మెరుగైన సేవలందించాలి
- రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి
- ఫారెస్ట్ అధికారులకు నూతన వాహనాల అందజేత
- రైతులతో ఉదాసీనంగా వ్యవహరించాలి
- రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి
వికారాబాద్ రూరల్: ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు ప్రభుత్వం పోలీస్, ఫారెస్ట్ శాఖలకు అత్యాధునిక వాహనాలను అందజేస్తున్నదని రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం వికారాబాద్‌లోని బ్లాక్‌గ్రౌండ్‌లో ఫారెస్ట్ అధికారులకు కొత్త వాహనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 40 ద్విచక్ర వాహనాలు, ఐదు జీపులను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అటవీశాఖ అధికారులు రైతుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించాలన్నారు. 30 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న రైతుల వద్దకు వెళ్లి కేసులు నమోదు చేస్తున్నారని, రైతులతో కఠినంగా ఉండవద్దని అన్నారు.
కర్ణాటక, రంగారెడ్డి జిల్లా సరిహద్దులో అనేక ఇబ్బందులు ఉన్నాయని, అధికారులు సరిహద్దుల్లో సర్వే చేయించి హద్దులను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కలెక్టర్ రఘునందన్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల పునర్వ్యవస్థీకరణ చేపట్టిందన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ.. అటవీశాఖ అధికారులు నిర్లక్ష్యం వల్ల చాలా మంది రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు ప్రతిశాఖను ఆధునికీకరించడం శుభపరిణామం అన్నారు. కార్యక్రమంలో చీఫ్ ఫారెస్ట్ కంన్జర్వేటీవ్ అధికారి నాగభూషణం, అదనపు ఫారెస్టు కంన్జర్వేటీవ్ అధికారి శోభ, డీఎఫ్ఓ శ్రీనివాసు, హరీశ్వర్, అధికారులు నర్సింగ్‌రావు, విష్ణువర్ధన్, విజయనంద్, కవిత, వెంకట్రామ్ పాల్గొన్నారు.