breaking news
Third Casualty warning
-
ఇంకా ముంపులోనే
భద్రాచలం : ఉగ్ర గోదారి శాంతించింది. 56 అడుగులు దాటి ప్రవహించటంతో తీవ్ర భయాందోళనకు గురైన పరివాహక ప్రాంత ప్రజలు ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు. భద్రాచలం వద్ద మంగళవారం రాత్రికి 49.7 అడుగుల నీటిమట్టం నమోదైంది. దీంతో మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. అయితే ఏజెన్సీలోని పలు గ్రామాలు మాత్రం ఇంకా వరదనీటిలోనే ఉన్నాయి. భద్రాచలం, పాల్వంచ డివిజన్లలోని 25 గ్రామాలకు చెందిన 623 మందిని పునరావాస శిబిరాలకు తరలించారు. వరద ఉధృతి తగ్గినప్పటికీ ఇంకా 31 చోట్ల రహదారులు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. దీంతో వందలాది గ్రామాలకు మంగళవారం కూడా రాకపోకలు నిలిచిపోయాయి. వాజేడు మండలంలో చీకుపల్లి అవతల ఉన్న గ్రామాలకు వెళ్లే రోడ్లపై కిలోమీటర్ల మేర వరద నీరు నిలిచింది. భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం తగ్గినా, దిగువన ఉన్న చింతూరు, వీఆర్‌పురం, కూనవరం మండలాపై తీవ్ర ప్రభావం చూపింది. వీఆర్ పురం మండలం శ్రీరామగిరి, వడ్డిగూడెం, కూనవరం మండలంలోని ఉదయ భాస్కర్ కాలనీలకు వరద నీరు చేరింది. దీంతో ఆయా గ్రామాల వారిని పునరావాస శిబిరాలకు తరలించారు. చింతూరు నుంచి వీఆర్‌పురం వెళ్లే దారిలో ఉన్న వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో 30 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. భద్రాచలం డివిజన్లో ఏడు మండలాలపై వరద ప్రభావం తీవ్రంగా ఉందని అధికారులు ప్రకటించారు. డివిజన్లోని 9 గ్రామాలకు వరద నీరు చుట్టుముట్టగా, భద్రాచలం, చర్ల, వెంకటాపురం, కూనవరం, వీఆర్‌పురం మండలాల్లో పునరావాస శిబిరాలను ఏర్పాటు చేశారు. పాల్వంచ డివిజన్లోని ఆరు మండలాలకు చెందిన 16 గ్రామాలను వరదనీరు చుట్టుముట్టగా రెండు పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసి బాధితులను అక్కడికి తరలించారు. భద్రాచలాన్ని వీడని వరద... భద్రాచలం వద్ద వరద తగ్గుముఖం పట్టినప్పటికీ పట్టణంలోని అశోక్ నగర్ కొత్తకాలనీని వరద వీడలేదు. వరద తగ్గిన తరువాత ఇక్కడ ఇంకా ఎక్కువగా నీరు చేరటం గమనార్హం. సమీపాన ఉన్న అయ్యప్ప కాలనీలోని ఇళ్లల్లోకి కూడా వరద నీరు చేరింది. స్లూయీస్‌ల నుంచి వరద నీరు కాలనీలోకి వస్తుండగా, దానిని ఆ స్థాయిలో బయటకు తరలించకపోవటంతోనే సమస్య జఠిలంగా మారింది. ఈ విషయంలో అధికారుల వైఖరిపై కలెక్టర్ ఇలంబరితి కూడా సీరియస్‌గానే ఉన్నారు. పంట నష్టం అంచనాలకు సిద్ధం... వరద తగ్గుముఖం పడుతుండటంతో పంటలు ఏ మేరకు నష్టపోయాయో సర్వే చేపట్టాలని కలెక్టర్ ఇలంబరితి ఆదేశించిన నేపథ్యంలో ఇందుకు వ్యవసాయశాఖాధికారులు సిద్ధమయ్యారు. గోదావరి పరివాహక ప్రాంతంలో మొత్తం 25 వేల ఎకరాలకు పైగానే పంటలు నీటమునిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే వరద పూర్తిగా తొలగితే తప్ప వాస్తవ నష్టాన్ని లెక్క కట్టవచ్చని ఓ వ్యవసాయశాఖాధికారి తెలిపారు. సహాయక చర్యలపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి... వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై కలెక్టర్ ఇలంబరితి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. సోమవారం అంతా భద్రాచలంలోనే ఉన్న కలెక్టర్ మంగళవారం కూడా వచ్చి అధికారులతో సమీక్షించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారిని ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకున్నటు ్ల‘సాక్షి’తో చెప్పారు. ఏపీకి బదలాయించిన ముంపు మండలాల్లోనూ తామే సహాయక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రహదారులు కోతకు గురైన చోట యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించామన్నారు. -
వరద గోదారి
భయం గుప్పెట్లో ‘పశ్చిమ’ - మూడో ప్రమాద హెచ్చరికకు చేరువలో నీటిమట్టం - 26 గిరిజన గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు - ఆనకట్ట వద్ద 14.70 అడుగులు దాటిన నీటిమట్టం - నీట మునిగిన కాజ్‌వేలు - లంక గ్రామాల్లో పంటల్ని ముంచెత్తిన వరద - అప్రమత్తమైన అధికార యంత్రాంగం సాక్షి, ఏలూరు/కొవ్వూరు : గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటి ప్రవాహం మూడో ప్రమాద హెచ్చరికకు చేరువ అవుతోంది. సోమవారం రాత్రి 10గంటలకు ధవళేశ్వరం వద్ద నీటిమట్టం 14.70 అడుగులకు చేరింది. మంగళవారం నాటికి 17 అడుగులకు దాటిపోయే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించారుు. పోల వరం మండలంలోని ఏజెన్సీ ప్రధాన రహదారి నీటమునగడంతో 26 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయూరుు. లంక గ్రామా ల్లో పంటలు ముంపుబారిన పడ్డాయి. పోలవరం మండలం కొత్తూరు, కోండ్రుకోట కాజ్వేతోపాటు కడెమ్మ వంతెన మీదుగా వరద నీరు ప్రవహిస్తోంది. పెరవలి మండలంలో లంకలు నీటమునిగాయి. 4వేల ఎకరాల్లో అరటి, కంద, బొప్పాయి, ఆకు కూరలు, కొబ్బరి, తమలపాకు తోటలు ముంపుబారిన పడ్డాయి. ఆచంట మండలంలోని లంక గ్రామాల ప్రజలు ముంపు భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. అనగారలంక, కోడేరులంక, అయోధ్యలంక, మర్రిమూల, పుచ్చల్లంక గ్రామాలకు ముంపు ముప్పు పొంచివుంది. కోడేరులంక వద్ద రెండు ఇంజిన్ పడవలు సిద్ధం చేశారు. యలమంచిలి మండలం కనకాయలంక వద్ద కాజ్వే పూర్తిగా నీట మునిగింది. కాజ్వే మీదుగా రాకపోకలు సాగిం చే వీలు లేకపోవడంతో నాటు పడవలను ఏర్పాటుచేశారు. లంక గ్రామాలైన దొడ్డిపట్ల, అబ్బిరాజుపాలెం, గంగడపాలెం, లక్ష్మీపాలెం, యలమంచిలిలంక, బాడవ గ్రామాలకు ముంపు పొంచివుంది. కలెక్టర్ కె.భాస్కర్ పోలవరం కొవ్వూరు, తాళ్లపూడి, నిడదవోలు మండలాల్లో పర్యటించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. విద్యుత్ శాఖ డీఈలు, ఏఈలను ఎస్ఈ టీవీ సూర్యప్రకాష్ అప్రమత్తం చేశారు. ప్రమాద స్థాయిలో నీటి ప్రవాహం గోదావరిలో నీటి ప్రవాహం ప్రమాద స్థారుులో కొనసాగుతోంది. సోమవారం ఉదయం 9గంటలకు ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం 11.75 అడుగులకు చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరికను, సాయంత్రం 5గంటలకు 13.75 అడుగులు దాట డంతో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. భద్రాచలంలో సాయంత్రం 6 గంటలకు భద్రాచలం వద్ద నీటిమట్టం 56 అడుగులకు చేరింది. అక్కడ మరో రెండు, మూడు అడుగుల మేర నీరు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ధవళేశ్వరం ఆనకట్ట వద్ద కూడా నీటిమట్టం మరింతగా పెరగనుంది. ఆనకట్ట వద్ద నీటిమట్టం 17.75 అడుగులకు చేరుకుంటే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఆనకట్ట వద్ద సోమవారం రాత్రి 7గంటలకు నీటిమట్టం 14.30 అడుగులకు, రాత్రి 10గంటలకు 14.70 అడుగులకు చేరింది. 175 గేట్లను పూర్తిస్థాయిలో ఎత్తివేశారు. రాత్రి 7 గంటలకు 14,20,937 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచి పెడుతున్నారు. వరద ముంపులో గోష్పాద క్షేత్రం కొవ్వూరులోని గోష్పాద క్షేత్రం పూర్తిగా నీటముని గింది. సుమారు ఆరు అడుగుల మేరకు నీరు ఆల యాలను చుట్టుముట్టి ప్రవహిస్తోంది. ఆలయాల్లోకి ఎవరూ వెళ్లకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం సాయంత్రం నుంచి ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలు నిలిచిపోయాయి. కలెక్టర్ కె.భాస్కర్, ఎమ్మెల్యే కేఎస్ జవహర్, మునిసిపల్ చైర్మన్ సూరపనేని చిన్ని వరద ఉధృతిని పరిశీలించారు. అప్రమత్తంగా ఉన్నాం గోదావరి వరదను దృష్టిలో ఉంచుకుని అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని కలెక్టర్ భాస్కర్ తెలిపారు. జిల్లాస్థాయి అధికారులను ఒక్కొక్కరిని ఒక్కో మండలానికి ఇన్చార్జిలుగా నియమించామన్నారు. పోలవరం ఎగువ ప్రాంతంలోని 26 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో పరిస్థితిని సమీక్షించే బాధ్యతను డ్వామా పీడీ ఎన్.రామచంద్రారెడ్డికి అప్పగించామన్నారు. కేంద్ర జల సం ఘం అధికారుల అంచనాల కంటే వరద ఎక్కువగా వస్తోందన్నారు. ముందస్తుగా పునరావాస కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఏటిగట్ల ఎప్పుటికప్పుడు పర్యవేక్షించేలా అధికారులను ఆదేశించామని, ఇసుక బస్తాల సిద్ధం చేసుకోవాల్సిందిగా సూచనలు ఇచ్చామని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు చర్యలు తీసుకున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. నిలిచిన వినాయక నిమజ్జనాలు గోదావరిలో వరద ఉధృతి అధికంగా ఉండడంతో గోష్పాద క్షేత్రం వద్ద వినాయక విగ్రహాల నిమజ్జనాలను అధికారులు నిలిపివేశారు. నిమజ్జనానికి తరలివస్తున్న విగ్రహాలను పోలీసులు రాజమండ్రి పంపించారు. ఎగువ ప్రాంతంలో వరద క్రమేణా పెరుగుతుండటంతో మద్దూరులంక గ్రామానికి వరద ముప్పు పొంచి ఉంది. తహసిల్దార్ పి.కనకరాజు ఆధ్వర్యంలో రెవెన్యూ యంత్రాంగం షిఫ్ట్‌ల వారీగా నియమించారు. నది ఒడ్డున ఉంటున్న 20 కుటుంబాలను మద్దూరు హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించినట్టు తహసిల్దార్ తెలిపారు.