లక్షలు వెచ్చించారు..గాలికొదిలేశారు
చీరాల, న్యూస్‌లైన్: పోతేపోనీ జనం సొమ్మేకదా..అనే ధోరణిలో ఉంది చీరాల మున్సిపల్ యంత్రాగం. లక్షలాది రూపాయలు వెచ్చించి చేపట్టిన నిర్మాణాలు నిరుపయోగంగా ఉంటున్నాయి. ప్రజల అవసరాలు, పట్టణాభివృద్ధిపై పాలకులు శ్రద్ధ చూపడంలేదు. మున్సిపాలిటీ నిధులు 13 లక్షలతో అన్ని హంగులతో నిర్మించిన స్కేటింగ్ కోర్టును 2008లో ప్రారంభించారు. మొదట్లో కొంతకాలం పెద్ద ఎత్తున యువకులు, చిన్నారులు వచ్చి ఇక్కడ స్కేటింగ్ నేర్చుకునేందుకు అలవాటు పడ్డారు. వివిధ కళాశాలలకు చెందిన యువకులు ఎక్కువగా వస్తుండటంతో ఒక కోచ్‌ను కూడా ఏర్పాటు చేసేందుకు మున్సిపల్ అధికారులు అప్పట్లో ప్రయత్నించారు. అయితే ఆ తర్వాత కాలంలో స్కేటింగ్ నేర్పించేందుకు వచ్చిన ఓ మాజీ కౌన్సిలర్ కోర్టుకు రావడం మానివేయడంతో అప్పటి నుంచి అది మూతపడింది. దీంతో స్కేటింగ్ నేర్చుకునేందుకు ఆసక్తిగా వచ్చిన యువకులు, చిన్నారులు మెల్లగా రావడం మానేశారు.
ఇటువంటి పరిస్థితుల్లో మున్సిపల్ కమిషనర్ గానీ, ఇతర అధికారులు కానీ స్కేటింగ్ కోర్టు గురించి పట్టించుకోలేదు. కోచ్‌ను ఏర్పాటు చేస్తే అందుకు అవసరమైన జీతం తాము భరిస్తామని నేర్చుకునేందుకు వచ్చిన యువకులు, చిన్నారులు ముందుకొచ్చారు. అయినా ఫలితం లేకుండా పోయింది. వారి ప్రతిపాదనను ఆలకించేవారు లేకపోవడంతో మూడేళ్ల నుంచి స్కేటింగ్ కోర్టు నిరుపయోగంగా మారింది. లక్షలాది రూపాయలతో నిర్మించిన స్కేటింగ్ కోర్టును మళ్లీ అందుబాటులోకి తీసుకురావాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.