breaking news
subrahmanyan chandrasekhar
-
Subrahmanyan Chandrasekhar: చుక్కల్లో చంద్రుడు
నక్షత్రాల జీవిత చరిత్రను వెల్లడించిన శాస్త్రజ్ఞులు ప్రపంచంలో కొద్ది మందే ఉన్నారు. వారిలో ఒకరే సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్. నేడు ఆయన జన్మదినం. ఈ సందర్భంగా ఆయన సాధించిన ఘనతను ఒకసారి గుర్తు చేసుకుందాం. అలాగే ఆయనకు ప్రముఖ భౌతిక శాస్త్రేవత్త సర్ సీవీ రామన్‌తో గల సంబంధం ఏమిటో కూడా తెలుసుకుందాం.నక్షత్రాలపై పరిశోధనలు సాగించిన ప్రముఖ శాస్త్రవేత్తలు కోపర్నికస్, గెలీలియో, కెప్లర్, న్యూటర్ మొదలైన వారు వేసిన బాటలో పయనించి, నోబెల్ బహుమతిని సాధించిన సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ దక్షిణ భారతానికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త. ఆయన 1910 అక్టోబర్ 19న అవిభక్త భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రం(ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉంది)లోని లాహోర్ పట్టణంలో సీతాలక్ష్మి, చంద్రశేఖర సుబ్రహ్మణ్య అయ్యర్ దంపతులకు జన్మించారు.హైస్కూలు, కాలేజీ చదువులను మద్రాస్ (చెన్నై)లో పూర్తిచేశారు. 1953లో డాక్టర్ చంద్రశేఖర్ అమెరికా పౌరసత్వం స్వీకరించకపోతే, ఆయనను మన భారతీయ శాస్త్రవేత్తగా ప్రపంచానికి సగర్వంగా ప్రకటించుకునే వాళ్లం. తన 19వ ఏట ఉన్నత విద్యాభ్యాసం కోసం ఓడ మీద ఇంగ్లాండు వెళ్లిన ఆయన ఖగోళ శాస్త్ర సంబంధిత విషయాలపై అధ్యయనం సాగించారు. 1935 జనవరి 11న తన మిత్రుడు విలియం మాక్ క్రీ తో కలిసి ఇంపీరియల్ కాలేజీ నుంచి బర్లింగ్టన్ హౌస్ వెళ్లిన ఆయన తన పరిశోధనా పత్రాన్ని వేదికపై చదివి, భౌతిక ఖగోళ శాస్త్రవేత్తలను మంత్రుముగ్ధులను చేశారు. దీంతో కేంబ్రిడ్జి ట్రినిటి కాలేజీ ఫెలోషిప్‌కు ఎన్నికయ్యారు. అక్కడ సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్‌ను అందరూ ముద్దుగా ‘చంద్ర’ అని పిలిచేవారు.ప్రతి వ్యక్తి జీవితంలో బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్య దశలు ఉన్నట్టే నక్షత్రాల్లోనూ పరిణామ దశలుంటాయని ‘చంద్ర’ తెలిపారు. వీటిలో చెప్పుకోదగ్గవి అరుణ మహాతార (రెడ్‌జెయంట్), శ్వేత కుబ్జ తార (వైట్‌డ్వార్ఫ్), బృహన్నవ్య తార (సూపర్నోవా), నూట్రాన్ తార, కృష్ణ బిలం (బ్లాక్‌హోల్) అనే దశలు ముఖ్యమైనవని పేర్కొన్నారు. తారలపై అవగాహనను పెంచే సిద్ధాంతాలను, పరిశోధనలను అందించిన చంద్రశేఖర్ 1983లో భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందారు.సాపేక్ష, క్వాంటం సిద్ధాంతాల్లోని అంశాల ఆధారంగా నక్షత్రాల పరిణామాలకు సంబంధించిన పరిస్థితులను చంద్రశేఖర్ విశ్లేషించారు. ఒక నక్షత్రం వైట్‌డ్వార్ఫ్ దశకు చేరుకోవాలంటే ఎలాటి పరిస్థితులుండాలో తెలియజేసిన సిద్ధాంతమే 'చంద్రశేఖర్ లిమిట్'గా పేరొందింది. దీని ప్రకారం సూర్యుని ద్రవ్యరాశి కన్నా 1.44 రెట్లకు తక్కువ ద్రవ్యరాశి ఉన్న నక్షత్రాలే వైట్‌డ్వార్ఫ్‌గా మారుతాయి. అంతకు మించిన ద్రవ్యరాశి ఉంటే అవి వాటి కేంద్రకంలోని గురుత్వశక్తి ప్రభావం వల్ల కుంచించుకుపోయి సూపర్నోవాగా, న్యూట్రాన్‌స్టార్‌గా మారుతూ, చివరికి బ్లాక్‌హోల్ (కృష్ణబిలం)గా అయిపోతాయని చంద్రశేఖర్ సిద్ధాంతీకరించారు.ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతులను మన దేశంలో ఒకే కుటుంబంలోని ఇద్దరు మేథావులు సాధించడం ఓ అరుదైన విషయం. వారిలో ఒకరు నోబెల్ పొందిన శాస్త్రవేత్త సర్ సీవీ రామన్ కాగా, రెండో వ్యక్తి ఆయన అన్నకొడుకు సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్. 1995 ఆగస్టు 21న అమెరికాలో తన 85వ ఏట చంద్రశేఖర్ గుండె సంబంధిత వ్యాధితో కన్నుమూశారు. ఇది కూడా చదవండి: భారత దౌత్యవేత్తలపై నిఘా: కెనడా -
భారతీయుడి నమ్మకమే ‘పార్కర్‌కు’ పునాది
న్యూఢిల్లీ: 60 ఏళ్ల క్రితం సౌర గాలులు ఉన్నాయంటూ పార్కర్ ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని భారత సంతతి ఖగోళ భౌతిక శాస్త్రవేత్త సుబ్రమణ్యన్ చంద్రశేఖర్ గుర్తించకుం టే తాజా ప్రయోగం సాకారమయ్యేదే కాదు. సూర్యుడి నుంచి ఆవేశపూరిత కణాలు నిరంతరం అంతరిక్షంలోకి ప్రసారమవుతూ.. అక్కడి ప్రాంతాన్ని నింపుతున్నాయని 1958లో పార్కర్ గుర్తించారు. దీనికి సంబంధించిన పూర్తిస్థాయి విశ్లేషణలతో కూడిన థియరీ పేపర్‌ను ఆస్ట్రోఫిజికల్ జర్నల్‌కు సమర్పించారు. అయితే, ఇద్దరు పరిశోధకులు దీనిని తిరస్కరించారు. దీనికి కారణం అంతరిక్షాన్ని కేవలం శూన్య ప్రదేశంగా భావించే రోజులవి. అయితే ఆ సమయంలో జర్నల్‌కు సీనియర్ ఎడిటర్‌గా ఉన్న చంద్రశేఖర్.. పార్కర్ సిద్ధాంతాన్ని పబ్లిష్ చేయాలని నిర్ణయించారు. చంద్రశేఖర్ ఆ నిర్ణయం తీసుకోకుంటే ఈ ప్రయోగం జరిగేది కాదని ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ వర్కింగ్ గ్రూప్ ఆఫ్ సోలార్ స్టెల్లార్ ఎన్విరాన్మెంట్కు చైర్మన్‌గా పనిచేస్తున్న నంది వెల్లడించారు. నక్షత్రాల నిర్మాణ, పరిమాణ క్రమంలో భౌతిక ప్రక్రియల ప్రాముఖ్యతపై చేసిన పరిశోధనలకు గాను 1983లో ఫిజిక్స్‌లో నోబెల్ బహుమతిని విలియమ్ ఏ ఫోలర్తో కలసి సంయుక్తంగా ఆయన అందుకున్నారు. అలాగే చంద్రశేఖర్ సేవలకు గుర్తుగా 1999లో చంద్రశేఖర్ పేరుతోనే ‘చంద్ర ఎక్స్ రే అబ్జర్వేటరీ’అనే అంతరిక్ష ప్రయోగాన్ని నాసా చేపట్టింది. -
పురస్కారం: సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్
నోబెల్ ఇండియా : ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ పురస్కారం అందుకున్న ప్రముఖ భారతీయులలో సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ ఒకరు. ఈయన చంద్రశేఖర్ వెంకటరామన్ (సి.వి.రామన్) అంతటి ప్రతిభాశాలి. వీరికి 1983లో భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి దక్కింది. ఈ బహుమతిని ఆయన భౌతిక శాస్త్రాధ్యయనంలో తన తొలి గురువైన విలియమ్ ఎ.ఫౌలర్‌తో పంచుకున్నారు. సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్... సర్ సి.వి.రామన్ సోదరుని కుమారుడు. సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ అవిభక్త భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలో లాహోర్ పట్టణంలో (ప్రస్తుత పాకిస్తాన్) 1910, అక్టోబర్ 19వ తేదీన జన్మించారు. ఈయన తండ్రి సుబ్రహ్మణ్య అయ్యర్, తల్లి సీతాలక్ష్మి. సుబ్రహ్మణ్య అయ్యర్ ఆగ్నేయ రైల్వే ఉద్యోగి. ఆయన ఉప-ఆడిటర్ జనరల్ అధికారిగా లాహోర్‌లో పనిచేస్తున్న రోజుల్లో చంద్రశేఖర్ జన్మించారు. చంద్రశేఖర్ చిన్నతనంలో తల్లి దగ్గరే చదువుకున్నారు. ఆయన చదువుకోసం 1922లో కుటుంబం చెన్నైకి మారింది. విద్యాభ్యాసం: చంద్రశేఖర్ చెన్నైలోని హిందూ హైస్కూల్లో చేరారు. తరువాత ఆయన చెన్నై ప్రెసిడెన్సీ కళాశాలలో భౌతికశాస్త్రంలో బీఎస్సీ ఆనర్స్ పట్టా పొందారు. చంద్రశేఖర్ బీఎస్సీ చదివే రోజుల్లో ఆర్నాల్డ్ సోమర్ఫెల్ట్ అనే శాస్త్రజ్ఞుడి ఉపన్యాసానికి ఉత్తేజితుడయ్యాడు. ప్రభుత్వ స్కాలర్‌షిప్‌తో 1930లో ఇంగ్లండు వెళ్లి కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం ట్రినిటీ కాలేజీలో ప్రొఫెసర్ ఫౌలర్ వద్ద రీసెర్చి ప్రారంభించారు. చంద్రశేఖర్‌కు అంతరిక్ష భౌతిక విజ్ఞాన శాస్త్రం అంటే చాలా మక్కువ. ఇంగ్లండుకు బయలుదేరటానికి ముందే విశ్వాంతరాళంలో తారలు ఏర్పడే విధానం, తారలలో జరిగే పరిణామాలు, తారల స్థిరత్వం అనే అంశాలపై పరిశోధనలు జరిపి శాస్త్రజ్ఞులలో గుర్తింపు పొందారు. ట్రినిటీ కళాశాలలో చేసిన పరిశోధనలకు గాను, ఆయనకు 1933వ సంవత్సరంలో అంతరిక్ష శాస్త్రంలో డాక్టరేట్ ప్రదానం చేశారు. ఒక పక్క ట్రినిటీ కళాశాలలో ఉన్నత విద్యనభ్యసిస్తూనే, జర్మనీ దేశంలో గొట్టింగెన్లోని బ్రౌన్ పరిశోధనాలయంలో, కోపెన్ హాగెన్లోని భౌతిక విజ్ఞాన శాస్త్ర సిద్ధాంత సంస్థలోనూ పరిశోధనలు చేశారు. పరమాణు నిర్మాణంపై అద్భుతమైన పరిశోధనలు చేసి పేరుపొందిన నీల్స్‌భోర్ శాస్త్రజ్ఞుడిని స్వయంగా కలుసుకున్నారు. ఆ తరువాతి సంవత్సరంలో ఆయన జీవితంలో మార్పులు వచ్చాయి. వివాహం! సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ 1936, సెప్టెంబర్‌లో లలితా దొరైస్వామిని వివాహమాడారు. లలిత ప్రెసిడెన్సీ కళాశాలలో చంద్రశేఖర్‌కు జూనియర్. అదే సంవత్సరంలో ఆయన అంతరిక్ష శాస్త్రంలో తాను ప్రతిపాదించిన (బ్లాక్ హోల్స్) కృష్ణబిల సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఆర్థర్ ఎడింగ్టన్తో విభేదించి, అమెరికాకు వలస వెళ్లారు. అమెరికాలో ఇల్లినాయిస్ రాష్ట్రంలోని చికాగో యూనివర్సిటీలో భౌతిక, విజ్ఞాన శాస్త్రం అంతరిక్ష శాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా (1937లో) చేరారు. పదవీవిరమణ చేసే వరకు అదే విశ్వవిద్యాలయంలో కొనసాగారు. 1985లో పదవీ విరమణ అనంతరం, ఎమరిటస్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఈ సుదీర్ఘమైన కాలంలో అంతరిక్ష భౌతిక విజ్ఞాన శాస్త్ర రంగంలో అనేక ఫలవంతమైన పరిశోధనలు చేసి, 1983లో భౌతిక విజ్ఞాన శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని అందుకున్నారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో తాను చేరిన తొలి రోజుల్లో ప్రతిపాదించిన చిన్న నక్షత్రాల ద్రవ్యరాశికి గరిష్ట పరిమితి నిర్ణయం ‘చంద్రశేఖర్ పరిమితి’ అనే సిద్ధాంత వ్యాసానికి నోబెల్ పురస్కారాన్ని అందుకున్నారు. ఈయన ఈ పురస్కారాన్ని తన గురువైన డాక్టర్ ఎ.ఫౌలర్‌తో పంచుకున్నారు. అంతరిక్ష భౌతిక విజ్ఞాన శాస్త్రంలో ప్రొఫెసర్ చంద్రశేఖర్ జరిపిన ఫలవంతమైన పరిశోధనలెన్నో ఉన్నా ఆయన తొలి ఆవిష్కరణకే నోబెల్ పురస్కారం అందుకోవటం విశేషం. అంతరిక్షంలో ఏ నక్షత్రానికైనా ద్రవ్యరాశి చంద్రశేఖర్ అవధిలోనే ఉంటుంది. ఉదాహరణకు ‘వైట్ డ్వార్ఫ్’గా పిలవబడే చిన్న నక్షత్రం యొక్క గరిష్ట ద్రవ్యరాశి పరిమితిని చంద్రశేఖర్ క్వాంటమ్ సిద్ధాంతాల ఆధారంగా గణించి, 2.864ఁ 1030 కిలోగ్రాములుగా నిర్ధారించారు. ఈ ద్రవ్యరాశి విలువను దాటితే, ‘న్యూట్రాన్ నక్షత్రాలు’ ఏర్పడతాయని, అవే కృష్ణబిలాలుగా ఏర్పడతాయని, వాటిలోంచి విభిన్నమైన శకల శేషాలు ఆవిర్భావం చెందుతాయని చంద్రశేఖర్ ప్రతిపాదించారు. ఆయనకు రాయల్ సొసైటీ ఫెలోగా 1944లో ‘ఎఫ్.ఆర్.ఎస్’ గుర్తింపు ఇవ్వటం జరిగింది. 1968వ సంవత్సరంలో భారత ప్రభుత్వం చంద్రశేఖర్‌ను ‘పద్మ విభూషణ్’తో సత్కరించింది. సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ 1966లో అమెరికా పౌరసత్వం అందుకున్నారు. ఆయనకు అమెరికా శాశ్వత పౌరసత్వాన్ని ఇచ్చింది. చంద్రశేఖర్ అమెరికా ప్రభుత్వం చేపట్టిన అనేక నాసా పరిశోధనలలో సేవలందించారు. అద్భుత ఆవిష్కరణలను చేశారు. ఆయన సేవలకు గాను నాసావారు ఒక పరిశోధన ప్రయోగశాలకు సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ పేరుపెట్టారు. అంతరిక్ష శాస్త్రంలో ఆయన ఎనిమిదికి పైగా గ్రంథాలను ప్రచురించారు. ఇంతటి అద్వితీయ ప్రతిభాశాలి సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ 1995వ సంవత్సరం ఆగస్టు 21వ తేదీన చికాగోలో గుండె జబ్బుతో మరణించారు. ఆయన పరిశోధనలు మానవాళికి ఎంతో విజ్ఞానాన్నందిస్తాయి. సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ పరిశోధనలు...బిరుదులు... పురస్కారాలు! 1929-39: అంతరిక్ష నిర్మాణం, చంద్రశేఖర్ పరిమితి, అంతరిక్ష గతిశాస్త్ర పరిశోధనలు. 1939-43: న్యూట్రాన్ రేడియేటివ్ ట్రాన్స్ఫర్, రుణాత్మక హైడ్రోజన్ (హైడ్రైవ్ అయాన్)ల క్వాంటమ్ సిద్ధాంతం. 1943-50: హైడ్రో డైనమిక్, హైడ్రో మ్యాగ్నటిక్ స్థిరత్వం. 1950-69: ఎలిప్స్ ఆకృతిగల నిర్మాణాల సమతాస్థితి, స్థిరత్వాలు. 1971-83: కృష్ణబిలాల భౌతిక విజ్ఞాన గణిత సిద్ధాంతం 1980: గురుత్వాకర్షణ తరంగాల పరస్పర తాడనాల సిద్ధాంతం. పదవులు, ఆవిష్కరణలు: 1952-71: అంతరిక్ష భౌతిక విజ్ఞాన శాస్త్ర జర్నల్. 1995 న్యూటన్ సిద్ధాంత సూత్రాల ప్రచురణ. 1983: నోబెల్ పురస్కారం (భౌతిక శాస్త్రంలో). 1968: పద్మ విభూషణ్ పురస్కారం. 1984: కోప్లే మెడల్ 1966: అమెరికా జాతీయ విజ్ఞానశాస్త్ర మెడల్. - డా॥రెబ్బాప్రెగడ రామాంజనేయులు విశ్రాంత రసాయనాచార్యులు