భారత్లో జెట్ వేగంతో ముస్లిం జనాభా!
వాషింగ్టన్: ప్రపంచ జనాభాలో ముస్లిం జనాభా వేగంగా పెరుగుతోందని ఓ అధ్యయనం తెలిపింది. 2050నాటికి హిందువులు మూడో స్థానానికి చేరుకోనుండగా భారత్లో మాత్రం ముస్లిం జనాభా ఆ సమయానికి ఇండోనేషియాను మించిపోతుందని ఆ అధ్యయనం వివరించింది. అమెరికాలోని 'ప్యూ రిసెర్చ్ సెంటర్ రిలీజియస్ ప్రొఫైల్ ప్రిడిక్షన్స్' గురువారం తన అధ్యయన నివేధికను విడుదల చేసింది. దీని ప్రకారం 2050నాటికి హిందువుల జనాభా అమాంతం పెరిగిపోయి మూడో స్థానంలోకి వస్తుందని, ప్రస్తుతం 34శాతం పెరుగుదల నిష్పత్తి ఉందని పేర్కొంది.
ప్రపంచ జనాభాలో 14.9శాతం హిందూ జనాబా ఉండబోతుందని, వీరిలో ఏ మతంతో సంబంధం పెట్టుకోకుండా ఉండేవారు 13.2శాతం ఉంటారని వివరించింది. ఇక ప్రపంచం మొత్తంలో ముస్లిం జనాభా పెరుగుదల శాతం హిందూ, క్రిస్టియన్ల కన్నా వేగంగా ఉందని నివేదిక పేర్కొంది. 'భారత దేశంలో 2050నాటికి హిందువుల జనాభా పెరగొచ్చు. అయితే, ప్రపంచంలో ఏ దేశంలో లేనంత ముస్లిం జనాభా భారత్లో పెరుగుతుంది. అది ఇండోనేషియాను మించిపోతుంది' అని నివేదిక స్పష్టం చేసింది.