మంత్రి కుమారుడికి నోటీసులు
మైసూరు: ఇసుక కాంట్రాక్ట్ ను ఇచ్చేందుకు లంచం తీసుకున్నాడనే ఆరోపణల నేపథ్యంలో కర్ణాటక మంత్రి హెచ్.సీ మహదేవప్ప కుమారుడికి, అతని అనుచరుడికి మైసూరు మూడవ అదనపు జిల్లా కోర్టు నోటీసులిచ్చింది. 2010 సంవత్సరంలో బసవరాజు అనే వ్యక్తికి ఇసుక కాంట్రాక్ట్ ను ఇవ్వడానికి గనులు, భూ విజ్ఞాన శాఖలో పనిచేస్తున్నఅల్ఫోనిస్ రూ. లక్ష లంచం తీసుకుంటూ లోకాయుక్త పోలసులకు చిక్కాడు.
అయితే ఇసుక కాంట్రాక్ట్ ఇవ్వడానికి రూ. లక్ష డిమాండ్ చేయాలని హెచ్.సీ మహదేవప్ప కుమారుడు సునీల్ బోస్, అతని అనుచరుడు రాజు తనపై ఒత్తిడి తెచ్చారని అల్ఫోనిస్ విచారణలో వెల్లడించాడు. అయితే రాజకీయ కారణాలతో ఎఫ్ఐఆర్ లో సునీల్ బోస్ తొలగించడంపై బసవరాజు కోర్టులో ఫిర్యాదు చేశాడు. సునీల్ బోస్ ను రెండవ ముద్దాయిగా, అనుచరుడు రాజును 3 వ ముద్దాయిగా పేర్కొనాలని పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో మైసూరు 3 వ అదనపు జిల్లా కోర్టు సునీల్ బోస్, రాజులకు నోటీసులు జారీ చేసింది.