breaking news
sedition charge
-
సెక్షన్ 124ఏ అవసరమా..?
సాక్షి, న్యూఢిల్లీ: బ్రిటిష్ కాలం నాటి దేశద్రోహం చట్టాన్ని ఇప్పటికీ ఉపయోగిస్తుండటాన్ని, చాలా సందర్భాల్లో దీనిని దుర్వినియోగపర్చడాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మహాత్మాగాంధీ, గోఖలే వంటి స్వాతంత్య్ర సమరయోధుల గొంతు నొక్కేందుకు బ్రిటిష్ ప్రభుత్వం ఈ దేశద్రోహం చట్టాన్ని ఉపయోగించిందని గుర్తు చేసింది. దీనికి సంబంధించిన ఐపీసీలోని 124ఏ సెక్షన్‌ను ఇంకా ఎందుకు రద్దు చేయలేదని, ఈ సెక్షన్ ప్రస్తుత కాలంలో అవసరమా అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రాన్ని ప్రశ్నించింది. ఈ సెక్షన్ రాజ్యాంగ చెల్లుబాటుపై విచారణ చేస్తామని స్పష్టం చేసింది. సెక్షన్ 124ఏ రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, విశ్రాంత సైనికాధికారి మేజర్ జనరల్ ఎన్జీ వోంబట్కెరే దాఖలు చేసిన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ హృషీకేశ్‌రాయ్‌ల ధర్మాసనం గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. విచారణ సమయంలో ధర్మాసనం పలు వ్యాఖ్యలు చేసింది. ఈ దేశద్రోహం చట్టం బ్రిటిష్ వారి నుంచి వలస తెచ్చుకున్న చట్టంగా అభివర్ణించింది. ప్రభుత్వాలపై విద్వేషం పెరిగేలా చేసే ప్రసంగాలు లేదా భావ ప్రకటనలను బెయిల్‌కు వీల్లేని నేరంగా పరిగణిస్తూ, ఈ సెక్షన్ కింద జీవితకాల జైలుశిక్ష విధించే అవకాశముంది. ‘ఈ చట్టం వలసరాజ్యం నాటి చట్టం. స్వేచ్ఛను అణచివేయడానికి, గాంధీ, తిలక్ వంటి వారి గొంతు నొక్కేందుకు ఈ చట్టాన్ని బ్రిటిష్‌వారు ప్రయోగించే వారు. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా ఈ చట్టం అవసరమా?’ అని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. ఈ తరహా కేసులు సుప్రీంకోర్టులో వేర్వేరు ధర్మాసనాల వద్ద పెండింగ్‌లో ఉన్న విషయాన్ని కేకే వేణుగోపాల్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఎడిటర్స్ గిల్డ్ తరఫు సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్ వాదనలు వినిపిస్తూ.. 124ఏ రాజ్యాంగ విరుద్ధమే కాకుండా ఏ విధంగా దుర్వినియోగం అవుతుందో పిటిషన్లో వివరించామన్నారు. ఈ సెక్షన్‌ను దుర్వినియోగం చేసిన కేసులే ఎక్కువని, కొయ్య మలచడానికి వడ్రంగికి రంపం ఇస్తే మొత్తం అడవినే నరికినట్లుగా ఉందంటూ జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఏ రద్దు చేసినప్పటికీ ఇప్పటికీ కేసులు నమోదు చేస్తున్న అంశాన్ని సీజేఐ ఉదహరించారు. చట్టం దుర్వినియోగం అవడంతో పాటు కార్యనిర్వాహక వ్యవస్థకు జవాబుదారీతనం లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని జస్టిస్ రమణ పేర్కొన్నారు. ఈ తరహా ఇతర కేసులు కూడా పరిశీలిస్తామన్న సీజేఐ.. అన్ని కేసులను ఒకే చోట విచారిస్తామన్నారు. కాలం చెల్లిన చట్టాలను చాలా వరకూ రద్దు చేస్తున్న కేంద్రం ఈ విషయాన్ని ఎందుకు పరిశీలించలేదని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ సెక్షన్‌ను కొట్టివేయాల్సిన అవసరం లేదని, చట్టపరమైన ప్రయోజనాల నిమిత్తం మార్గదర్శకాలు ఏర్పాటు చేస్తే సరిపోతుందని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ తెలిపారు. పిటిషనర్ ఆర్మీ మేజర్ జనరల్‌గా పనిచేశారని, ఆయన దేశం కోసం త్యాగం చేశారని, ఈ పిటిషన్‌ను ప్రేరేపిత పిటిషన్‌గా భావించలేమని ధర్మాసనం పేర్కొంది. ‘సెక్షన్ 124ఏ ను పేకాట ఆడేవారిపైనా ప్రయోగిస్తున్నారు. ప్రత్యర్థుల అణచివేతకు రాజకీయ నేతలు దీన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ప్రత్యర్థులపై సెక్షన్ 124ఏ ప్రయోగించేలా ఫ్యాక్షనిస్టులు ప్రవర్తిస్తున్నారు. బెయిల్ రానివ్వకుండా ఈ సెక్షన్‌తో బెదిరిస్తున్నారు’ అని జస్టిస్ రమణ వ్యాఖ్యానించారు. సెక్షన్ 124ఏ రద్దుపై వైఖరి తెలపాలంటూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. విపక్ష నేతల హర్షం దేశద్రోహం చట్టంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను పలువురు విపక్ష నేతలు, పౌర సమాజ కార్యకర్తలు స్వాగతించారు. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఒకవైపు, ఈ చట్టం దుర్వినియోగమవుతోందంటూ సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, మరోవైపు బుధవారం హరియాణాలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న 100 మంది రైతులపై దేశద్రోహం సహా పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, స్వరాజ్ ఇండియా అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్ వ్యాఖ్యానించారు. -
కుట్ర సిద్ధాంతమే ఓ కుట్ర
అభిప్రాయం ఒక నకిలీ ట్వీట్‌ను పట్టుకుని భారత హోంమంత్రి, ఒక నకిలీ వీడియోనూ తీసుకుని ఢిల్లీ పోలీసు బాస్ కలిసి జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్ మీద ఆడిన దేశద్రోహ ప్రహసనాన్ని దేశమంతా చూసింది. అంతకు ముందే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల బలవన్మరణానికి పురికొల్పిన కేంద్రమంత్రుల నిర్వాకాన్ని కూడా మనం చూశాం. భారత రాజ్యాంగాన్ని అభిమానించేవాళ్లకు కూడా కొన్ని అంశాల్లో కొంత అసంతృప్తి కూడా ఉంటుంది. కొన్ని విషయాల్లో మరి కొంత స్పష్టత అవసరమనీ, ఇంకొన్ని విషయాలను చేరిస్తే మరింత బాగుండేదనీ అనిపిస్తుంది. కానీ భారత రాజ్యాంగాన్ని ప్రశంసిస్తూ కన్హయ్య కుమార్ అంతటి ఉత్తేజం, ఉత్సాహం, తాదాత్మ్యం, ఆవేశాలతో ప్రసంగించే యువతరాన్ని మనం ఇప్పుడే చూస్తున్నాం. కార్ల్‌మార్క్స్, బాబాసాహెబ్ అంబేడ్కర్, అష్ఫఖుల్లా ఖాన్ల కూర్పు ఒక మహత్తర పరిణామం. ఇందులో బిర్సాముండా, పూలేలను కూడా చేరిస్తే అదొక కొత్త చరిత్ర ఆవిర్భావానికి వేదిక అవుతుంది. ఏ విషయం మీదఅయినా సరే కుండబద్దలు కొట్టినట్లు తన అభిప్రాయాల్ని చెప్పేస్తారు అని ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీకి పేరుండేది. అయితే ఇది అర్ధసత్యమే అనిపిస్తోంది. వారు స్పందించాల్సిన అవసరమే లేని విషయాల మీద అత్యుత్సాహం ప్రదర్శిస్తూ స్పందించాల్సిన అవసరం ఉన్న విషయాల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారనేది ఇప్పుడు దేశమంతటా బలపడుతున్న అభిప్రాయం. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడి పోలీసులు తరచూ ఒక ప్రహసనం ఆడేవారు. ముఖ్యమంత్రిని హత్య చేసేందుకు ఒక ముఠా కుట్ర చేస్తున్నదని ప్రచారం చేసేవారు. ఒకటి రెండు బూటకపు ఎన్కౌంటర్లు జరిపి మృతుల్ని ఆ ముఠా సభ్యులుగా ప్రకటించేవారు. దానితో పోలీసులకు పదోన్నతులు, అవార్డులు మాత్రమే కాక వాళ్లు లెక్క చెప్పాల్సిన అవసరం లేని నిధుల కేటాయింపులు, అధికారాలు పెరిగేవి. ఇజ్రాయెల్ నుంచో మరో దేశం నుంచో అత్యాధునిక భద్రతా పరికరాలు పెద్ద ఎత్తున దిగుమతి అయ్యేవి. అన్నింటికన్నా ముఖ్యంగా ముఖ్యమంత్రి మీద సానుభూతి పెరిగేది. దాదాపు ఇదే ఫార్ములాను ఇప్పుడు నరేంద్ర మోదీ సలహాదారులు జాతీయ స్థాయిలో అమలు చేస్తున్నారు. హైదరాబాద్, ఢిల్లీ సంఘ టనల తర్వాత దేశంలోని దాదాపు యాభై విశ్వ విద్యాలయాల్లో అసమ్మతి రగులుకోవడంతో కేంద్ర ప్రభుత్వం ఇరుకున పడింది. నెహ్రూ హరిత విప్లవం, ఇందిరాగాంధీ గరీబీ హఠావో, రాజీవ్ గాంధీ ఐటీ విప్లవం, మన్మోహన్ సింగ్ గ్రామీణ ఉపాధి పథకం వంటి చెప్పుకోదగ్గ ఒక్క పథకాన్ని కూడా నరేంద్రమోదీ ప్రభుత్వం ఇప్పటివరకు రూపొందించలేకపోయింది. (మోదీ) జాతీయ స్థూల ఉత్పత్తి పెరుగుదల రేటు 7 శాతం ఉంటే ఏపీ పెరుగుదల రేటు 15 శాతం ఉందని ఎన్డీయే భాగస్వామి అయిన చంద్రబాబే అనేస్తుంటే, నరేంద్రుని ప్రతిష్ట ఎంత వేగంగా దిగజారిపోతున్నదో అర్థమవుతుంది. ఇలాంటి నైతిక సంక్షోభ సమయాల్లో ప్రయోగించడానికి నరేంద్ర మోదీ దగ్గర గుజరాత్ మార్కు సానుభూతి ఫార్ములా ఎలాగూ ఉన్నది. దాన్నే వారు ఒడిశాలో ప్రయోగించారు. తనను అంతం చేయడానికీ, తన ప్రతిష్టను దెబ్బతీయడానికి, తన ప్రభుత్వాన్ని కూల్చేయడానికి స్వచ్ఛంద సేవా సంస్థ (ఎన్జీవో)లు, యూరియా ఉత్పత్తిదారులు, ప్రతిపక్షాలు రాత్రింబవళ్లు కుట్రలు చేస్తున్నాయని బార్గడ్ రైతు సదస్సులో వారు ఆవేదన వ్యక్తం చేశారు. చాయ్ వాలా ప్రధాని కావడాన్ని వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారని ఒక భావోద్వేగాన్ని కూడా వదిలారు. హిట్లర్ కూడా తనకు నైతిక సంక్షోభం వచ్చినప్పుడల్లా తాను పేద కుటుంబంలో పుట్టాననీ, పెళ్లి చేసుకోలేదనీ, శాకాహారిననీ, కమ్యూనిస్టులు, యూదులు తనను అంతం చేయడానికి కుట్రలు చేస్తున్నారని చెప్పుకునేవాడట! పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల ప్రకటిత లక్ష్యమే.. అధికార పార్టీ తప్పుల్ని ఎండగట్టి, ఎన్నికల్లో ఓడించి తాము అధికారాన్ని చేపట్టడం. ఇందులో కుట్ర ఎక్కడ నుండి వచ్చిందీ? ప్రధాని ప్రసంగంలో యూరియా ఉత్పత్తిదారుల ప్రస్తావన రైతుల కంటితుడుపు కోసమే తప్ప మరోటికాదు. ప్రధాని ప్రధానంగా ప్రస్తావించదలచింది స్వచ్ఛంద సంస్థల గురించి. విశ్వవిద్యాలయ విద్యార్థుల ఆందోళనల వెనక కొన్ని ఎన్జీవోలు ఉన్నాయనీ, వాటికి విదేశాల నుండి నిధులు వస్తున్నాయని వారు ప్రస్ఫుటంగానే ఒక సంకేతాన్ని బలంగా ప్రజల్లోకి పంపాలనుకున్నారు. తమ మీద వచ్చే నిందల్ని తప్పించుకోవడానికి అధికార పార్టీలు తరచూ చేసే వాదన ఒకటి ఉంటుంది. గ్రామాల్లో జరిగే చిన్న సంఘటనలకు కూడా ముఖ్యమంత్రినో, ప్రధానినో బాధ్యుల్ని చేయడం సరికాదని వారంటుంటారు. కారంచేడు నరమేధానికీ, చుండూరు దురాగతానికీ అప్పటి ముఖ్యమంత్రులు ఎన్.టి.రామారావు, ఎన్.జనార్దన్‌రెడ్డి నేరుగా బాధ్యులు కాకపోవచ్చు. కానీ వాళ్లు అప్పుడు ఆ పదవుల్లో ఉండడం వల్లనే స్థానికులకు దాడి చేసే తెగువ వచ్చిందనేది మాత్రం ఎవ్వరూ కాదనలేని నిజం. ప్రధాని బార్గడ్ ప్రసంగంలో ఒక సున్నితమైన అంశం ఉంది. కొంచెం విశ్లేషణ చేస్తే సంఘీయుల దృష్టిని వారు క్రైస్తవ, ముస్లిం సేవా సంస్థల మీదికి మళ్లిస్త్తున్నారని సులువుగానే అర్థం అవుతుంది. కేంద్రంలో అధికార పార్టీ మొదలు, స్థానికంగా అధికారుల వరకు భరోసాను అందించడం వల్లనే దాద్రీలో అఖ్లాఖ్ హత్య జరిగిందని గుర్తు చేసుకుంటే భారత సమాజంలో సమీప భవిష్యత్తులో జరగనున్న పరిణామాల్ని ఊహించడం కష్టం కాదు. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు, సమాజ విశ్లేషకులు డానీ మొబైల్: 9010757776