కాంగ్రెస్ టీం ఖరారు!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాజకీయ విశ్లేషకుల ఊహకు కూడా అందని విధంగా కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంటు అభ్యర్థిని ఎంపిక చేసింది. కేసీఆర్‌ను ధీటుగా ఎదుర్కొనే సత్తా ఉన్న వారినే బరిలో ఉంచుతామని సంకేతాలు పంపిన ఏఐసీసీ వర్గాలు ఎన్నికకు ముందే ఓటమి ఒప్పుకున్నట్లుగా నిర్ణయం తీసుకున్నారు.
జిల్లా రాజకీయాల్లో పెద్దగా అనుభవం లేని డాక్టర్ శ్రవణ్‌కుమార్‌రెడ్డి పేరును మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించడంతో కార్యకర్తలు, నాయకులు ఆశ్చర్యపోయారు. జహీరాబాద్ పార్లమెంటుకు సిట్టింగ్ ఎంపీ సురేష్ షెట్కర్ పేరునే ఖరారు చేశారు. ఈ మేరకు ఆదివారం రాత్రి పార్లమెంట్ అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్‌పార్టీ ప్రకటించింది.
ఏఐసీసీ అధికార ప్రతినిధి రణదీప్ ఢిల్లీలో వెల్లడించారు.అయితే అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో దామోదర పేరు ప్రకటించిన ఆయన, ఆ తర్వాత త్వరలోనే మెయిల్ ద్వారా జాబితా పంపుతామంటూ ప్రకటన నిలిపివేశారు. అనంతరం కొద్దిసేపటికే అభ్యర్థుల జాబితా నిలిపివేసినట్లు వార్తలందాయి.
మళ్లీ పాతవారికే!
ఇక ముందుగా ఊహించినట్టుగానే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మరోసారి ఆవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. గత నెల 28న ‘సాక్షి’ వెల్లడించిన పేర్లనే దాదాపుగా ఏఐసీసీ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జిల్లాలో ఉన్న 8 మంది సిట్టింగుల్లో దాదాపు అన్నిచోట్ల మళ్లీ పాతకాపులకే టికెట్లు ఖరారు చేసినట్లు సమాచారం.
ఆందోల్- దామోదర రాజనర్సింహ, సంగారెడ్డి- జగ్గారెడ్డి, పటాన్చెరు-నందీశ్వర్‌గౌడ్, దుబ్బాక-చెరుకు ముత్యంరెడ్డి, గజ్వేల్-నర్సారెడ్డి, జహీరాబాద్-గీతారెడ్డి, నర్సాపూర్-సునీతా లక్ష్మారెడ్డి, నారాయణఖేడ్-కిష్టారెడ్డి, మెదక్-విజయశాంతి పేర్లు ఖరారయినట్లు తెలుస్తోంది. అనుకోని పరిస్థితులేమైనా ఎదురైతే తప్ప ఈ జాబితాలో ఎటువంటి మార్పు ఉండబోదని భావిస్తున్నారు. వీరందరిలో విజయశాంతి తప్ప మిగతా వారంతా పాతవారే కావడం గమనార్హం.