breaking news
Taliban suicide bombers
-
అఫ్గాన్‌లో ఆత్మాహుతి దాడి
37 మంది మృతి, 40 మందికి గాయాలు కాబూల్: అఫ్గానిస్తాన్‌లోని పఘ్మన్ జిల్లాలో గురువారం జరిగిన రెండు ఆత్మాహుతి బాంబు దాడుల్లో 37 మంది మరణించగా, 40 మంది గాయపడ్డారు. మృతుల్లో 33 మంది పోలీసులున్నారు. అఫ్గాన్ రాజధాని కాబూల్‌కు 20 కి.మీ. దూరంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుందని అధికారులు చెప్పారు. శిక్షణ పోలీసులు వార్డక్ ప్రావిన్స్‌లోని శిక్షణ కేంద్రం నుంచి సెలవుపై దేశ రాజధానికి వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. పఘ్మన్ జిల్లా గవర్నర్ మౌసా రహమతి వివరాల ప్రకారం.. ఉదయం 11 గంటల ప్రాంతంలో శిక్షణ పొందిన పోలీసులతో వెళ్తున్న రెండు బస్సులపై మొదటి ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. పేలుడులో గాయపడ్డవారికి సాయం అందించేందుకు వచ్చిన పోలీసు బృందంపై మరో వ్యక్తి ఆత్మాహుతి దాడి చేశాడు. మృతుల్లో పోలీసులతో పాటు నలుగురు సామాన్య పౌరులు కూడా ఉన్నారు. దేశ అంతర్గత వ్యవహారాల శాఖ ప్రతినిధి మాట్లాడుతూ.. దాడి జరిగిన ప్రాంతాన్ని గుర్తించామని, పెద్ద స్థాయిలో పేలుడు శబ్దం వినిపించిందని, అయితే సంఘటనపై పూర్తి వివరాలు అందాల్సి ఉందన్నారు. దాడికి తామే బాధ్యులమని తాలిబాన్ ఉగ్ర సంస్థ ప్రకటించుకుంది. ఈ మేరకు ఒక వార్తాసంస్థకు తాలిబాన్ ప్రతినిధి జబినుల్లా ముజాహిద్ ఈ-మెయిల్ పంపాడు. శిక్షణ పోలీసులతో వెళ్తున్న బస్సుపై మొదట దాడి చేశామని, 20 నిమిషాల అనంతరం ఘటనా స్థలానికి సాయం చేయడానికి వచ్చిన పోలీసులపై మరొక ఆత్మాహుతి బాంబు దాడికి పాల్పడ్డామని ముజాహిద్ పేర్కొన్నారు. ఈ పేలుళ్లు మానవత్వంపై జరిగిన దాడిగా అఫ్గాన్ అధ్యక్షుడు మహమ్మద్ అస్రఫ్ ఘనీ అభివర్ణించారు. విచారణ జరపాల్సిందిగా దేశ అంతర్గత వ్యవహారాలశాఖను ఆదేశించారు. పవిత్ర రంజాన్ మాసంలో కూర్రమైన చర్యగా కాబుల్‌లోని అమెరికా రాయబార కార్యాలయం పేర్కొంది. -
కాబూల్‌లో తాలిబన్ల దాడి, 40మంది మృతి
కాబూల్: ఆఫ్గనిస్తాన్‌లో ఉగ్రవాదులు మరోసారి మారణహోమం సృష్టించారు. గురువారం కాబూల్‌లో పోలీసుల కాన్వాయ్‌ని లక్ష్యంగా చేసుకుని తాలిబన్లు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దుర్ఘటనలో 40మంది దుర్మరణం చెందగా, పలువురు గాయపడ్డారు. కాగా ఈ దాడికి పాల్పడింది తామేనని తాలిబన్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకున్నట్లు ఆప్గన్ మీడియా వెల్లడించింది. పోలీసులు తమ శిక్షణ పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా ఉగ్రవాదులు ఈ చర్యకు పాల్పడినట్లు భద్రతా అధికారులు తెలిపారు. మొదటి పేలుడు ఖలా-ఈ-హైదర్ ఖాన్ గ్రామ సమీపంలో జరిగిందని, అనంతరం మరో పేలుడు సంబంధించినట్లు పేర్కొన్నారు. పది రోజుల క్రితం ఉద్యోగులు ప్రయాణిస్తున్న మినీ బస్సును ఉగ్రవాదులు పేల్చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 14 మంది మరణించగా, మరో 20 మందికి గాయాలయ్యాయి. కాగా గత ఏప్రిల్ నెలలోనే కాబూల్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 64 మంది మృతి చెందారు.