breaking news
Sri Manmadha Nama
-
శ్రీమన్మథ నామ సంవత్సర ఫలితాలు
ఈ సంవత్సరం రాజు శని, మంత్రి, సైన్యాధిపతి కుజుడు, సస్యాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు, ఆర్ఘాధిపతి, మేఘాధిపతి చంద్రుడు, రసాధిపతి రవి, నీరసాధిపతి శుక్రుడు. నవనాయకుల్లో ఐదుగురు శుభులు, మిగతా నలుగురు పాపులు. అలాగే 21 మంది ఉపనాయకుల్లో 12 మంది శుభులు, 9 మంది పాపులు. రాజు శని కాగా, మంత్రి, సైన్యాధిపతి కుజుడు కావడం వల్ల రాజకీయంగా కొంత గడ్డుస్థితి ఏర్పడే అవకాశాలున్నాయి. పాలనాపరంగా కొన్ని ప్రతిబంధకాలు పాలకులకు తలనొప్పిగా మారే సూచనలు. అలాగే, ఇరుగుపొరుగు దేశాలతో ఉద్రిక్తతలు ఏర్పడవచ్చు. ప్రజల మధ్య అకారణంగా వివాదాలు నెలకొనే సూచనలు. కొన్ని ప్రాంతాలలో పంటలు విశేషంగానూ, మరికొన్ని ప్రాంతాల్లో సాధారణ స్థాయిలో ఉంటాయి. అన్ని రకాల ధాన్యాలు, పప్పుధాన్యాల ధరలు పెరుగుతాయి. శాస్త్రసాంకేతిక, పరిశోధనా రంగాలు మరింత పుంజుకుంటాయి. సస్యాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు కావడం వల్ల తెలుపు, ఆకుపచ్చని ధాన్యాల దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది. మేఘాధిపతి చంద్రుడు కావడం వల్ల తూర్పు, ఆగ్నేయ ప్రాంతాల్లో అధికంగానూ, మిగతా ప్రాంతాలలో మధ్యస్థంగానూ వర్షాలు పడతాయి. రాజు శని కావడం వల్ల ఒక కుంచం వర్షం పడుతుంది. ఇందులో 10 భాగాలు సముద్రంలోనూ, 7 భాగాలు పర్వతాలపైన, ఒక భాగం భూమిపైన కురుస్తుంది. ఈ ఏడాది వర్షలగ్నం సింహం అయినది. లగ్నాధిపతి రవి మీనరాశిలో వ్యయాధిపతి అయిన చంద్రునితోనూ, చతుర్ధ, భాగ్యాధిపతి అయిన కుజ, కేతువులతో కలయిక, ధన స్థానంలో రాహువు, ధనాధిపతి, లాభాధిపతి అయిన బుధునికి సప్తమస్థితి, తృతీయ, రాజ్యాధిపతి శుక్రునికి భాగ్యస్థితి, పంచమ, అష్టమాధిపతి అయిన గురునికి వ్యయస్థితిలో ఉచ్ఛస్థితి కలిగింది. ఇక జగల్ల్లగ్నం పరిశీలించగా లగ్నం సింహమే అయినది. ద్వితీయంలో రాహువు, ద్వితీయ, లాభాధిపతి అయిన బుధుడు కేతువుతో కలిసి నీచస్థితి అయిన అష్టమస్థితి, తృతీయ , రాజ్యాధిపతి అయిన శుక్రునికి స్వక్షేత్రమైన దశమ స్థితి, లగ్నాధిపతి రవి ఉచ్ఛపొంది చతుర్ధ, భాగ్యాధిపతి కుజునితో కలిసి భాగ్యస్థితి, పంచమ, అష్టమాధిపతి గురునికి వ్యయస్థితి. వ్యయాధిపతి అయిన చంద్రునికి సప్తమస్థితి, షష్ఠమ, సప్తమాధిపతి శనికి అర్థాష్టమస్థితి కలిగింది. జగల్ల్లగ్నంలో లగ్నాధిపతి రవికి ఉచ్ఛస్థితి కలిగి మేషరాశిలో భాగ్యాధిపతి కుజునితో చేరిక విశేష యోగప్రదం. మొత్తం మీద కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా ప్రజలకు అనుగుణంగా పాలకులు వ్యవహరించే అవకాశాలున్నాయి. కేంద్ర, రాష్ట్రాల మధ్య కొన్ని వివాదాలు, పాలకుల మధ్య వైషమ్యాలు తప్పకపోవచ్చు. ఆర్థిక పరిపుష్టి కలగడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా దేశ ప్రతిష్ట ఇనుమడిస్తుంది. కొన్ని విషయాలలో మనదేశానిదే కీలకపాత్రగా మారవచ్చు. కొన్ని ప్రాంతాలలో మతకలహాలు వ్యాపించినా పాలకుల చర్యల వల్ల అదుపులోకి వస్తాయి. మధ్యప్రాంతం, ఉత్తర, ఈశాన్య ప్రాంతాల్లో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఆస్తి, జననష్టాలు సంభవించే సూచనలు. సంతృప్తికరమైన వర్షాలు కురుస్తాయి. సస్య, జలసమృద్ధి. వ్యవసాయరంగం పుంజుకుంటుంది. కొన్నిరకాల ఆహార ఉత్పత్తులు పెరుగుతాయి. ముఖ్యంగా మిర్చి, గోధుమలు, ధాన్యం, అపరాల దిగుబడులు పెరుగుతాయి. రైతులకు గిట్టుబాటు ధరలు లభిస్తాయి. శాస్త్రసాంకేతిక రంగాలకు నూతన జవసత్వాలు చేకూరతాయి. మన మేధోసంపత్తికి అంతర్జాతీయంగా తగిన గుర్తింపు రాగ లదు. బంగారం, ఇతర లోహాల ధరలు విశేషంగా పెరుగుతాయి.కళలు, క్రీడారంగాలకు మంచి గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తుంది. కళాకారులకు గతం కంటే మెరుగైన కాలమనే చెప్పాలి. రక్షణరంగం ప్రాధాన్యత పెరుగుతుంది. జ్యేష్ఠ మాసం ప్రారంభంలో తొలకరి జల్లులు పడవచ్చు. ప్రజల్లో ధార్మిక చింతన పెరుగుతుంది. వైశాఖమాసంలో అకాల వర్షాలు, గాలిదుమారాలు, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిర మాసాల్లో కొన్ని ప్రాంతాల్లో భూకంపాలు, తుపాన్లు, ప్రజాందోళనలు, విస్ఫోటనలు సంభవించే అవకాశం. ప్రముఖులకు గడ్డుస్థితి. తెలుగు రాష్ట్రాల్లో కొత్త ఉద్యమాలు, కొత్త నాయకులు పుట్టుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాలనలో కొన్ని చిక్కులు ఎదురుకావచ్చు.22.06.2015వ తేదీ అధిక ఆషాఢ శు.షష్ఠి తత్కాల సప్తమి సోమవారం రాత్రి 12.29 గంటలకు పుబ్బ నక్షత్రం, సిద్ధియోగం, గరజి కరణం, మీనలగ్నమందు రవి ఆరుద్రా నక్షత్రంలో ప్రవేశం. ఈరీత్యా చూస్తే సర్వత్రా శుభదాయకమే. ఆశాజనకమైన వర్షాలు పడతాయి.ఈ ఏడాది పశుపాలకుడు బలరాముడు, గోష్టప్రాపకుడు, గోష్టబహిష్కర్త శ్రీకృష్ణుడు కావడం వల్ల పశుసంపద, పాడిపరిశ్రమ అభివృద్ధి చెందుతుంది. పాల ఉత్పత్తులు విశేషంగా పెరుగుతాయి. వీటిపై ఆధారపడే వారికి మంచిరోజులే. ఉగాది నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు అఢకం(కుంచం) గోపబాలుని చేతిలోనూ, తదుపరి సంవత్సరాంతం వరకూ యవ్వన గోపబాలకుని చేతిలోనూ ఉండడం వల్ల సస్యానుకూలత, సుభిక్షంగా ఉంటుంది. నవనాయకుల ఫలాలు ⇒ రాజు శని కావడం వల్ల పాలకుల మధ్య వివాదాలు, కలహాలు. చోరభయాలు, ధరలు ఆకాశాన్నంటుతాయి. పంటలు మధ్యస్థంగా ఉంటాయి. నీతి నిజాయితీలు లోపిస్తాయి. ⇒మంత్రి కుజుడు కావడం వల్ల వర్షాలు కొన్ని ప్రాంతాల్లో అధికంగానూ, కొన్ని ప్రాంతాల్లో తక్కువగానూ పడతాయి. ప్రజల్లో మానసిక ఆందోళన, పాలకుల మధ్య అపార్థ్ధాలు. యుద్ధభయాలు నెలకొంటాయి. ఎర్రని ధాన్యాలు బాగా పండుతాయి. ⇒సేనాధిపతి కుజుడు కావడం వల్ల విచిత్రమైన వ్యాధులు, ప్రజల మధ్య పరస్పర వైరాలు, పాలకుల మధ్య సఖ్యత లోపించడం, ఇరుగుపొరుగు దేశాల మధ్య వివాదాలు నెలకొంటాయి. ⇒సస్యాధిపతి శుక్రుడు కావడం వల్ల మెట్ట, మాగాణి భూములు సమృద్ధిగా పండుతాయి. పంటల ఉత్పత్తులు పెరుగుతాయి. పట్టు, ఉన్ని, సుగంధ ద్రవ్యాల ధరలలో తగ్గుదల కనిపిస్తుంది. ⇒ధాన్యాధిపతి బుధుడు కావడం వల్ల సామాన్య వర్షాలు, ప్రజల్లో భయాందోళనలు, ఆకుపచ్చని పంటలు పండి గిరాకీ పెరుగుతుంది. ⇒ఆర్ఘాధిపతి చంద్రుడు కావడం వల్ల అన్ని రకాల పంటల ఉత్పత్తులు ఆశాజనకంగా ఉంటాయి. ధరలు పెరుగుతాయి. ప్రజలు, పాలకుల మధ్య సుహృద్భావ వాతావరణం ఉంటుంది. ⇒మేఘాధిపతి చంద్రుడు కావడం వల్ల మంచి వర్షాలు, పాలదిగుబడులు పెరుగుతాయి. కొన్ని ప్రాంతాలలో విశేష వర్షాలు. ⇒రసాధిపతి రవి కావడం వల్ల నువ్వులు, పండ్లు, నూనెలు, బెల్లం వంటి వాటి ధరలు కొంత తగ్గుతాయి. వేరుశనగ, నెయ్యి ధరలు పెరుగుతాయి. అధికారులకు శ్రమ మరింతగా పెరుగుతుంది. ⇒నీరసాధిపతి శుక్రుడు కావడం వల్ల బంగారం, వజ్రాలు, మంచిగంధం, ముత్యాలు, వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు, కొబ్బరి ధరలు పెరుగుతాయి. -
శ్రీ మన్మథ నామ సంవత్సర రాశి ఫలాలు - 2015
మేషం (ఆదాయం -14, వ్యయం-14, రాజపూజ్యం-3, అవమానం-6) వీరికి గురుడు జూలై 14 నుంచి మరింత యోగకారకుడు. అష్టమ శని దోషం ఉన్నప్పటికీ గురుబలం వల్ల నెట్టుకొస్తారు. చేపట్టిన కార్యాలు కొంత నెమ్మదించినా క్రమేపీ పుంజుకుంటాయి. ఆదాయం ఆశించినంతగా లేక కొత్తగా రుణాలు చేయాల్సివస్తుంది. బంధువర్గంతో తరచూ వివాదాలు నెలకొంటాయి. వ్యవహారాలలో అంచనాలు తప్పే అవకాశం. ఆరోగ్యపరంగా చికాకులు తద్వారా ఔషధసేవనం. ఇంటి నిర్మాణం, కొనుగోలు యత్నాలు జూలై 14 తరువాత అనుకూలిస్తాయి. జనవరి 29 నుంచి రాహుకేతువుల సంచారం మరింత అనుకూలం. శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేయాల్సివస్తుంది. వ్యాపారాలు కొంత మందగించినా ఆశించిన లాభాలు దక్కుతాయి. ఉద్యోగులు పనిభారంతో కొంత సతమతమవుతారు. అయితే కోరుకున్న బదిలీలు, పదోన్నతులు పొందుతారు. పారిశ్రామిక, శాస్త్రసాంకేతిక రంగాల వారు నిర్ణయాలలో ఆచితూచి ముందుకు సాగాలి. తరచూ విదేశీ పర్యటనలు సాగిస్తారు. రాజకీయ నాయకులకు కొంత ఇబ్బందికర పరిస్థితి నెలకొన్నా ద్వితీయార్థంలో పదవీయోగాలు క లిగే సూచనలు. కళాకారులకు గతం కంటే మెరుగ్గా ఉంటుంది. వ్యవసాయదారులకు రెండవ పంట విశేషంగా లాభిస్తుంది. విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితం దక్కించుకుంటారు. న్యాయవాదులు, వైద్యులు, పరిశోధకులకు ఈ ఏడాది కలసివచ్చే కాలం. జ్యేష్ఠం, శ్రావణం, మాఘ మాసాలు అనుకూలం. మిగతావి సామాన్యం. అదృష్టసంఖ్య-9. పరిహారాలు: శనికి తైలాభిషేకాలు, శివునికి అభిషేకాలు చేయించుకోవాలి. అలాగే, సుందరకాండ పారాయణ మంచిది. శనివార నియమం పాటించడం ఉత్తమం. వృషభం (ఆదాయం-8, వ్యయం-8, రాజపూజ్యం-6, అవమానం-6) వీరికి జూలై వరకు గురుబలం అంతగాలేదు. తదుపరి కొంత మెరుగుపడుతుంది. అలాగే, శని సప్తమస్థితి అనుకూలం కాదు. ఇక జనవరి 28 వరకు రాహు, కేతువుల స్థితి అనుకూలం. తదుపరి సంవత్సరాంతం వరకు అనుకూలం కాదు. మొత్తం మీద వీరికి సామాన్యంగానే ఉంటుంది. ముఖ్యమైన పనులు శ్రమానంతరం పూర్తి కాగలవు. ఆర్థికంగా కొంత ఇబ్బందికరమే. రుణదాతల నుంచి ఒత్తిడులు తప్పకపోవచ్చు. ముఖ్య నిర్ణయాలలో తొందరపాటు చర్యలు వద్దు. జీవిత భాగస్వామి, బంధుమిత్రులతో అకారణంగా తగాదాలు, ఆస్తి వివాదాలు, కోర్టు వ్యవహారాలు కొంత చికాకు పరుస్తాయి. మీ విధానాలను, ప్రతిపాదనలను కుటుంబసభ్యులే వ్యతిరేకిస్తారు. ఇతరుల విషయాలలో జోక్యం ద్వారా చిక్కుల్లో పడే అవకాశం ఉంది. జూలై నుంచి గురుబలం కారణంగా కొంత ఆశాజనకంగా ఉంటుంది. రాబడి స్వల్పంగా పెరుగుతుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. వాహన, గృహయోగాలు కలిగే అవకాశం. వ్యాపారులు స్వల్ప లాభాలతో సరిపెట్టుకోవాలి. ఉద్యోగులు విధి నిర్వహణలో జాగరూకతతో మెలగాలి. పారిశ్రామిక, శాస్త్రసాంకేతిక, వైద్యరంగాల వారికి క్రమేపీ అనుకూల పరిస్థితి ఉంటుంది. కళాకారులు ద్వితీయార్థంలో విజయాల బాటలో సాగి అభివృద్ధి చెందుతారు. నిరుద్యోగులకు కొంత నిరాశ ఎదురైనా ప్రభుత్వ నిర్ణయాలతో ఊరట చెందుతారు. విద్యార్థులు శ్రమానంతరం మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యవసాయదారులకు రెండవ పంట లాభిస్తుంది. జనవరి 29 నుంచి అర్ధాష్టమ రాహువు కారణంగా ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ముఖ్యంగా నరాలు, ఉదర సంబంధిత రుగ్మతలు బాధించవచ్చు. వైశాఖం, ఆషాఢం, శ్రావణం, పుష్య మాసాలు అనుకూలం. మిగతావి సామాన్యం. అదృష్టసంఖ్య-6. పరిహారాలు: శనికి తైలాభిషేకాలు, రుద్రాభిషేకాలు, దుర్గామాతకు కుంకుమార్చనలు మంచిది. మిథునం (ఆదాయం -11, వ్యయం-5, రాజపూజ్యం- 2, అవమానం-2) వీరికి అర్థాష్టమ రాహువు ప్రభావం ఉన్నా గురు, శని అనుకూల సంచారంకలసివస్తుంది. జూలై నుంచి గురుడు తృతీయరాశి సంచారమైనా మూర్తిమంతం చేత శుభుడు కావడం వల్ల అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. తరచూ శుభకార్యాల రీత్యా ఖర్చులు ఎదురవుతాయి. దూరమైన వారు తిరిగి దగ్గరవుతారు. మీపట్ల ద్వేషభావం చూపిన వారే ప్రేమానురాగాలు కురిపిస్తారు. ఆస్తివ్యవహారాలలో కొత్తగా ఒప్పందాలు చేసుకుంటారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. వివాహయత్నాలు సానుకూలం. నిరుద్యోగులకు శుభవార్తలు. ఒక ఆప్తుని ద్వారా లబ్ధి పొందుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. అనుకున్న పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు పదోన్నతితో కూడిన బదిలీలు ఉండవచ్చు. పారిశ్రామిక, వైద్య, సాంకేతికరంగాల వారు మంచి గుర్తింపు పొందుతారు. పరిశోధకులకు ఈ సంవత్సరం శుభదాయకమైన కాలం. కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. అవార్డులు కూడా దక్కవచ్చు. వ్యవసాయదారులకు రెండుపంటలూ అనుకూలిస్తాయి. రాజకీయవర్గాల వారికి మిశ్రమంగా ఉంటుంది. విద్యార్థుల కృషి ఫలించి మంచి ర్యాంకులు సాధిస్తారు. జనవరి వరకు అర్థాష్టమ రాహువు వల్ల ఆరోగ్యం కొంత ఇబ్బందిపెట్టవచ్చు. ముఖ్యంగా చర్మ, ఉదర సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి. చైత్రం, వైశాఖం, నిజ ఆషాఢం, ఆశ్వయుజం, పుష్యమాసాలు అనుకూలం. మిగతావి సామాన్యం. అదృష్టసంఖ్య-5. పరిహారాలు: వీరు హనుమాన్ చాలీసా, ఆదిత్య హృదయం పఠించడం, దుర్గామాతకు కుంకుమార్చనలు చేయడం మంచిది. కర్కాటకం (ఆదాయం -5, వ్యయం-5, రాజపూజ్యం- 5, అవమానం-2) వీరికి ఈ సంవత్సరమంతా గ్రహసంచారం అనుకూలమనే చెప్పాలి. జూలై నుంచి గురుడు మరింత విశేషయోగకారకుడు. రాహువు, శని అనుకూల సంచారం కలిసివస్తుంది. మొత్తం మీద వీరికి పట్టింది బంగారమే అన్నట్లుంటుంది. ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా సాగుతుంది. తరచూ తీర్థయాత్రలు సాగిస్తారు. బంధువులు, మిత్రుల నుంచి ఊహించని విధంగా ఆర్థిక లాభాలు ఉంటాయి. గతం కంటే రాబడి మరింతగా పెరుగుతుంది. సంఘంలో విశేష గౌరవప్రతిష్ఠలు పొందుతారు. మీ నిర్ణయాలకు తిరుగుండదు. జూలై నుంచి స్థిరాస్తి వృద్ధి. వాహన, గృహయోగాలు, శుభకార్యాల నిర్వహణ రీత్యా ఖర్చులు ఉంటాయి. కొత్త వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. వ్యాపారస్తులు పెట్టుబడులు రెట్టింపు చేస్తారు. అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు, ఇంక్రిమెంట్లు. పారిశ్రామికవర్గాలు, పరిశోధకులు, న్యాయ, సాంకేతికరంగాల వారికి విశేష కాలమనే చెప్పాలి. విద్యార్థులు మంచి ర్యాంకులు పొందుతారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. రాజకీయ నాయకులకు పదవీయోగాలు. కళాకారులకు అవకాశాలు ఆశ్చర్యపరుస్తాయి. రివార్డులు, అవార్డులు పొందుతారు. వ్యవసాయదారులకు రెండవ పంట మరింత లాభిస్తుంది. జనవరి నుంచి రాహుసంచారం వల్ల ఆరోగ్యపరంగా శ్రద్ధ వహించండి. వీరికి జ్యేష్ఠం, నిజ ఆషాఢం, ఆశ్వయుజం, కార్తీకం, పుష్య మాసాలు అనుకూలం. మిగతావి సామాన్యం. అదృష్టసంఖ్య-2. పరిహారాలు: సుందరకాండ పారాయణం, శివాలయంలో అభిషేకాలు మంచిది. సింహం (ఆదాయం -8, వ్యయం-14, రాజపూజ్యం- 1, అవమానం-5) వీరికి జూలై నుంచి గురు సంచారం అనుకూలమైనందున అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నా ఏదోవిధంగా నెట్టుకొస్తారు. రాహు, కేతువుల సంచారం కూడా అనుకూలం కాదు. మొత్తం మీద మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా ఫర్వాలేదనిపించినా కొత్త రుణాల కోసం యత్నించాల్సి వస్తుంది. కుటుంబసభ్యులతో తరచూ వివాదాలు. చేపట్టిన కార్యక్రమాలు మందకొడిగానే సాగుతాయి. మీ నిర్ణయాల పట్ల వ్యతిరేకత ఎదురవుతుంది. తరచూ ప్రయాణాలు సాగించే వారు విలువైన సామగ్రిని జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. ఇతరుల చేత మాటపడాల్సిన సమయం. ప్రతి విషయంలోనూ సొంత ఆలోచనలతో ముందుకు సాగడం శ్రేయస్కరం. వ్యాపారులు పెట్టుబడులతో తొందరపడకపోవడమే మంచిది. ఉద్యోగులు అదనపు పనిభారంతో సతమతమవుతారు, పైస్థాయి వారి నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. పారిశ్రామిక , వైద్య, సాంకేతిక, పరిశోధనారంగాల వారికి అంచనాలు తప్పుతాయి. రాజకీయవర్గాల వారికి పదవులు ఊరిస్తాయి. కళాకారులు అనుకున్న అవకాశాలు సైతం జారవిడుచుకుని నిరాశ చెందుతారు. వ్యవసాయదారులకు రెండు పంటలూ సామాన్యంగా ఉంటాయి. నిరుద్యోగులకు శ్రమ తప్పదు. విద్యార్థులు మరింతగా కృషి చేస్తే మంచి ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యపరంగా చికాకులు ఎదురవుతాయి. అధిక ఆషాఢం, శ్రావణం, ఆశ్వయుజం, కార్తీకం, మాఘ మాసాలు అనుకూలం. మిగతావి సామాన్యం. అదృష్టసంఖ్య-1. పరిహారాలు: శనికి తైలాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చనలు, రుద్రాభిషేకాలు మంచిది. కన్య (ఆదాయం -11, వ్యయం-5, రాజపూజ్యం- 4, అవమానం-5) వీరికి జూలై వరకు గురుడు విశేష యోగప్రదుడు, తదుపరి సామాన్యం. అలాగే, శని యోగదాయకుడు. రాహు, కేతువులు దోషప్రదులు. మొత్తం మీద వీరికి ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది. సంఘంలో గౌరవప్రతిష్ఠలకు లోటు ఉండదు. స్థిరాస్తి వృద్ధి. శత్రువులు మిత్రులుగా మారతారు. ఆర్థికంగా కొంత వెసులుబాటు ఉంటుంది. వివాహాది శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. ఓర్పు, నేర్పుతో అనుకున్న కార్యాలలో విజయం సాధిస్తారు. వాక్చాతుర్యంతో అందర్నీ ఆక ట్టుకుంటారు. పెండింగ్లో ఉన్న కోర్టు కేసుల నుంచి విముక్తి లభిస్తుంది. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలలో కదలికలు. కొత్త వ్యక్తుల పరిచయం. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారస్తులు అనుకున్న లాభాలు పొందుతారు. ఉద్యోగులకు విధుల్లో ఆటంకాలు తొలిగే అవకాశం. పారిశ్రామిక, శాస్త్రసాంకేతిక రంగాల వారికి మిశ్రమంగా ఉంటుంది. కళాకారులు జారవిడుచుకున్న అవకాశాలను దక్కించుంటారు. కొందరికి సన్మాన, సత్కారాలు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. విద్యార్థులకు శ్రమ ఫలిస్తుంది. రాజకీయ నాయకుల పదవీయత్నాలు కలిసివస్తాయి. వ్యవసాయదారులకు మొదటి పంట లాభిస్తుంది. జూలై నుంచి గురు సంచారం అనుకూలం కానందున ఆరోగ్యపరంగా చికాకులు. ముఖ్యంగా నడుము, నేత్ర సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి. వృథా ఖర్చులు తప్పవు. ఇతరుల చేత మాటపడతారు. చైత్రం, అధిక ఆషాఢం, శ్రావణం, కార్తీకం, మార్గశిరం,పుష్య మాసాలు అనుకూలం. మిగతావి సామాన్యం. అదృష్టసంఖ్య-5. పరిహారాలు: సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకాలు, గురునికి పరిహారాలు మంచిది. తుల (ఆదాయం -8, వ్యయం-8, రాజపూజ్యం- 7, అవమానం-1) వీరికి జూలై నుంచి గురుడు విశేషయోగదాయకుడై శుభాలనిస్తాడు. ఏల్నాటి శని ప్రభావం, జనవరి వరకూ రాహు సంచారం అనుకూలం కాదు. మొత్తం మీద వీరికి శుభాశుభమిళితమై ఉంటుంది. జూలై వరకూ కొన్ని ఈతిబాధలు, కుటుంబంలో చికాకులు తప్పకపోవచ్చు. ఆర్థికంగా కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. రుణయత్నాలు సాగిస్తారు. విలువైన వస్తువులు జారవిడుచుకుంటారు. మిత్రులు, బంధువర్గంతో విభేదాలు. జూలై నుంచి గురుని అనుకూలత వల్ల ఆకస్మిక ధనలాభాలు. యత్నకార్యసిద్ధి. ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారతారు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. గృహ, వాహనయోగాలు కలుగుతాయి. వ్యాపారులకు మొదట్లో కొంత మందగించినా క్రమేపీ లాభాల దిశగాసాగుతారు. ఉద్యోగులకు పనిభారం ఉన్నా గుర్తింపు లభిస్తుంది. పారిశ్రామిక, వైద్య, పరిశోధనారంగాల వారు గతం కంటే కొంత మెరుగైన ఫలితాలు పొందుతారు. కళాకారుల కృషి ఫలిస్తుంది. రాజకీయవర్గాల వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. వ్యవసాయదారులకు రెండవపంట లాభిస్తుంది. నిరుద్యోగుల కల ఫలించే సమయం. విద్యార్థులకు శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది. ఏల్నాటి శని ప్రభావం వల్ల ఆరోగ్యపరంగా ముఖ్యంగా చర్మ, ఉదర, నేత్ర సంబంధిత రుగ్మతలు బాధించవచ్చు. చైత్రం, అధిక ఆషాఢం, కార్తీకం, మాఘమాసాలు అనుకూలం. మిగతావి సామాన్యం. అదృష్టసంఖ్య-6. పరిహారాలు: శ నికి తైలాభిషేకాలు, దుర్గామాతకు కుంకుమార్చనలు, హనుమాన్ చాలీసా పఠనం మంచిది. వృశ్చికం (ఆదాయం -14, వ్యయం-14, రాజపూజ్యం- 3, అవమానం-1) వీరికి శని ప్రభావం ఉన్నా జూలై వరకు గురుడు, రాహుకేతువుల అనుకూల సంచారం కలిసివస్తుంది. మొత్తం మీద వీరికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభంలో ఆర్థికంగా బలం చేకూరుతుంది. రావలసిన సొమ్ము అందుతుంది. అయితే ఖర్చులు కూడా అదేస్థాయిలో ఉంటాయి. సంఘంలో గౌరవమర్యాదలకు లోటు ఉండదు. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారి చేయూతనందిస్తారు. బంధువులతో వివాదాలు నెలకొన్నా చాకచక్యంగా సర్దుబాటు చేసుకుంటారు. గృహం, వాహనాల కొనుగోలు యత్నాలు సానుకూలం. వివాహాది శుభకార్యాల నిర్వహణకు డబ్బు వెచ్చిస్తారు. జూలై నుంచి వివాదాలకు దూరంగా ఉండండి. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపారులు కొద్దిపాటి లాభాలతో సరిపెట్టుకోవాలి. ఉద్యోగులకు మార్పులు అనివార్యం. పారిశ్రామిక, శాస్త్రసాంకేతిక రంగాల వారికి కొంత నిరాశాజనకంగా ఉంటుంది. నిర్ణయాలలో ఆచితూచి అడుగువేయాలి. కళాకారులకు కొంతమేరకు కృషి ఫలిస్తుంది. విద్యార్థులకు శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు మంద కొడిగా సాగినా విజయం సాధిస్తారు. వ్యవసాయదారులకు మొదటి పంట సానుకూలం. రాజకీయవర్గాలకు పదవులలో ఒడిదుడుకులు తప్పవు. శని ప్రభావం వల్ల ఆరోగ్యపరంగా చికాకులు, ఔషధసేవనం, ఆప్తుల చేత మాట పడాల్సివస్తుంది. చోరభయం. చైత్రం, నిజ ఆషాఢం, శ్రావణం, కార్తీకం, పుష్యమాసాలు అనుకూలం. మిగతావి సామాన్యం. అదృష్టసంఖ్య-9. పరిహారాలు: శనికి తైలాభిషేకాలు, సుబ్రహ్మణ్యాష్టకం పఠనం మంచిది. ధనుస్సు (ఆదాయం -2, వ్యయం-8, రాజపూజ్యం- 6, అవమానం-1) వీరికి ఏల్నాటిశని ప్రభావం, జూలై వరకు అష్టమ గురుని ప్రభావం వల్ల ఆర్థిక ఇబ్బందులు, రుణయత్నాలు. కార్యక్రమాలలో అవరోధాలు, బంధువిరోధాలు. శ్రమ తప్ప ఫలితం ఉండదు. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. జూలై 14 నుంచి గురుని భాగ్యస్థితి కారణంగా డబ్బుకు లోటు ఉండదు. అయితే ఖర్చులు కూడా పెరుగుతాయి. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. మీ సత్తా చాటుకుని కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. ఒక పెండింగ్ కేసు నుంచి బయటపడతారు. ఇంటి నిర్మాణ యత్నాలు ఫలిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. పెట్టుబడులు ఆలస్యమవుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు సవాలుగా మారినా సమర్థతను నిరూపించుకుంటారు. పారిశ్రామికవేత్తలు, పరిశోధకులు, సాంకేతిక నిపుణులకు నిరుత్సాహం తప్పదు. కళాకారులకు అవకాశాలపై అసంతృప్తి. విద్యార్థులు మరింత శ్రమపడాల్సిన సమయం. నిరుద్యోగులకు ఒక ప్రకటన ఊరటనిస్తుంది. వ్యవసాయదారులకు రెండవ పంట అనుకూలిస్తుంది. ఏల్నాటి శని ప్రభావం వల్ల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించండి. ముఖ్యంగా నరాలు, చర్మ, ఉదర సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి. వైశాఖం, అధిక ఆషాఢం, శ్రావణం,ఆశ్వయుజం, మార్గశిరం, మాఘ మాసాలు అనుకూలం. మిగతావి సామాన్యం. అదృష్టసంఖ్య- 3. పరిహారాలు: శనికి తైలాభిషేకాలు, రుద్రాభిషేకాలు, సుందరకాండ పారాయణ మంచిది. మకరం (ఆదాయం -5, వ్యయం-2, రాజపూజ్యం- 2, అవమానం-4) వీరికి ఈ సంవత్సరమంతా గ్రహాల అనుకూల సంచారం కలిసివస్తుంది. సంఘంలో విశేష గౌరవమర్యాదలు పొందుతారు. ఇష్టకార్యసిద్ధి. దూరమైన ఆప్తులు తిరిగి దగ్గరకు చేరతారు. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. కోర్టు కేసులు పరిష్కారమవుతాయి. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఇంటిలో వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. ఇతరుల మెప్పు పొందుతారు. ఒక వ్యక్తి ద్వారా సహాయసహకారాలు అందుకుంటారు. వ్యాపారులకు లాభాలు అందుతాయి. కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు ప్రథమార్థంలో పదోన్నతులు, ఇంక్రిమెంట్లు. పారిశ్రామిక, వైద్య, శాస్త్రసాంకేతిక రంగాల వారికి చెప్పుకోతగ్గ అభివృద్ధి ఉంటుంది. కళాకారులకు అవకాశాలు మరింతగా పెరగడంతో పాటు సన్మానాలు అందుకుంటారు. రాజకీయవర్గాల వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. ప్రజాదరణ పొందుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు. విద్యార్థులకు కృషి ఫలిస్తుంది. వ్యవసాయదారులకు రెండుపంటలూ లాభిస్తాయి. జూలై 14 నుంచి గురుని అష్టమస్థితి కారణంగా ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా నడుము, నరాలు, నేత్ర సంబంధిత రుగ్మతలు బాధించవచ్చు. మంచికి వెళ్లినా చెడుగా మారే అవకాశం. కొంత అప్రమత్తత అవసరం. చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, మార్గశిరం, మాఘ మాసాలు అనుకూలం. మిగతావి సామాన్యం. అదృష్టసంఖ్య- 8. పరిహారాలు: గురునికి జపాదులు, దుర్గాదేవికి కుంకుమార్చనలు చేయించుకుంటే మంచిది. కుంభం (ఆదాయం -5, వ్యయం-2, రాజపూజ్యం 5, అవమానం-4) వీరికి జూలై 14వరకు గురుడు ఓ మోస్తరుగానూ, తదుపరి విశేషయోగదాయకుడై ఉంటాడు. జనవరి 29 వరకు అష్టమ రాహువు, ద్వితీయంలో కేతువు, శని సంచారం అనుకూలం కాదు. మొత్తం మీద మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. ఆర్థిక ఇక్కట్లు. రుణయత్నాలు. మానసిక అశాంతి. శత్రుభయం. కొన్ని కార్యక్రమాలు మందగించినా ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తి వివాదాలు కాస్త చికాకు పరుస్తాయి. సోదరులు, సోదరీలతో అకారణంగా వైరం. వాహనాలు, ఆరోగ్య విషయాలలో నిర్లక్ష్యం తగదు. ఒక కోర్టు వ్యవహారం ప్రతిబంధకంగా మారవచ్చు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. పెట్టుబడులు ఆలస్యమవుతాయి. ఉద్యోగ వర్గాలకు ఊహించని మార్పులు, కొత్త బాధ్యతలు. పారిశ్రామికవేత్తలు, పరిశోధకులు, శాస్త్రసాంకేతిక రంగాల వారికి నిరుత్సాహం. కళాకారులకు మిశ్రమంగా ఉంటుంది. విద్యార్థులు మరింత కృషి చేయాలి. వ్యవసాయదారులకు రెండవ పంట అనుకూలిస్తుంది. రాజకీయవర్గాలకు ద్వితీయార్థంలో పదవీయోగం. అయితే జూలై నుంచి గురుని అనుకూల సంచారం కాస్త ఊరటనిస్తుంది. ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలలో అనుకూలత. వైశాఖం, భాద్రపదం, మార్గశిరం, ఫాల్గుణమాసాలు అనుకూలం. అదృష్టసంఖ్య- 8. పరిహారాలు: శని, రాహుకేతువులకు పరిహారాలు. దుర్గామాతకు కుంకుమార్చనలు, ఆదిత్య హృదయం పఠనం మంచిది. మీనం (ఆదాయం -2, వ్యయం-8, రాజపూజ్యం- 1, అవమానం-7) వీరికి జూలై14 వరకు గురుడు విశేష యోగకారుడు. కార్యజయం. ధనలాభం. బంధువులతో సంతోషంగా గడుపుతారు. భూ, గృహయోగాలు కలుగుతాయి. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు. మీ నిర్ణయాలకు కుటుంబసభ్యులు ఆమోద ముద్ర వేస్తారు. శుభకార్యాల రీత్యా ఖర్చులు. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. జూలై 14 నుంచి గురునికి షష్ఠమ స్థితి, శని, రాహుకేతువుల సంచారం అంత అనుకూలం కాదు. ఈ రీత్యా చూస్తే లేనిపోని సమస్యలు. మానసిక అశాంతి. కుటుంబ సభ్యులతో తగాదాలు. ఉదర, నేత్ర, నరాల సంబంధిత రుగ్మతలు, త ద్వారా ఖర్చులు. వ్యాపారులకు కొద్దిపాటి లాభాలు. ఉద్యోగులకు అనుకోని బదిలీలు, ఒత్తిడులు. పారిశ్రామిక, శాస్త్రసాంకేతిక వర్గాలకు కొంత అనుకూలత ఉంటుంది. రాజకీయ నాయకులకు ప్రథమార్థంలో పదవీయోగం. కళాకారులకు అవకాశాలు కొంత అసంతృప్తి కలిగిస్తాయి. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. నిరుద్యోగుల యత్నాలు ప్రథమార్థంలో అనుకూలిస్తాయి. వ్యవసాయదారులకు మొదటి పంట లాభదాయకం. మొత్తం మీద మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, అధిక ఆషాఢం, భాద్రపదం, పుష్య, మాఘ మాసాలు అనుకూలం. మిగతావి సామాన్యం. అదృష్టసంఖ్య- 3. పరిహారాలు: కుజ, గురు, రాహుకేతువులకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. అలాగే, విష్ణుసహస్రనామ పారాయణ, హనుమాన్ చాలీసా పఠనం చేయాలి. -
పుష్కర నిర్ణయం
దేవగురుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తాయి. గురుడు మేష రాశిలో ప్రవేశంతో గంగానది, వృషభం -నర్మద, మిథునం- సరస్వతీ, కర్కాటకం- యమున, సింహం-గోదావరి, కన్య-కృష్ణా, తుల-కావేరి, వృశ్చికం- తామ్రపర్ణీనది, ధనుస్సు-పుష్కర వాహిని, మకరం- తుంగ భద్ర, కుంభం-సింధు, మీనం-ప్రణీతానదులకు పుష్కరాలు జరుగుతాయి. పుష్కరాలు 12 రోజుల పాటు జరుగుతాయి. ఈ పన్నెండు రోజులు నదీ స్నానాలు, దానధర్మాలు పుణ్యఫలాన్నిస్తాయి. ఈ ఏడాది అధిక ఆషాఢ బ. త్రయోదశి మంగళవారం అనగా 14.07.15వ తేదీ ఉ.6.24 గంటలకు మఖ నక్షత్రం మొదటి పాదం సింహరాశిలో గురుడు ప్రవేశం. 14.07.2015 నుండి గోదావరి నదీ పుష్కరాలు ప్రారంభమై 25.07.2015వ తేదీ వరకు కొనసాగుతాయి. ఈ పవిత్ర పుష్కర సమయంలో స్నాన, దాన, జప, అర్చన, ధ్యాన, హోమ, తర్పణాది అనుష్ఠానాలకు, పిండ ప్రదానానికి అక్షయమైన పుణ్యం లభిస్తుందని శాస్త్రోక్తి. పుష్కర కాలంలో చేసే ఆయా కర్మల వలన శారీరక, మానసిక మలినాలు తొలగి పవిత్రత, ఆధ్యాత్మిక తేజస్సు కలుగుతాయి. బంగారం, వెండి, భూమి, ధనం, గోవులు, ధాన్యం, లవణం, రత్నాలు, అశ్వం, పండ్లు, బెల్లం, వస్త్రాలు, తైలం, శాకములు, తేనె, పీట, అన్నం, పుస్తకం... ఇలా ఎవరి శక్తిని బట్టి వారు రోజుకు ఒకటి లేదా రోజుకు కొన్ని చొప్పున దానం చెయ్యడం వల్ల ఈ లోకంలో సుఖసంపదలు పొందడంతోపాటు అంత్యమున ముక్తి కలుగుతుందని రుషి ప్రమాణం. ఈ పన్నెండు రోజులు గోదావరిలో స్నానాదులు, పూజలు, దానధర్మాలతోపాటు పితృదేవతలకు పిండ ప్రదానాలు చేస్తే పుణ్యఫలం కలుగుతుంది. గోదావరికి ఏడాది తర్వాత అంత్యపుష్కరాలు కూడా వస్తాయి. ఈ కాలంలోనూ ఇదే విధంగా ఆచరించడం పరిపాటి. పుష్కరాలలో స్నానం చేస్తే పన్నెండు సంవత్సరాలపాటు ఆ నదులలో నిత్యం స్నానం చేసినంత పుణ్య ఫలం లభిస్తుంది. జన్మజన్మల పాపాలు నశించి, మోక్షప్రాప్తి కలుగుతుంది. అశ్వమేధయాగం చేసినంత ఫలం కన్న రెట్టింపు ఫలం పుష్కరస్నానం వల్ల లభిస్తుంది. నర్మదా నదీతీరంలో తపస్సు, కురుక్షేత్రంలో దానం, పరమ పవిత్రమైన కాశీక్షేత్రంలో మరణించడం వల్ల కలిగే ఫలం కేవలం పుష్కర స్నానం వల్ల కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఏ నదికి పుష్కరాలు సంభవిస్తున్నాయో ఆ నదిపేరును మనం స్నానం చేసేటప్పుడు ముమ్మారు మనస్సులో తలచుకున్నా కొంతమేర పుష్కర స్నాన ఫలితం పొందొచ్చునని శాస్త్రవచనం. పుష్కర స్నాన విధి ముందుగా పుష్కర నదికి ప్రార్థన చేసి తీరంలో ఉండి మట్టిని మూడుసార్లు నీటిలో వేసి తరువాత సంకల్ప సహితంగా పుష్కర స్నానం చేయాలి. పితృదేవతలకు తర్పణం, తీర్థోపవాసం చేయాలి. మృత్తికా స్నానం, పుష్కర స్నానం చేసి ముక్కోటి దేవతలకు, మునులకు తర్పణ విడవాలి. మళ్లీ ప్రవాహానికి అభిముఖం గా స్నానం చేయాలి. ఆయా నదీ పుష్కరాలలో పూజలు నిర్వహించిన వారికి దీర్ఘాయుష్షు లభిస్తుందని పురాణ గాథలు విదితం చేస్తున్నాయి. మొదటి రోజు నారాయణుని, రెండోరోజు భాస్కరుని, మూడోరోజు మహర్షులను.. ఇలా పన్నెండు రోజులపాటు 12 మంది అధిదేవతలను పూజించి చివరి రోజున 12 దానాలు చేస్తారు. ఒక్కో దానానికి ఒక్కో ఫలితం ఉంటుంది. అలాగే ఒక్కొక్క రోజు ఒక్కో శ్రాద్ధం నిర్వహిస్తారు. తొలిరోజు హిరణ్యశ్రాద్ధం, తొమ్మిదవ రోజు అన్నశ్రాద్ధం, 12వ రోజున ఆమశ్రాద్ధం తప్పనిసరిగా నిర్వహించాలి.