breaking news
Sewage storage
-
మురుగు శుద్ధిలో గ్రేటర్ నం.1
సాక్షి, హైదరాబాద్: మురుగునీటి శుద్ధిలో గ్రేటర్ హైదరాబాద్ నగరం మహానగరాలకు ఆదర్శంగా నిలుస్తోంది. మన సిటీలో నిత్యం గృహ, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల నుంచి వెలువడే మురుగు నీటిలో 43 శాతం శుద్ధి జరుగుతుండటం విశేషం. ఇటీవల ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఈపీటీఆర్ఐ) నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ విషయం తేలింది. మహానగరాల్లో వెలువడే మురుగు నీటిని సాంకేతిక పద్ధతులతో శుద్ధి చేసి నిర్మాణ రంగం, పరిశ్రమలు, గార్డెనింగ్, వాహనాల క్లీనింగ్ వంటి అవసరాలకు వినియోగించాలని ఈపీటీఆర్ఐ తాజాగా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. కాగా దేశంలో పలు మెట్రో నగరాలకు మురుగు ముప్పు పొంచి ఉంది. రోజువారీగా గృహ, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల నుంచి వెలువడుతున్న మురుగు నీటిలో శుద్ధి ప్రక్రియ 40 శాతానికి మించకపోవడం ఆందోళన కలిగి స్తోంది. మెట్రో నగరాలైన ముంబైలో 40%, బెంగళూర్‌లో 39, చెన్నైలో 37, ఢిల్లీలో 35, కోల్‌కతాలో 34 శాతమే శుద్ధి జరుగుతున్నట్లు ఈ నివేదికలో స్పష్టం చేసింది. మురుగు మాస్టర్ ప్లాన్ ఇదీ... ఔటర్ రింగ్ రోడ్డు పరిధి వరకు విస్తరించిన మహానగరంలో మురుగు అవస్థలకు శాశ్వతంగా చరమగీతం పాడేందుకు సీవరేజి మాస్టర్‌ప్లాన్ సిద్ధమైంది. సిటిజన్లకు మురుగు అవస్థలు లేకుండా చూసేందుకు రూ.8 వేల కోట్ల అంచనా వ్యయంతో సమగ్ర సీవరేజి మాస్టర్‌ప్లాన్ అమలు చేసేందుకు జలమండలి ముంబైకి చెందిన షా కన్సల్టెన్సీ నిపుణుల సౌజ న్యంతో ఈ మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేసింది. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో నిత్యం వెలువడుతోన్న 2,133 మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధి చేసేందుకు ప్రతి రెండుమూడు చెరువులకు ఒకటి చొప్పున సుమారు రూ.5వేల కోట్ల అం చనా వ్యయంతో 65 వికేంద్రీకృత మురుగుశుద్ధి కేంద్రాలు నిర్మించనున్నారు. వీటిలోకి మురుగునీటిని మళ్లించేందుకు సుమారు రూ.3 వేల కోట్లతో ట్రంక్ మెయిన్, లేటరల్ మెయిన్ పైపులైన్లను ఏర్పాటు చేశారు. ఇందుకు వీలుగానగరాన్ని 48 సీవరేజి జోన్లుగా విభజించారు. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ ఆర్థిక సంస్థల నుంచి రుణం స్వీకరించి పూర్తిచేస్తే మహానగరానికి 2,036 సంవత్సరం వరకు మురుగు కష్టాలు ఉండవని జలమండలి వర్గాలు చెబుతున్నాయి. గ్రేటర్ ఆదర్శమిలా... గ్రేటర్ హైదరాబాద్‌లో నిత్యం వెలువడుతున్న 2వేల మిలియన్ లీటర్ల మురుగు నీటిలో 860 మిలియన్ లీటర్ల నీటిని 22 కేంద్రాల్లో శుద్ధి చేస్తున్నారు. ఈ నీటి నాణ్యతను పరిశీలించేందుకు వివిధ పరిశోధన సంస్థల సేవలను జలమండలి వినియోగిస్తోంది. నూతనంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని లింగంకుంట వద్ద మూవింగ్ బెడ్ బయోరియాక్టర్ అధునాతన సాంకేతికతతో మురుగుశుద్ధి కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెలాఖరులో దీన్ని ప్రారంభించనున్నారు. ఇదే స్ఫూర్తితో నగరంలో మురుగు మాస్టర్ ప్లాన్ అమలు చేసేందుకు జలమండలి ప్రణాళిక సిద్ధం చేసింది. వ్యర్థాలకు సరికొత్త అర్థం తెచ్చేలా.. గ్రేటర్ నగరంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఔటర్‌రింగ్ రోడ్డు పరిధి వరకు సమగ్ర మురుగునీటి మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేశాం. దీంతో శివారు వాసులకు మురుగునీటితో అవస్థలు తప్పనున్నాయి. గ్రేటర్లో పర్యావరణ పరిరక్షణ, హరిత వాతావరణం పెంపొందించడం, మూసీతోపాటు చెరువులు, కుంటలు తదితర విలువైన జలవనరులు కాలుష్యం బారిన పడకుండా కాపాడవచ్చు. మురుగు శుద్ధి కోసం నిర్మించనున్న ఎస్టీపీల్లో పర్యావరణహిత సాంకేతికత వినియోగించనున్నాం. -ఎం.దానకిశోర్, జీహెచ్ఎంసీ కమిషనర్, జలమండలి ఎండీ. -
మడికొండ వాసుల నిరసన
జాతీయ రహదారిపై మురుగు నీరు నిల్వడంపై ఆగ్రహం మడికొండ : మడికొండలో జాతీయ రహదారిపై మురుగునీరు నిల్వడంతో ఇబ్బందులను భరించలేక స్థానికులు శనివారం జాతీయ రహదారిపై కొద్దిసేపు రాస్తారోకో చేసి నిరసన తెలిపారు. మడికొండ ఆంధ్రాబ్యాంకు ఎదుట మురుగునీరు నిలిచి కాలనీ లోకి వస్తుండగా ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు వాపోయూరు. రహదారి విస్తీర్ణంలో భాగంగా సైడ్ కాలువ నిర్మాణం సరిగా లేకపోవడం తో మురుగునీరు నిలుస్తోందని తెలిపారు. దీంతో కాలనీవాసులకే కాకుండా బ్యాంక్ సేవలకు వచ్చే వారికి, ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందికరంగా మారిందన్నారు. ఎమ్మెల్యే అరూరి రమేష్ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ఈ సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారి కావడంతో నిత్యం రద్దీగా ఉంటోందని మురుగునీరు నిలవడంతో పక్క నుంచి పోవడానికి సైతం ప్రజలు, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. వాహనంపై వెళ్తూ మురుగు నీటిలో పడి ఆస్పత్రుల పాలైన సంఘటనలు ఉన్నాయని వివరించారు. అధికారులు స్పందించి మురుగునీరు నిల్వ ఉండకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసనలో ప్రయాణికులు, కాలనీవాసులు సుర్యారావు, శేఖర్, రాజు, ఎలికంటి బాబు, పాషా, ఐలయ్య పాల్గొన్నారు.