breaking news
stoves
-
పగటిపూట పొయ్యి వెలిగిస్తే చెప్పుదెబ్బలు!
పట్నా: 'ఉదయం తొమ్మిది గంటలు దాటిన తర్వాత పొయ్యి వెలిగించ వద్దు. వెలిగించినవాళ్లకు చెప్పు దెబ్బలతో పాటు జరిమానా వేస్తాం' .. ఇది బిహార్ లోని కొన్ని గ్రామాల్లో వినిపిస్తోన్న దండోరా. రోజురోజుకూ ఎండలు మండిపోతుండటంతో అగ్నిప్రమాదాలను నివారించేందుకు పగటిపూట వంట చేయడానికి వీల్లేదని ఫత్వా జారీచేస్తున్నారు బిహార్ లోని పశ్చిమ చంపారన్ జిల్లా అధికారులు! ఆజ్ఞలు అతిక్రమించిన వారికి రూ.1,000 జరిమానా కూడా ఉంటుందని ప్రకటించారు. రాష్ర్ట విపత్తు నిర్వహణ శాఖ సమాచారం ప్రకారం ఇప్పటివరకు అగ్నిప్రమాదాల మూలంగా 23 మంది పౌరులతో 50 జంతువులు మృత్యువాత పడ్డాయి. ఇల్లు కాలిపోవడంతో 5,742 కుటుంబాలకు నిలువ నీడ లేకుండా పోయింది. ఒక్క పశ్చిమ చంపారన్ జిల్లాలోనే దాదాపు 800 కుటుంబాలు వీధిన పడ్డాయి. ఎక్కువ కుటుంబాలు పూరి గుడిసెల్లో నివాసం ఉంటుండటం వల్ల అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలపై అవగాహన కల్పించడానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు. లక్ష్మీపూర్, పటిలార్, రత్వాల్, లగునహ, సితాపూర్, అహిర్వలియా గ్రామాలు ఉదయాన్నే వంట పూర్తి చేసుకోవడానికి ముందుకొచ్చాయి. మరికొన్ని గ్రామాలు అసలు భోజనం వండుకోకుండా ఉండేందుకు అంగీకరించాయి. రాత్రుళ్లు ఇళ్లలో వెలిగించే దీపాలను కూడా వాడమని మరికొన్ని గ్రామాలు నిర్ణయం తీసుకున్నాయి. బీహార్ రాష్ర్టంలో ఇప్పటివరకు అధికారికంగా 400 అగ్నిప్రమాదాలు జరిగినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. -
‘మధ్యాహ్నా’నికి కట్టెల పొయ్యిలే దిక్కు
నిజాంసాగర్ : మధ్యాహ్న భోజన పథకం అమలుకు ప్రభుత్వం సరఫరా చేసిన గ్యాస్ సిలిండర్లు, స్టౌలు మూలనపడ్డాయి. పాఠశాలల వారీగా అందించిన గ్యాస్ కనెక్షన్లకు ప్రభుత్వం సబ్సిడీని వర్తింపజేయకపోవడంతో వంట ఏజెన్సీలకు కట్టెల పొయ్యిలే దిక్కయ్యాయి. ఇరుకుగా ఉన్న వంటశాల గదులు, వరండాల్లో వంట తయారీకి ఏజెన్సీల నిర్వాహకులు నానా ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. ఒక్క పూట సంపూర్ణ భోజనాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం వంట ఏజెన్సీల కష్టాలపై దృష్టి సారించడం లేదు. పాఠశాలల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్న నిర్వాహకులకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు రెం డు అంచెల పద్ధతిన బిల్లులు చెల్లిస్తున్నాయి. అవి వంట ఏజెన్సీలకు స్లాబ్ ధరలు ఏమాత్రం కడుపునింపడం లేవు. నెలనెలా బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో కార్మికులు, వంట ఏజెన్సీ నిర్వాహకులు అప్పుల పాలవుతున్నా రు. పాఠశాలల గ్యాస్ బండలకు సబ్సిడీ ఇవ్వకపోవడంతో నిర్వాహకులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో కట్టెలపొయ్యిలనే ఆశ్రయిస్తున్నారు. జిల్లాలో 2,303 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నాయి. ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు ఒక్క పూట సంపూర్ణ భోజనాన్ని అందిస్తున్నారు. 2 లక్షల కు పైగా విద్యార్థులు మధ్యాహ్న భోజనం లబ్ధిపొందుతున్నారు. పథకం అమలును పర్యవేక్షిస్తున్న అధికారులు.. వంట ఏజెన్సీ నిర్వాహకుల ఇబ్బందులను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. విద్యార్థులకు ఒక్కపూట సంపూర్ణ భోజనాన్ని అందిస్తున్న ప్రభుత్వం స్లాబ్రేట్లను పెంచకపోవడంతో కార్మికులు కష్టాలను ఎదుర్కుంటున్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉన్న విద్యార్థులకు రూ. 4.35, ఆరు నుంచి పదో తరగతి వరకు ఉన్న విద్యార్థులకు రూ. 6 చొప్పున వంట ఏజెన్సీలకు బిల్లులను చెల్లిస్తోంది. ప్రభుత్వం వంట కార్మికులకు చెల్లిస్తున్న బిల్లులు నిర్వాహకులకు ఏమాత్రం సరిపోకపోవడంతో అప్పులపాలవుతున్నారు. సిలిండర్లను సబ్సిడీపై సరఫరా చేయకపోవడంతో కట్టెల పొయ్యిలపైనే వంట చేస్తున్నారు. దీంతో సిలిండర్లను, గ్యాస్ స్టౌలను మూలన పడేశారు.