సింగమా... మజాకా!
తెలుగులో మీడియమ్ రేంజ్ హీరో సినిమా బడ్జెట్ 10 నుంచి 15 కోట్లు దాటడం లేదు. అటువంటిది తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం ‘సింగం 3’ తెలుగు వెర్షన్ హక్కులు 18 కోట్ల రూపాయలకు అమ్ముడుపోవడం చర్చనీయాంశమైంది. సూర్యకు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ఆయన సినిమాల్లో ఈ రేంజ్లో అమ్ముడుపోయిన చిత్రం ఇదేనట. తెలుగు, తమిళ భాషల్లో ‘యముడు’, ‘సింగం’ చిత్రాలు భారీ విజయాలు సాధించడంతో ఈ మూడో చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
దాంతో పలువురు నిర్మాతలు ‘సింగం 3’ హక్కులకై పోటీ పడ్డారు. ఈ పోటీలో తెలుగు వెర్షన్ హక్కులను సురక్ష్ ఎంటర్టైన్మెంట్ మీడియా అధినేత మల్కాపురం శివకుమార్ సొంతం చేసుకున్నారు. 18 కోట్ల రూపాయలకు ఆయన హక్కులు దక్కించుకున్నారని సమాచారం. ‘సింగం’ హిట్ ఫార్ములా కాబట్టి సీక్వెల్ని ఇంత భారీ మొత్తానికి కొని ఉంటారని ఊహించవచ్చు. హరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనుష్క, శ్రుతీహాసన్ కథానాయికలు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు.