్డాడు. అయినప్పటికీ ప్రతిభ ఉండి మరుగున పడిపోతున్న పిల్లలకు శిక్షణ ఇవ్వడం ద్వారా తన కలను నిజం చేసుకోవచ్చని అనుకున్నాడు కరణ్. అమెరికాలో అంతర్జాతీయ కోచ్‌ల వద్ద ఆరేళ్లపాటు శిక్షణ పొందిన కరణ్ అప్పటి తన అనుభవంతో ఊటీ జార్ఖండ్ ప్రాంతాల్లోని గిరిజన పిల్లలకు శిక్షణ ఇస్తూ వారిలోని ప్రతిభను వెలికి తీస్తున్నారు. మిడిల్, లాంగ్ డిస్టెన్స్, రన్నింగ్ కాంపిటీషన్లలో వీరిని బరిలో నిలిపేందుకు గట్టిగా తీర్చిదిద్దుతున్నారు. 2028 లా ఒలింపిక్స్ బరిలో ఈ పిల్లలను నిలపడం తన కల అని కరణ్ చెబుతున్నాడు. ఈ క్రమంలోనే తన సొంత ఊరు అయిన న్యూఢిల్లీ నుంచి ఊటీకి తన మకాం మార్చి 2018 ఆగస్టులో ఊటీలో ‘ఇండియన్ ట్రాక్ ఫౌండేషన్’(ఐటీఎఫ్)ను ఏర్పాటు చేశాడు. ఊటీ పరిసర ప్రాంతాల్లోని గిరిజన తండాల్లోని పిల్లలకు రన్నింగ్‌లో శిక్షణ ఇస్తున్నాడు. 10–16 ఏళ్ల వయసు ఉన్న పిల్లలందర్ని ఒక ఇంట్లో ఉంచి కరణ్, అతని భార్య ఇద్దరు కలిసి వారి బాగోగులు చూసుకుంటున్నారు. వీరి అవసరాలకయ్యే ఖర్చు మొత్తం వారే భరిస్తూ.. వారికి రన్నింగ్‌లో శిక్షణతోపాటు చదువుకునేందుకు అవకాశం కల్పిస్తూ సొంత పిల్లల్లా చూసుకుంటున్నారు. ఏటా ఇక్కడ చేరే పిల్లల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఐటీఎఫ్ ఏర్పాటు చేసేందుకు కరణ్‌కు మూడేళ్లు పట్టింది. ఐటీఎఫ్‌లో శిక్షణ పొందుతున్న పిల్లలు వివిధ పోటీలలో పాల్గొని విజయం సాధించడంతోపాటు స్టేట్ ఛాంపియన్, నేషనల్ క్రాస్ కంట్రీ ఛాంపియన్లుగా నిలుస్తున్నారు. 2028 లా ఒలింపిక్స్‌లో తమ అకాడమీ పిల్లలు తప్పక విజయం సాధిస్తారని కరణ్ చెబుతున్నారు. -
గిరిజన పిల్లల బడిబాటకు కసరత్తు
* జూన్‌లో కొమురం భీం ఎడ్యుకేషనల్ ఫెస్టివల్ * నేడు బడి వయసు పిల్లల గుర్తింపునకు సర్వే సాక్షి, హైదరాబాద్: బడి మానేస్తున్న, చదువుకు దూరమవుతున్న గిరిజన పిల్లల పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు వివిధ రూపాల్లో చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో కొత్త విద్యార్థులను చేర్చుకునేందుకు జూన్ 15-20 తేదీల్లో ‘కొమురం భీం ఎడ్యుకేషన్ ఫెస్టివల్’ను నిర్వహించనుంది. ఈ కార్యక్రమం కింద గిరిజన తల్లితండ్రులతో టీచర్ల సమావేశాలు, టీచర్లు, పిల్లలతో ర్యాలీలు, టీచర్లు, ఎన్జీవోలు ఇంటింటికీ వెళ్లి కొత్త విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించడం, బాలికల విద్యా దినోత్సవం వంటి వాటిని నిర్వహించాలని నిర్ణయించింది. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరిచాక గిరిజన పిల్లలను చేర్చుకునేందుకు, ఇందుకు సంబంధించి తల్లిదండ్రుల్లో అవగాహన కల్పిం చేందుకు ఆయా కార్యక్రమాలు చేపట్టనుంది. అర్హులైన గిరిజన బాలబాలికల వంద శాతం ఎన్రోల్మెంట్ దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లాల అధికారులను ఆదేశించింది. దీనిలో భాగంగా గిరిజన ఆవాసాల్లో ఐదేళ్లకు పైబడిన బడిఈడు పిల్లలను గుర్తించేందుకు బుధవారం సర్వే నిర్వహించనున్నారు. ఈ సర్వేలో ప్రైమరీ స్కూల్ టీచర్లంతా పాల్గొనేలా ఆదేశాలు జారీచేశారు. గిరిజన పిల్లలు స్కూళ్లలో చేరి చదువు కొనసాగించేలా చర్యలు చేపట్టేందుకు 6-14 ఏళ్ల వయసు వారి జాబితాను అంగన్వాడీ టీచర్లు, వర్కర్లు, గ్రామపెద్దల నుంచి తీసుకోనున్నారు. ముందుగా ఆయా పిల్లల వివరాలు, సమాచారాన్ని తీసుకుని వారిని స్కూళ్లలో చేర్పించేందుకు ఉపయోగించుకోవాలని గిరిజన సంక్షేమశాఖ నిర్ణయించింది. పిల్లల తల్లితండ్రులకు విద్యావశ్యకతను వివరించి, వారిని పాఠశాలల్లో చేర్పించేలా టీచర్లు చొరవ తీసుకోవాలని నిర్దేశించింది. జూన్‌లో గిరిజన విద్యార్థులందరికీ టెక్ట్స్‌బుక్స్, నోట్‌బుక్స్ అందించాలని, స్కూల్ యూనిఫారాలు సరఫరా చేయాలని నిర్ణయించారు. బాలికలపై ప్రత్యేక శ్రద్ధ... బడులకు దూరమైన విద్యార్థులను ముఖ్యంగా బాలికలను అన్ని కసూర్భాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), మినీ గురుకులాల్లో చేర్చుకోవడంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను గిరిజన సంక్షేమశాఖ ఆదేశించింది. ముఖ్యంగా అమ్మాయిలను 10వ తరగతి వరకు చదివించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇందుకోసం గ్రామాల్లోని గిరిజన యువత, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులతో ర్యాలీలను నిర్వహించి గిరిజన పిల్లలను స్కూళ్లలో చేర్పించే విషయంలో తల్లితండ్రులను చైతన్యవంతం చేయాలని నిర్ణయించారు. విద్యా హక్కు చట్టంపై గిరిజనుల్లో అవగాహన కల్పించేందుకు సాంస్కృతిక బృందాలతో ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నారు.