బ్యూటిప్స్
సెన్సిటివ్ స్కిన్ వాతావరణంలోని మార్పులను భరించడం కష్టం. ఏ చిన్న తేడా వచ్చినా ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఇటువంటి చర్మాన్ని కాపాడుకోవడానికి వాడాల్సిన టోనర్‌ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎనిమిది చుక్కల పచౌలీ ఆయిల్ (ఇది పుదీనా కుటుంబానికి చెందింది, అరోమా థెరపీలో వాడతారు. బ్యూటీ ప్రొడక్ట్స్ దొరికే షాపుల్లో ఉంటుంది) ఒక టీ స్పూను గ్లిజరిన్, ఆరు టేబుల్ స్పూన్ల పన్నీరు తీసుకోవాలి. పచౌలీ ఎసెన్షియల్ ఆయిల్లో గ్లిజరిన్ వేసి పూర్తిగా కలిసిన తర్వాత పన్నీటిని వేసి కలపాలి. దీనిని రాత్రి పూట చర్మానికి పట్టించాలి. ఈ టోనర్‌ను రోజూ చర్మానికి పట్టిస్తుంటే చర్మం ఆరోగ్యంగా, ఆకర్షణీయంగా ఉంటుంది.
సహజమైన మాయిశ్చరైజర్లలో అరటి పండు ఒకటి. పొడి చర్మానికి ఈ ప్యాక్ బాగా పని చేస్తుంది. బాగా పండిన అరటి పండు ఒకటి, పావు కప్పు పెరుగు, రెండు టేబుల్ స్పూన్ల తేనె తీసుకుని బాగా కలిపి ముఖానికి ప్యాక్ వేసి అరగంట తర్వాత చన్నీటితో కడగాలి. పెరుగు, తేనె లేకున్నా అరటి పండుని మాత్రమే పేస్టు చేసి ప్యాక్ వేసుకోవచ్చు.క్లోరినేటెడ్ వాటర్‌లో స్విమ్మింగ్ చేసినప్పుడు జుట్టు పొడిబారి రంగు మారి పోతుంటుంది. అప్పుడు గోరు వెచ్చటి నీటిలో ఏడెనిమిది యాస్పిరిన్ టాబ్లెట్లు కలిపి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి పదిహేను నిమిషాల తర్వాత కడిగితే జుట్టుకు ముందున్న రంగు వస్తుంది.