టాలీవుడ్‌కు మరో షాక్
తెలుగు సినీ పరిశ్రమ ఇటీవలి కాలంలో పలువురు నటులను కోల్పోయింది. అక్కినేని నాగేశ్వరరావు కేన్సర్ కారణంగా మరణించగా.. ఆ తర్వాత నుంచి శ్రీహరి, ఏవీయస్ , ధర్మవరపు సుబ్రమణ్యం, ఎంఎస్ నారాయణ ఇలా పలువురు నటులు అర్ధాంతరంగా ఈ లోకాన్ని వీడిపోయారు. ఉదయ్‌కిరణ్ చిన్నవయసులోనే ఆత్మహత్య చేసుకోగా.. చక్రి మృతి కూడా అనుమానాస్పదంగానే మిగిలింది. ఆయన 40 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించారు.
ఇలా పరిశ్రమకు చెందిన పలువురు మరణించడంతో 'మా' ఆధ్వర్యంలో హోమాలు, పూజలు కూడా చేయించారు. దాంతో కాస్త ఊరట చెందుతున్న సమయంలో ఉన్నట్టుండి ఆర్తి అగర్వాల్ లాంటి మంచి హీరోయిన్ మరణించడం తెలుగు సినీ పరిశ్రమకు షాక్ లాంటిదే. 31 ఏళ్ల వయసులో గుండెపోటు వస్తుందా అనే విషయం అనుమానంగానే అనిపిస్తోంది. అయితే గత కొంత కాలంగా స్థూలకాయంతోను, శ్వాసకోశ సమస్యలతోను బాధపడుతున్న ఆర్తి అగర్వాల్ మరణించిన విషయాన్ని ఆమె మేనేజర్‌తో పాటు ఆమె తండ్రి కూడా నిర్ధారించారు.