హత్యాయత్నం చేశారంటూ ఎమ్మెల్సీపై ఫిర్యాదు
రాయ్ బరేలి: కాంగ్రెస్ ఎమ్మెల్సీ దినేష్ ప్రతాప్ సింగ్ సహా 11 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని రాయ్ బరేలిలో జరిగింది. ఓ వ్యక్తిపై హత్యాయత్నం, దౌర్జన్యం కేసులో వీరిపై ఐపీసీ సంబంధిత సెక్షన్లలో కేసు నమోదు చేశామని ఎస్పీ మోహిత్ గుప్తా వివరించారు. కురౌలి దామా గ్రామంలో రోడ్డు పనుల ప్రారంభంచేసే సమయంలో తలెత్తిన గొడవలో వీరు నిందితులుగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. జిల్లా పంచాయతీ సభ్యుడు రాజేంద్ర ప్రసాద్ సోదరుడు రాజేష్ ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు. అయితే రాజేంద్ర ప్రసాద్ పేరు శిలాఫలకం మీద రాయలేదని అడిగినందుకు వారి మధ్య గొడవ జరిగింది. ఎమ్మెల్యే సెక్యూరిటీ సిబ్బంది రాజేష్ పై దాడికి పాల్పడ్డారని తెలిపారు.
రాజేష్‌ను అక్కడినుంచి తప్పించే యత్నంలో కాన్వాయ్ వాహనాలు కూడా దెబ్బతిన్నాయని ఓ అధికారి గుప్తా వివరించారు. తనను చంపేందుకు ప్రయత్నించారని, దౌర్జన్యం చేశారని బాధితుడు రాజేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ దినేష్ ప్రతాప్ సింగ్ సహా 11 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఎస్పీ గుప్తా పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు కూడా ఈ దాడిలో గాయపడ్డారని, ఎమ్మెల్సీ తరఫు వ్యక్తి రామ్ సుగర్ సింగ్ రాతపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చినట్లు చెప్పారు. జిల్లా మెజిస్ట్రేట్ ను కలిసి నిష్పక్షపాతంగా ఈ కేసుపై విచారణ జరిపించాలని ఎమ్మెల్సీ కోరారని ఎస్పీ గుప్తా వివరించారు.