breaking news
Transformer Explosion
-
ఉత్తరాఖండ్: కరెంట్ షాక్‌తో 16 మంది దుర్మరణం
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో బుధవారం ఘోరం జరిగింది. అలకనంద నది Alaknanda River చమోలి డ్యామ్ దగ్గర ట్రాన్స్‌ఫారమ్ పేలిన ఘటనలో పదహారు మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో పోలీసు సిబ్బంది.. ముగ్గురు హోంగార్డులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు అంటున్నారు. ట్రాన్స్ఫార్మర్ పేలి.. బ్రిడ్జి గుండా కరెంట్ పాస్ అయ్యింది. ఆ సమయంలో బ్రిడ్జిపై ఉన్నవాళ్లకు కరెంట్ షాక్ తగిలింది. కొందరు అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడగా.. వాళ్లను చికిత్స కోసం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్పీ పరమేంద్ర దోవల్ వెల్లడించారు. ఇదిలా ఉంటే.. నమామి గంగా ప్రాజెక్టులో భాగంగా అలకనంద నదిపై ఈ బ్రిడ్జిని నిర్మించారు. Uttarakhand | 10 people died and several injured after a transformer exploded on the banks of the Alaknanda River in the Chamoli district. Injured have been admitted to the district hospital: SP Chamoli Parmendra Doval — ANI (@ANI) July 19, 2023 -
ఎంత ఘోరం తప్పింది..
మలికిపురం : దేశ చమురు సంస్థల చరిత్రలోనే నెత్తుటి ఘట్టంగా.. మామిడికుదురు మండలం నగరం గ్రామంలో 20 మందిని పైగా బలిగొన్న గెయిల్ పైపులైన్ విస్ఫోటపు గురుతులు ఇంకా జిల్లాను ఉలికిపాటుకు గురి చేస్తూనే ఉన్నాయి. కలుగుల్లోని పాముల్లా.. పచ్చని కోనసీమ కడుపులా దాగిన చమురు, సహజవాయు పైపులైన్లు ఇంకెక్కడ, ఇంకెంత ఉత్పాతాన్ని సృష్టిస్తాయోనన్న భయం.. నగరంలో గత 27 వేకువన అభాగ్యులను తరిమిన అగ్నికీలల్లా.. ఆ సీమవాసులను వెన్నాడుతూనే ఉంది. అయినా.. మృత్యువు చేసిన పెనుహెచ్చరికలాంటి ఆ దుర్ఘటన నుంచి చమురు సంస్థలు పాఠాలు నేర్చుకోలేదు. మలికిపురం మండలం తూర్పుపాలెంలో ఓఎన్జీసీకి చెందిన గ్రూప్ గేదరింగ్ స్టేషన్ (జీజీఎస్) ప్రహరీకి చేర్చి ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ సోమవారం పేలి, మంటలు చెలరేగాయి. అయితే.. అదృష్టవశాత్తు మహావిపత్తు తప్పింది. జీజీఎస్‌కు చమురును తీసుకువెళ్లే పైపులైన్ల చుట్టూ మంటలు వ్యాపించినా, జీజీఎస్‌లో లక్షలాది లీటర్ల ముడిచమురుతో నిండిన భారీ ట్యాంకుకు చేరువలోనే ఈ దుర్ఘటన జరిగినా ..ఎలాంటి ముప్పూ లేకుండానే ప్రమాదం సమసిపోయింది. ఒక పీచు ఫ్యాక్టరీకి చెందిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ జీజీఎస్ ప్రహరీకి చేర్చి ఉంది. సోమవారం ఉదయం విద్యుత్ తీగలు షార్ట్ సర్క్యూటై మంటలు చెలరేగి ట్రాన్స్ ఫార్మర్పై పడ్డాయి. దాంతో అది పేలి మంటలు మరింత విజృంభించాయి. పక్కనే ఉన్న పీచు ఫ్యాక్టరీలోని పీచూ తగలబడింది. అన్నింటికీ మించి.. జీజీఎస్‌కు ముడిచమురును తీసుకు వెళ్లే పైపులైన్ల చుట్టూ పోగుపడ్డ చెత్త, ఎండుగడ్డి అంటుకోవడంతో అవి కూడా మంటల్లో చిక్కుకున్నాయి. ఈ పైపు లైన్లు అటు బావులకు, ఇటు చమురు నిల్వ చేసే ట్యాంకులకు అనుసంధానమై ఉంటాయి. అయితే పైపులైన్ల చుట్టూ వ్యాపించిన మంటలు, ఎలాంటి ఉత్పాతం జరగక ముందే ఆరిపోయాయి. ఈలోగా స్థానికులు ప్రాణాలు అరచేత పెట్టుకున్నట్టు బిక్కుబిక్కుమన్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో, పైపులైన్లు పేలి, నగరం దారుణం లాంటిది జరుగుతుందో లేక మంటలు ముడిచమురు నిల్వ ఉన్న ట్యాంకులకూ సోకి అంతకు ఎన్నోరెట్ల ఘోరం సంభవిస్తుందోనని నిలువునా వణికిపోయారు. అలాంటివేమీ జరగకుండానే ప్రమాదం సమసిపోవడంతో ‘బతుకుజీవుడా’ అని ఊపిరి పీల్చుకున్నారు. కాగా తాటిపాక, నర్సాపురంల నుంచి వచ్చిన అగ్నిమాపక శకటాలు మంటలను అదుపు చేయడానికి కృషి చేశాయి. కాగా ఈ ప్రమాదంపై జీజీఎస్ సైట్ ఇన్చార్జి బిపిన్ ప్రసాద్ మాట్లాడుతూ అక్కడ పీచు ఫ్యాక్టరీ వద్దని తాము అభ్యంతరం చెప్పినా వినకుండా ఏర్పాటు చేశారన్నారు. నిబంధనలకు నిప్పు.. పొంచి ఉన్న ముప్పు ఓఎన్జీసీ తూర్పుపాలెంలో జీజీఎస్ ఏర్పాటు చేసి సుమారు 25 ఏళ్లు కావస్తోంది. నిబంధనల ప్రకారం దీని పరిసరాల్లో విద్యుత్ వాహకాలు, తేలికగా మండే స్వభావం గల పీచు వంటి వాటితో ఏర్పాటయ్యే ఎలాంటి సంస్థలూ ఉండ కూడదు. అంతవరకూ.. ఎందుకు ఎక్కడ షార్ట్సర్క్యూట్లు అవుతాయోనన్న జంకుతో ఓఎన్జీసీ తన సైట్లలో ఏపీ ట్రాన్స్‌కో విద్యుత్‌ను కూడా వినియోగించదు. విద్యుత్ అవసరాల కోసం ఆయిల్ జనరేటర్లనే వాడుతుంది. అయితే తూర్పుపాలెం జీజీఎస్‌కు చేర్చి, ఏకంగా విద్యుత్ సబ్స్టేషనే ఉంది. దానికి తోడు చిన్నపాటి నిప్పురవ్వలకు సైతం మంటలు రగులుకునే పీచు ఫ్యాక్టరీ కూడా పక్కనే ఉంది. సుమారు 40 ఎకరాల్లో విస్తరించిన జీజీఎస్‌కు.. సమీపంలోని దాదాపు 30 బావుల నుంచి ఆయిల్, గ్యాస్ పైపులైన్లు అనుసంధానమై ఉంటాయి. ఇక్కడి భారీ ఆయిల్ ట్యాంకుల నుంచి ప్రతి రోజూ 30 ట్యాంకర్లకు పైగా చమురును రిఫైనరీకి తరలిస్తారు. మారణహోమం సృష్టించిన నగరం దుర్ఘటన నుంచి, అలాంటిదేమీ లేకుండా కరుణించి, విడిచిపెట్టినా.. విలయం పొంచి ఉందన్న హెచ్చరికలా మిగిలిన తూర్పుపాలెం ఘటన నుంచీ చమురు సంస్థలు తక్షణం గుణపాఠాలు నేర్చుకోవాలి. ఇక్కడి సిరిని తరలించుకుపోవడానికే కాక.. ఎంత సిరి పెట్టినా కొనలేని ప్రాణాలకు రక్షణ కల్పించడానికీ నడుం బిగించాలి. లాభాపేక్షే కాక జనక్షేమం పట్ల కూడా తమకు నిబద్ధత ఉందని నిరూపించుకోవాలి. ప్రతి పనినీ, ప్రతి కార్యస్థానాన్నీ నూరుశాతం నిబంధనలకు అనువుగా నిర్వహించాలి.