breaking news
sharmila roadshow
-
ప్రజా చైతన్యం
సాక్షి, ఒంగోలు: ‘మీ రాజన్న కూతుర్ని.. జగనన్న చెల్లెల్ని.. మీ ముందుకు వచ్చాను. మీకు చేతులెత్తి శిరస్సు వంచి నమస్కరిస్తూ కోరుతున్నాను. రాష్ట్రం దశాదిశ మారే ఎన్నికల పోలింగ్ రోజు మరి కొద్ది రోజుల్లో వచ్చేస్తోంది. ఆ రోజు మీరు తీసుకునే నిర్ణయం మన తలరాతలు మార్చేస్తుంది. ఒక్క అవకాశం ఇవ్వండి.. జగనన్న జీవితాంతం మీ సేవకి అంకితమౌతాడు.’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ సోదరి షర్మిల పిలుపునిచ్చారు. వైఎస్సార్ జనభేరి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మంగళవారం జిల్లాలోని యర్రగొండపాలెం, దర్శి, పర్చూరు నియోజకవర్గాల్లో పర్యటించారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిర్వహించిన షర్మిల రోడ్‌షోలు, బహిరంగ సభలకు భారీ స్పందన లభించింది. ప్రజా చైతన్యం ప్రస్ఫుటమైంది. యర్రగొండపాలెంలో వైఎస్సార్ సెంటర్ బహిరంగ సభకు జనం పోటెత్తగా ..దర్శి గడియార స్తంభం సెంటర్ నాలుగు రోడ్ల కూడలి జనసంద్రమైంది. పర్చూరు నియోజకవర్గంలో మార్టూరులో బహిరంగ సభ విజయవంతం అయింది. జనభేరి ఆద్యంతం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తింది. ప్రచార రథంపై ఆయా నియోజకవర్గాల లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులు వైవీ సుబ్బారెడ్డి, డాక్టర్ వరికూటి అమృతపాణి, పాలపర్తి డేవిడ్‌రాజు, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, గొట్టిపాటి భరత్, జిల్లా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ నూకసాని బాలాజీ తదితరులు ప్రసంగించారు. షర్మిల ప్రసంగిస్తూ విశ్వసనీయతకు మారు పేరైన వైఎస్సార్సీపీ అభ్యర్థులను ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యేందుకు ప్రతి కార్యకర్త కష్టపడాలని పిలుపునిచ్చారు. గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే పిడతల సాయికల్పనారెడ్డి టీడీపీకి రాజీనామా చేసి షర్మిల సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. మైనార్టీల స్వాగతోత్సాహం.. ‘అమ్మా.. మీ నాయన మాకెంతో మేలు చేశాడమ్మా.. ముస్లిం మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్ తెచ్చిన దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిని కడవరకు దేవుడుగా కొలుస్తామమ్మా...’అంటూ యర్రగొండపాలెంలో ముస్లిం మైనారిటీ మహిళలు షర్మిలతో మాట్లాడారు. నియోజకవర్గంలోని కొమరోలులో బస కేంద్రం నుంచి బయలుదేరిన షర్మిలకు జనం బ్రహ్మరథం పట్టారు. బేస్తవారిపేట, కంభం, మార్కాపురం బైపాస్ రోడ్డు, తోకపల్లి జంక్షన్, కుంట, గురిజేపల్లి, గ్రామాల మీదుగా రోడ్‌షో జరిగింది. యర్రగొండపాలెం సెంటర్లో బహిరంగ సభకు జనం భారీగా తరలి వచ్చారు. ప్రధానంగా షర్మిల ప్రసంగం ఆద్యంతం ఆసక్తికరంగా సాగటం.. ప్రజల్లో ఉత్సాహాన్ని రేకెత్తించింది. అనంతరం కొత్తగోళ్ల విడిపి, అయ్యబొట్లపల్లి, త్రిపురాంతకం, రామసముద్రం, మిట్టపాలెం, మేడపి, వినుకొండ అడ్డరోడ్డు మీదుగా కురిచేడు చేరుకుని అక్కడ నుంచి దర్శికి వచ్చారు. పల్లె పల్లెన ప్రజలు రోడ్ల వెంట నిలుచుని షర్మిలకు చేతులెత్తి జై కొట్టగా.. ఆమె చిరునవ్వుతో అభివాదం చేశారు. -
‘ఖేడ్’.. ఫ్యాన్’ స్పీడ్
నారాయణఖేడ్, న్యూస్‌లైన్: నారాయణఖేడ్‌లో ‘ఫ్యాన్’ గాలి వీస్తోంది. వైఎస్సార్ సీపీ అభ్యర్థి అప్పారావు షెట్కార్ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అన్ని పార్టీల కంటే ముందంజలో ఉన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పథకాలే అండగా.. ప్రజా సమస్యలే ఎజెండా గా ప్రచారం చేపడుతున్నారు. కాగా ఈ నెల 21న షర్మిలమ్మ నిర్వహించిన రోడ్‌షోతో ఖేడ్ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా దూసుకెళుతోంది. షర్మిల రోడ్‌షోతో కార్యకర్తల్లో, వైఎస్సార్ అభిమానుల్లో ఎనలేని ఉత్సాహం నింపగా.. ఇన్నాళ్లు తటస్థంగా ఉన్న వైఎస్. రాజశేఖరరెడ్డి అభిమానులు ఒక్కసారిగా అప్పారావు షెట్కార్‌కు తమ మద్దతు ఉంటుందనే సంకేతాలు పంపుతున్నారు. దీంతో నియోజకవర్గంలో ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీలు కంగుతినే పరిస్థితి కనిపిస్తోంది. షర్మిల రోడ్‌షోకు ఆయా గ్రామాల నుంచి భారీగా జనాలు రావడమే ఇందుకు నిదర్శనమని ఖేడ్ ప్రజలు పేర్కొంటున్నారు. ఖేడ్ నియోజకవర్గంలో ఐదేళ్లుగా ప్రతిపక్ష పాత్ర కరువైంది. ఇక కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఓ వర్గంలోని కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. నియోజకవర్గంలోని కంగ్టి, మనూరు, నారాయణఖేడ్‌లో అన్ని గ్రామాల్లో వైఎస్సార్ సీపీ క్యాడర్ పటిష్టంగా ఉండగా కల్హేర్, పెద్దశంకరంపేటల్లో రోజురోజుకూ ముమ్మరంగా చేరికలు జరుగుతున్నాయి. కాగా మైనారిటీ, దళిత, క్రిస్టియన్, లింగాయత్ నాయకులు అప్పారావ్ షెట్కార్తో సత్సంబంధాలు కలిగి ఉండడం వైఎస్సార్ సీపీ గెలుపునకు అనుకూలించే అంశాలుగా మారాయి. ఇప్పటికే ఆయా గ్రామాల్లో కూడా భారీగా చేరికలు నిత్యం కొనసాగుతున్నాయి. నియోజకవర్గంలో కొత్తగా సుమారు 30 వేల మంది యువత ఓటుహక్కును పొందగా వారి ఓట్లు కూడా దాదాపుగా యువ నాయకత్వం వైపు ఉండే అవకాశాలున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.