‘ఖండేరీ’ జలప్రవేశం
• నౌకాదళ అమ్ములపొదిలోకి
• రెండో స్కార్పిన్ జలాంతర్గామి
ముంబై: భారత నౌకాదళం అమ్ములపొదిలోకి స్కార్పిన్ తరగతికి చెందిన మరో జలాంతర్గామి ‘ఖండేరీ’ చేరింది. ముంబైలో మజగావ్ డాక్ నౌకా నిర్మాణ కేంద్రం నుంచి జలాంతర్గామిని గురువారం జల ప్రవేశం చేయించారు. శత్రువుల నిఘాకు చిక్కకుండా అత్యాధునిక సాంకేతికతతో నిర్మించిన ఈ జలాంతర్గామి నుంచి శత్రు లక్ష్యాలపై విధ్వంసక దాడి చేయవచ్చు. అలాగే ట్యూబుల ద్వారా నౌకా విధ్వంసక క్షిపణులను ప్రయోగించవచ్చు.
కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సుభాష్ భమ్రే ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా... ఆయన సతీమణి బినా జలాంతర్గామిని ప్రారంభించారు. పరీక్షలు పూర్తయ్యాక ఈ ఏడాది చివరికల్లా నేవీకి అప్పగిస్తారు. ఉష్ణ మండల ప్రాంతాల్లో కూడా ఏ సమస్యలు లేకుండా పనిచేస్తుంది. నౌకాదళంలోని ఇతర విభాగాల నుంచి కూడా ఆపరేట్ చేసేలా కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
ఖండేరీ... ఒకప్పటి మరాఠా దళం పేరు
17వ శతాబ్దంలో సముద్రంపై ఆధిపత్య పోరులో ప్రముఖ పాత్ర పోషించిన మరాఠా దళం ఖండేరీ పేరును దీనికి పెట్టారు. ఫ్రాన్స్‌కు చెందిన డీసీఎన్ కంపెనీ నిర్మిస్తోన్న స్కార్పియో జలాంతర్గాములు డీజిల్–ఎలక్ట్రిక్ ఇంధనంగా పనిచేస్తాయి. మజగవా డాక్స్‌లో ఆరు జలాంతర్గాములను తయారుచేస్తున్నారు.