breaking news
Sipras
-
గ్రీస్‌లో అధికార మార్పిడి
ఏథెన్స్ : గ్రీస్‌లో జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాని అలెక్సిస్ సిప్రాస్ ఓటమి పాలయ్యారు. కిరియాకోస్ మిత్సోటకిస్ నేతృత్వంలోని న్యూడెమోక్రసీ పార్టీ, సిప్రాస్ నేతృత్వంలోని సిరిజా పార్టీపై గెలుపు సాధించింది. 75 శాతానికి పైగా ఓటింగ్ జరిగిన ఈ ఎన్నికల్లో న్యూడెమోక్రసీ పార్టీ 39.6 ఓట్లు సాధించి అధికారం కైవసం చేసుకొంది. ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న దశాబ్ద కాలం తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు వచ్చింది. ఓటమిని అంగీకరించిన సిప్రాస్ దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెంకించడానికి చేయాల్సిందంతా చేశానని, అయితే గ్రీకు ప్రజల తాజా నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని తెలిపారు. గ్రీక్ ప్రజలకు కిరియాకోస్ మిత్సోటకిస్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానిగా అధ్యక్ష నివాసంలో ఆయన పదవీ స్వీకార ప్రమాణం చేశారు. గ్రీస్‌కు ముందున్న సవాళ్లు తెలుసని.. పారదర్శక పాలన, మరింత యోగ్యతతో మనం స్వరం యూరప్‌లో ఇకనుంచి గట్టిగా వినిపిస్తుందని మిత్సోటకిస్ అన్నారు. దేశాన్ని మరింత ప్రైవేటీకరణ దిశగా, బిజినెస్ ఫ్రెండ్లీగా మారుస్తానని హామీ ఇచ్చారు. బ్యాంకింగ్ సెక్టార్లో పనిచేసిన ఈ పూర్వ హార్వర్డ్ విద్యార్థి 2013-15 మధ్య మంత్రిగా కూడా పనిచేశారు. గ్రీస్ సంక్షోభం దశాబ్దకాలంగా ఆర్థిక సంక్షభంలో కూరుకొని ‘యూరప్ సమస్యల పిల్లాడు’ అని ముద్ర వేసుకున్న గ్రీస్‌లో ఏ రాజకీయ పరిణామం జరిగినా యూరప్ యూనియన్ దేశాలు నిశితంగా గమనిస్తాయి. 2015కు పూర్వం గ్రీస్ దివాళా తీసే దిశగా ప్రయాణించింది. దీంతో వామపక్ష భావాలు ఉన్న ఆకర్షణగల నేత సిప్రాస్ నేతృత్వంలోని సిరాజ్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రజలకు సరికొత్త పాలన అందిస్తానని, గ్రీస్ కష్టాలు తొలగాలంటే గ్రెగ్జిట్(యూరోపియన్ యూనియన్నుంచి బయటికి రావడం) కావాలని ఎన్నికల సమయంలో సిప్రాస్ పదేపదే చెప్పారు. పెట్టుబడీదారీ వ్యవస్థతో ముడిపడి ఉన్న ఈ దేశంలో వామపక్ష పార్టీ అధికారంలోకి రావడం జరగదని రాజకీయ పండితులు భావించారు. కానీ అనూహ్యంగా సిప్రాస్ అధికారంలోకి వచ్చారు. గ్రెగ్జిట్పై రెఫరెండం నిర్వహించగా మెజార్టీ ప్రజలు అనుకూలంగానే తీర్పుఇచ్చారు. ఈ పరిమాణంతో యూరోపియన్ యూనియన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కానీ సిప్రాస్ చివరి నిమిషంలో యూరప్ ఆర్థిక శక్తివంతులు జర్మనీ, ఫ్రాన్స్ తదితర దేశాల ఒత్తిడికి తలొగ్గారు. గ్రెగ్జిట్ను పక్కన పెట్టడమే గాక ఎన్నికల సమయంలో వ్యతిరేకించిన బెయిల్ అవుట్ ఒప్పందాన్ని తిరిగి చేసుకుని ప్రభుత్వం పెట్టే సంక్షేమ ఖర్చులో కోత విధించడం మొదలుపెట్టారు. దీంతో ప్రజలలో తీవ్ర ఆగ్రహం వక్తమైంది. గ్రీస్ ఆందోళనలతో అట్టుడుకింది. దీనికితోడు సిరియా, ఇరాక్‌ల నుంచి శరణార్థుల వలసలు కూడా గ్రీకు ప్రజలలో ఆందోళన పెంచాయి. దీంతో జాతీయతవాదం బయలుదేరి ఈ ఎన్నికలలో సిప్రాస్ ఓటమి పాలయ్యారని విశ్లేషకులు అంటున్నారు. సిప్రాస్ పాలనలో యూరప్‌కు దూరం జరిగిన గ్రీస్, సంస్కరణవాదిగా పేరుతెచ్చుకున్న కిరియాకోస్ వల్ల తిరిగి యూరప్ ప్రధాన స్రవంతిలో కలుస్తుందని, ఈ విజయంతో యూరప్‌ను ఆవహించిన వామపక్ష ఆకర్షణ భయాలకు కొంతకాలం తెరపడినట్లేనని అభిప్రాయపడుతున్నారు. -
గ్రీస్ దారెటు?
రుణదాతల షరతులపై రిఫరెండం నేడే ఏథెన్స్: అప్పుల్లో పీకల్లోతు కూరుకుపోయిన గ్రీస్ భవితను తేల్చే రిఫరెండం నేడు(ఆదివారం) జరగనుంది. మరో బెయిలవుట్ ప్యాకేజీ ఇవ్వడానికి రుణదాతలు విధిస్తున్న షరతులకు ఓకే చెప్పాలా లేదా అన్నదానిపై జరుగుతున్న రిఫరెండంలో ప్రజలు దేనికి ఓటేస్తారోనని ప్రపంచ దేశాలు ఎదురుచూస్తున్నాయి. యూరోజోన్‌లో గ్రీస్ కొనసాగాలా లేదా అనేది రిఫరెండంపై ఆధారపడి ఉంది. షరతులకు తలొగ్గద్దని, షరతులకు ఒప్పుకోబోమని రిఫరెండంలో తేల్చి చెప్పాలని నిర్వహించిన ర్యాలీలో గ్రీస్ ప్రధాని సిప్రాస్ పాల్గొన్నారు. అయితే, గ్రీస్ ఆర్థిక పరిస్థితులతో విసిగిపోయిన సగం మంది ప్రజలు ఎలాగోలా బెయిలవుట్ ప్యాకేజీ వస్తే కష్టాలు తీరతాయనే ఉద్దేశంతో.. షరతులకు ఓకే చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. రెఫరెండంకి సంబంధించి నిర్వహించిన పోల్స్‌లో 44.8% మంది అనుకూలంగా, 43.4 % మంది వ్యతిరేకంగా ఉన్నట్లు తేలింది. షరతులేంటి.. గ్రీస్ ఇప్పటికే రెండు బెయిలవుట్ ప్యాకేజీలు దక్కించుకుంది. అయినా కష్టాలు పోలేదు. ఈ నేపథ్యంలో మరో ప్యాకేజీ ఇవ్వాలంటే గ్రీస్ ప్రభుత్వం బడ్జెట్లో కోతలు, పన్నుల పెంపు, కఠిన సంస్కరణలు అమలు చేయాలని రుణదాతలు షరతులు పెట్టారు. వీరికి నో చెప్పడం ద్వారా రుణదాతలతో బేరసారాలకు వీలు దొరుకుతుందన్నది గ్రీస్ ప్రభుత్వం వాదన. యూరోపియన్ యూనియన్, ఐఎంఎఫ్‌లు కలిసి 2010 నుంచి గ్రీస్‌కు సుమారు 240 బిలియన్ యూరోల రుణాలిచ్చాయి. నో చెబితే.. రిఫరెండంలో షరతులకు ప్రజలు నో చెబితే నిధుల కొరతతో బ్యాంకులు మూతబడి గ్రీస్ మరింత సంక్షోభంలోకి వెళ్తుంది. ఇంధనం నుంచి ఔషధాల దాకా ప్రతీ దానికీ కొరత ఏర్పడవచ్చు. యూరోజోన్‌లో భాగంగా యూరో కరెన్సీలో ఉన్న గ్రీస్ ఇకమీదట కొత్తగా సొంత కరెన్సీని ముద్రించుకోవాలి. గ్రీస్ బ్యాంకుల దగ్గర ప్రస్తుతం సుమారు బిలియన్ యూరోల నిధులు ఉన్నాయి. ఇవి సోమవారం దాకా సరిపోతాయి. రిఫరెండంలో నో చెబితే బ్యాంకులకు యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ నుంచి నిధులు రావు. కొత్త డీల్ కుదుర్చుకోవడంలో ప్రధాని విఫలమైతే ఆయన గద్దె దిగాల్సిన పరిస్థితి వస్తుంది. ఓకే చెబితే.. ప్రజలు రిఫరెండంలో యస్ అని చెబితే, ప్రధాని వైదొలగాల్సి రావొచ్చు. ఎన్నికలు నిర్వహించాలి. అయితే, దేశ ఆర్థిక పరిస్థితులు అధ్వానంగా ఉన్న తరుణంలో ఎన్నికలు నిర్వహించడమన్నది కష్టసాధ్యం కావొచ్చు. దీంతో అధికారిక సిరిజా పార్టీలోనే మితవాదిగా కాస్త పేరున్న ఉప ప్రధాని యానిస్ డ్రాగాసాకిస్ లాంటి వారికి పగ్గాలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి.