breaking news
saved passengers
-
51మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన డ్రైవర్
గుంటూరు : ప్రయాణికులందరినీ సురక్షితంగా కాపాడిన ఓ ఆర్టీసీ డ్రైవర్ తాను మాత్రం ప్రాణాలు కోల్పోయాడు. విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం రెడ్డిగూడెం సమీపంలో గురువారం చోటుచేసుకుంది. పిడుగురాళ్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సత్తెనపల్లి వెళుతున్న సమయంలో డ్రైవర్ దస్తగిరి ఆకస్మికంగా గుండెపోటుకు గురయ్యాడు. అయితే ఆ బాధతోనే అతడు బస్సును అదుపు చేసి రోడ్డు పక్కన నిలిపివేశాడు. అనంతరం స్టీరింగ్ వీల్ మీదకు వాలిపోయి ఘటనాస్థలంలోనే విడిచాడు. ఈ ఘటన జరిగినప్పుడు బస్సులో 51మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ప్రయాణికులకు ఒక్కసారిగా ఏమి జరుగుతుందో అర్థం కాలేదు. విషయం తెలుసుకున్న ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నా...డ్రైవర్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. మృతుడి స్వస్థలం నాగార్జున సాగర్. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం సత్తెనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
ప్రయాణికులను కాపాడి.. అమరుడయ్యాడు!
(యు.రవీంద్రకుమార్ రెడ్డి - సాక్షి, నూజివీడు ) స్టీరింగ్ వీల్ తన చేతిలో ఉందంటే, బస్సులో ఉండే ప్రతి ఒక్కరి ప్రాణానికి తనదే బాధ్యత అనుకున్నాడు. వాళ్లందరినీ కాపాడటం కంటే తన ప్రాణాలు ఒక లెక్కలోవి కావనుకున్నాడు. వాళ్లందరినీ సురక్షితంగా ఉంచి, తాను మాత్రం ప్రాణాలు కోల్పోయాడు. కృష్ణా జిల్లాలో ఓ ఆర్టీసీ డ్రైవర్ విషాదాంతమిది. విజయవాడ గవర్నర్‌పేట-2 డిపోకు చెందిన కాంట్రాక్టు డ్రైవర్ జి.పాములు (35) మూడున్నరేళ్లుగా పనిచేస్తున్నాడు. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో నూజివీడు నుంచి విజయవాడ కాళేశ్వరరావు మార్కెట్‌కు ఆర్డినరీ సర్వీసు తీసుకుని బయల్దేరాడు. పది నిమిషాలు గడిచేసరికి బస్సు రామన్నగూడెం ప్రాంతానికి చేరుకుంది. అంతే.. ఒక్కసారిగా పాములుకు గుండెల్లో సన్నగా మంట బయల్దేరింది. అది గుండెపోటు అని అతడికి అర్థమైపోయింది. బస్సులో చూస్తే దాదాపు 20 మంది ప్రయాణికులు ఉన్నారు. తనకు ఏమైనా అయితే బస్సు ప్రమాదానికి గురై అందరి ప్రాణాలు పోతాయనుకున్నాడు. పంటి బిగువున బాధను భరిస్తూ.. బస్సును పూర్తిగా రోడ్డుకు ఎడమవైపునకు పోనిచ్చాడు. అక్కడే ఉన్న ఓ చెట్టుకు నెమ్మదిగా ఢీకొట్టి బస్సును ఆపేశాడు. అప్పటికే గుండెల్లోంచి మంట వెన్నులోకి పాకింది. చెమటలు పట్టాయి.. అలా పాములు స్టీరింగ్ వీల్ మీదకు వాలిపోయాడు!! ఏమైందో ప్రయాణికులకు ముందు అర్థం కాలేదు. బస్సు ఆగడం, డ్రైవర్ స్టీరింగ్ వీల్ మీదకు వాలిపోవడం చూశారు. వెంటనే వెళ్లి, అతడిని లేపి, ప్రయాణికుల సీట్లో పడుకోబెట్టి, ప్రథమ చికిత్స అందించడానికి తమవంతు ప్రయత్నించారు. కానీ ప్రయోజనం లేకపోయింది. అప్పటికే పాములు ప్రాణాలు కోల్పోయాడు!! తన ప్రాణాలు పణంగా పెట్టి, ముందు ప్రయాణికుల భద్రతకే పెద్దపీట వేసిన పాములు త్యాగాన్ని ప్రయాణికులందరూ ప్రస్తావించారు. విజయవాడ శివార్లలోని నున్న ప్రాంతానికి చెందిన పాములుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రయాణికులు ఎవ్వరికీ చిన్న గాయం కూడా కాలేదని అతడు మాత్రం తన ప్రాణాలు కోల్పోయాడని సంఘటన స్థలానికి చేరుకున్న ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు.