breaking news
Swargate depot
-
పుణె బస్టాండ్‌లో దారుణం
పుణె: మహారాష్ట్రలోని పుణెలో మంగళవారం ఉదయం స్వార్గేట్ జంక్షన్ బస్టాండ్‌లో ఆగిఉన్న ప్రభుత్వ బస్సులో 26 ఏళ్ల మహిళను ఒక పాత నేరస్తుడు రేప్ చేసి పారిపోయాడు. మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్‌కు చెందిన అత్యంత రద్దీగా ఉండే బస్‌జంక్షన్‌లలో ఒకటైన స్వార్గేట్ బస్టాండ్‌లో ఈ దారుణం చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. విషయం తెల్సుకున్న పోలీసులు ఘటనాస్థలికి వచ్చి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నిందితుడిని 36 ఏళ్ల దత్తాత్రేయ రాందాస్ గాడేగా గుర్తించారు. గతంలో ఇతనిపై దొంగతనం, దోపిడీ, చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి. ఘటనపై పోలీసులు, బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం తెల్లవారుజామున 5.45 గంటలకు సతారా జిల్లాలోని ఫల్టణ్ పట్టణానికి వెళ్లే బస్సు ఎక్కేందుకు బాధిత మహిళ ఈ బస్టాండ్‌లోని ఒక ప్లాట్‌ఫామ్ వద్ద వేచిచూస్తోంది. అదే సమయానికి అక్కడికి వచ్చిన నిందితుడు ‘సోదరీ’ అంటూ ఆమెతో మాటలు కలిపాడు. తాను బస్ కండక్టర్‌ను అని, మీరు ఎక్సాలిన బస్సు సమీపంలో ఆగి ఉందని చెప్పి, సమీపంలో ఆగి ఉన్న ‘శివ్ షాహీ’ ఏసీ బస్సును చూపించాడు. అది మీరు వెళ్లాల్సిన రూట్లో వెళ్తుందని చెప్పి ఆ బస్సు ఎక్కాలని ఆమెకు సలహా ఇచ్చాడు. అతని మాటలు నమ్మిన ఆమె ఎవరూ లేని ఆ బస్సు ఎక్కింది. లైట్లు ఆఫ్ చేసి, చిమ్మచీకటిగా ఉన్న బస్సును ఎక్కేందుకు తొలుత ఆమె తటపటాయించింది. బస్సులో ప్రయాణికులు నిద్రిస్తుండటంతో లైట్లు ఆర్పివేశారని, నచ్చజెప్పి బస్సులో లోపలిదాకా వెళ్లేలా చేశాడు. వెంటనే వెనకాలే వచ్చిన అతను బస్సు తలుపు మూసేసి, ఆమెను రేప్‌చేసి పారిపోయాడని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ స్మార్థనా పాటిల్ చెప్పారు. ఘటన జరిగినప్పుడు బస్టాండ్‌లో ఎన్నో బస్సులు, ఎంతో మంది ప్రయాణికులు ఉన్నారు. మహిళ తనకు జరిగిన అన్యాయంపై వెంటనే ఎవరికీ ఫిర్యాదు చేయలేదు. ఫల్టణ్కు వెళ్లే బస్సు ఎక్కి మార్గమధ్యంలో తన స్నేహితురాలికి ఫోన్‌చేసి ఘోరాన్ని వివరించింది. ఆమె సలహామేరకు బాధితురాలు వెంటనే బస్సు దిగి సమీప పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేసింది. దీంతో పోలీసులు భారతీయ న్యాయ సంహిత చట్టం కింద కేసు నమోదుచేశారు. నిందితుడిని అరెస్ట్చేసేందుకు పోలీసులు ఎనిమిది బృందాలను ఏర్పాటుచేసి వేట మొదలెట్టారు. పోలీస్‌స్టేషన్‌కు ఈ బస్టాండ్ కేవలం 100 మీటర్ల దూరంలో ఉంది. నిందితుడు గతంలో ఒక కేసులో బెయిల్ సంపాదించి 2019 ఏడాది నుంచి బయటే ఉన్నాడు.విపక్షాల విమర్శలు‘‘ఏమాత్రం భయం లేకుండా అసాంఘిక శక్తులు స్వైర విహారం చేస్తున్నాయి. పుణెలో నేరాలను అరికట్టడంలో హోం శాఖ బాధ్యతలు చూస్తున్న సీఎం విఫలమయ్యారు’’ అని ఎన్సీపీ(ఎస్పీ) నాయ కురాలు, ఎంపీ సుప్రియా సూలే విమర్శించారు. -
మానే మరణశిక్షను తోసిపుచ్చిన హైకోర్టు
ముంబై: పుణే బస్ డ్రైవర్ మరణ శిక్షను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. అధికారుల మీద కోపంతో బస్సును అడ్డదిడ్డంగా నడిపి తొమ్మిది మంది మృతికి, 37 మంది గాయాలపాలు కావడానికి కారకుడైన సంతోష్ మానేకు ట్రయల్ కోర్టు ఏప్రిల్ 8న మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. తనకు విధించిన శిక్షపై మానే వాదనను ట్రయల్ కోర్టు వినలేదన్న కారణంతో మానేకు విధించిన మరణ శిక్షను హైకోర్టు తోసిపుచ్చింది. ట్రయల్ కోర్టు విధించిన శిక్షను ఖరారు చేసే సందర్భంలో న్యాయమూర్తి పీవీ హర్దాస్, పీఎన్ దేశ్‌ముఖ్‌లతో కూడిన ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. మానే వాదనను కూడా వినాల్సిన అవసరాన్ని న్యాయస్థానం గుర్తించాలని పేర్కొంది. కేసును మళ్లీ ట్రయల్ కోర్టుకే పంపుతున్నట్లు తెలిపింది. మానే తరఫు వాదనను కూడా వినాలని ట్రయల్ కోర్టుకు సూచిందింది. మానేను అక్టోబర్ 15న ట్రయల్ కోర్టులో హాజరుపర్చాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఆయన తరఫు వాదన కూడా విన్న తర్వాత న్యాయమూర్తి శిక్షను విధించాలని పేర్కొంది. అంతకుముందు జరిగిన వాదనల సమయంలో మానే తరఫు న్యాయవాది జేడీ మానే మాట్లాడుతూ... నిందితుడు మానే తరఫు వాదనలను ట్రయల్ కోర్టు వినలేదని ఆరోపించారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది మాధవీ మాత్రే స్పందిస్తూ... ట్రయల్ కోర్టులో మానే తన వాదన వినిపించినా తీర్పు విషయంలో ఎటువంటి తేడా వచ్చే అవకాశం లేదన్నారు. ఎందుకంటే మానే కేసు ‘అరుదైన వాటిలోకెళ్ల అరుదైన కేసు’గా ఆమె అభివర్ణించారు. ‘అధికారులు తనకు విశ్రాంతినివ్వకుండా పదేపదే విధులను అప్పగిస్తుండడంతో కోపంతో డిపోలోనుంచి బస్సును తీసుకెళ్లి ప్రయాణికులకు వ్యతిరేక దిశలో దూసుకుపోనిచ్చాడు. ఈ సమయంలో మానే పూర్తిగా స్పృహలోనే ఉన్నాడు. భవనాలనుగానీ, డివైడర్లనుగానీ ఢీకొట్టకుండా ప్రజలనే లక్ష్యంగా చేసుకొని మారణకాండను కొనసాగించాడు. ప్రయాణికులను నేరుగా ఢీకొట్టాడు. ఈ ఘటనలో తొమ్మిదిమంది ప్రాణాలు కోల్పోగా 37 మంది క్షతగాత్రులుగా మారారు. వారిలో ఇప్పటికీ ఎంతోమంది వికలాంగులుగా జీవనం సాగిస్తున్నారు. పదుల సంఖ్యలో వాహనాలు ధ్వంసమయ్యాయి. ఇంతటి హేయమైన నేరానికి కోర్టు సరైన శిక్షే విధించింది. ఆయన వాదన విన్నా తీర్పులో ఎటువ ంటి తేడా ఉండే అవకాశం లేదు’అని మాధవి చెప్పారు. అయినప్పటికీ న్యాయస్థానాలు విధించిన శిక్షపై నిందితుడు అభిప్రాయాలను కూడా వినాల్సిన బాధ్యత ఉందని, అందువల్లే కేసును ట్రయల్ కోర్టు పంపుతున్నామని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.