సమాధుల అపార్ట్మెంట్..
ఇప్పుడంతా అపార్ట్మెంట్స్దే హవా.. సొంత జాగా కొనుక్కోవాలంటే బోలెడంత డబ్బు కావాల్సి రావడం.. ఇల్లు కట్టించుకోవడానికి మరింత ఖర్చుపెట్టాల్సి రావడంతో అత్యధికులు అపార్ట్మెంటుల్లోనే సెటిలైపోతున్నారు. బ్రిటన్‌లోని సోమర్సెట్లో ఆ పరిస్థితి శ్మశానవాటికలకూ వచ్చేసింది. సోమర్సెట్లోని బాన్వెల్ శ్మశానవాటికలో 70 సమాధులకే చోటుందట. వాళ్ల లెక్క ప్రకారం 15 ఏళ్లలో శ్మశానవాటిక ఫుల్ అయిపోతుంది. అయితే దీనికి గ్రీన్ఏకర్ సొల్యూషన్స్ అనే సంస్థ ఓ పరిష్కారాన్ని కనుగొంది. అది ఇదే. సమాధుల అపార్టుమెంట్.
ఒక్క సమాధి పట్టే స్థలంలో నలుగురిని ఖననం చేసేలా ఏర్పాటు ఉంటుంది. మామూలు సమాధితో పోలిస్తే.. దీన్ని బాగా లోతుగా తవ్వుతారు. పేటికలను ఒకదానిపై ఒకటి అమరుస్తారు. అయితే.. ఇది ఒక కుటుంబానికి చెందినవారికి మాత్రమే ఇస్తారు. అంటే.. ఆ ఇంట్లో తాత, తండ్రి ఇలా వారి సమాధులన్నీ ఒకేచోట ఉంటాయన్నమాట.
దీని వల్ల శ్మశానవాటిక జీవిత కాలం 40 ఏళ్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. తొలుత అదనపు భూమిని కొనుగోలు చేయడానికి సిద్ధపడిన బాన్వెల్ శ్మశానవాటిక వర్గాలు ప్రస్తుతం ఈ విధానాన్ని అమలు చేసే విషయంపై గ్రీన్ఏకర్ సొల్యూషన్స్‌తో చర్చలు జరుపుతున్నారు.