breaking news
saraswatamma
-
ఒక తరపు పోరాట గాథ
‘కలెనేత’ ఆత్మకథ రచయిత్రి బల్ల సరస్వతమ్మ కన్నతల్లి ఊరూ, మా అమ్మమ్మ ఊరూ లద్దునూరే అని ఈ పుస్తకంతోనే తెలిసింది. ఆడవాళ్లుగా అమ్మలు, అమ్మమ్మలు, నానమ్మలైనా వారి తల్లి ఊరి పేరు విన్నా, కన్నా చెప్పరాని అనుభూతి కలుగుతుంది. ప్రముఖ వాగ్గేయకారుడు అందెశ్రీ తమ మూలాలను గుర్తెరిగి ‘‘అమ్మా మనిద్దరి మాయిముంత లద్దునూర’’ని మాట్లాడుతుంటే సొంత అన్న లాగే మనసు పులకరించి పోయి వర్గ సంబంధాలు మరింత బలపడ్తుం టాయి. ఇప్పుడా మాయిముంత బల్ల సరస్వతమ్మను, నన్ను చుట్టేసి ఒకే కూరాడు దగ్గరకు చేర్చినట్లయింది. తెలంగాణలో కూరాడు ఆడబిడ్డలకు చిహ్నం. మాతృస్వామ్య అవశేషాలకు చిహ్నంగా తెలంగాణలో ఆడబిడ్డలకు దక్కుతున్న గౌరవ హోదా ఒకింత వర్గ సంబంధాలకు అతీతంగా కనబడ్తుంది. ఎక్కడా లేని విధంగా బతుకమ్మతో మన ఆత్మగౌరవం ఇనుమడింపజేస్తుంది. వయస్సుతో నిమిత్తం లేకుండా ఆడబిడ్డల కాళ్ళు మొక్కే సాంప్రదాయాన్నీ, సంస్కృతినీ ఏదో మేరకు తెలంగాణ పల్లె సీమలు నేటికీ ప్రతిబింబిస్తున్నాయి. వీటన్నిటి కలబోతగా ‘కలెనేత’కు అక్షర రూపమిచ్చిన బల్ల సరస్వత మ్మకు వేనవేల శణార్థులు. తమ విలువైన ముందుమాటలో ప్రముఖ రచయిత, నవలా కారుడు అల్లం రాజయ్య అన్నట్లు ‘‘అక్షర రూపం ఇస్తే తెలంగాణ సాయుధ పోరాట గ్రామాల్లో కొంచెం అటు ఇటుగా ప్రతి ఇంట్లోనూ ఇదే కథ పునరావృతమవుతుంది.’’ ఇటీవలే ఒకరోజు ప్రజా ఉద్యమాల్లో చిరకాల మిత్రులైన న్యాయవాద దంపతులు బల్ల రవీంద్రనాథ్, కోళ్ళ సావిత్రిలు ‘అరుణోదయ’ కార్యాలయానికి వచ్చి ‘కలెనేత’ పుస్తకావిష్కరణ సభకు నన్ను సాదరంగా ఆహ్వానించారు. బల్ల రవీందర్ తమ తల్లి ఊరు (అమ్మమ్మగారి ఊరు) లద్దునూరని చెప్పారు. ఇదే విషయం చెప్పి సరస్వతమ్మ కూడా నన్ను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నట్లు చెప్పడంతో పట్టరాని సంతోషం కలిగింది. ఏడుతరాల వాస్తవ జీవిత గాథకు అక్షర రూపమిచ్చిన బల్ల సరస్వతమ్మ నా దృష్టిలో ధన్యురాలు. చరిత్రను పాఠ్య గ్రంథాలకు అందకుండా సిలబస్ నుండే అంతర్థానం చేయాలన్న పంతం కొనసాగుతున్న కాలంలో జీవితగాథను చరిత్రగా, సహజ వైరుధ్యాల కలబోతగా అందించడం చాలా మందికి ప్రేరణ కలిగించి తీరుతుంది. 585 పేజీల సుదీర్ఘ గ్రంథం ఇది. బల్ల రవీందర్ చెప్పిన ఆనవాళ్ల ప్రకారం... లద్దునూరులో మా అమ్మమ్మ బెడద సిద్ధమ్మ ఇల్లు, సరస్వతమ్మ తల్లిదండ్రులు పాశికంటి లక్ష్మమ్మ–రామదాసుల ఇల్లు దరిదాపుల్లోనే ఉండేవి. వారు బట్టలు నేసే పద్మశాలీలైతే, మా అమ్మమ్మ వాళ్లు గొంగళ్లు నేసేవారు. అలనాటి జ్ఞాపకాలన్నింటినీ తట్టి లేపుతున్న సరస్వతమ్మ ‘కలెనేత’తో పెద్ద యజ్ఞమే చేసింది. కష్టాలు – కన్నీళ్ళ కలబోతగా, ఉద్యమాల తలబోతగా, అనుబంధాలు–అనుభవాల నెమరు వేతగా ‘కలెనేత’ ప్రాచుర్యం పొంది ప్రజల ఆదరణను చూర గొంటుందని నా గట్టి నమ్మకం. గడిచిపోయిన 150 ఏళ్లలో జీవించిన ఏడు తరాలను తడిమిన ‘కలెనేత’ కల్పితం కాదు, వాస్తవ చరిత్ర. ‘కలెనేత’ లోకి తలదూర్చగానే మా అమ్మమ్మ ఇంట్లోని లోతు గిన్నెల్లో మీగడ పెరుగుతో గటక తిన్న అనుభూతి కలిగింది. ఇది తప్పక స్త్రీల సమాన హక్కుల పోరాటానికి తోడ్పాటునిస్తుందనీ, మానవ విలువలను ప్రజాస్వామీకరించడానికి దోహదపడ్తుందనీ ఆశిద్దాం. అటు సమాజంలోని, ఇటు కుటుంబంలోని అంతర్లీన ఆర్థిక–సామాజిక సంబంధాలను అర్థం చేసుకోవడానికి ‘కలెనేత’ ఒక విస్తృత పాఠ్యగ్రంథంగా ఉపయోగపడి తీరుతుంది. చిన్నతనంలో బలపాలు పోగొట్టుకోవడం నుండి, ప్రధానో పాధ్యాయులుగా బాధ్యతలు నిలబెట్టుకున్న బల్ల సరస్వతమ్మ జీవితం తల్లులకు... ముఖ్యంగా తెలంగాణ తల్లులకు ప్రతి బింబమై అట్టడుగున పడి ఉన్న మగువల చరిత్రను తట్టిలేపు తుంది. విమలక్క వ్యాసకర్త సాంస్కృతిక కార్యకర్త (నేడు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బల్ల సరస్వతమ్మ ఆత్మకథ ‘కలెనేత’ ఆవిష్కరణ సందర్భంగా.) -
అయినా.. నేను ఓడిపోలేదు
నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్: అమ్మ, నాన్న పోలెపల్లి వెంకటరెడ్డి, సరస్వతమ్మలది వరంగల్ జిల్లా జఫర్ఘడ్ మండలం నర్సింహులుగూడెం గ్రామం. మాది పేద వ్యవసాయ కుటుంబం. నాతోపాటు ఐదుగురు బుట్టువులం. ఎమర్జెన్సీలో నాన్న టీచర్ ఉద్యోగం పోయింది. మా చదువులు, కుటుంబ పోషణ భారమైంది. ఏదైనా హాస్టల్లో నన్ను చదివించాలనుకున్నారు. అలా హన్మకొండలోని ‘బాలసదనం’లో అవకాశముందని అక్కడికి తీసుకెళ్లారు. అందరూ ఉండి అనాథను బాలసదనంలో అనాథ పిల్లలకే ప్రవేశమని చెప్పారు. దాంతో తల్లిలేని పిల్ల అ ని నిర్వాహకులకు చెప్పి నాన్న అందులో చేర్పించారు. అందరూ ఉండి అనాథలా ప్రవేశం పొందాను. అమ్మ బతికే ఉన్నా హాస్టల్‌కు వచ్చిపోయే పరిస్థితి లేకపోవడం బాధించింది. అప్పుడప్పుడు వచ్చి పోయేవాళ్లలోనే అమ్మను చూసుకునేదాన్ని. పదోతరగతి ప్రథమ శ్రేణిలో పాసయ్యాను. ఉన్నత చదువు.. ఇంకా ఎన్నో ఆలోచనలు నాలో మెదిలే సమయంలోనే 16ఏళ్ల వయస్సులోనే మా బంధువు సమ్మిరెడ్డితో పెళ్లయింది. మా ఇద్దరు పిల్లలకు పాలు కూడా పట్టలేని పరిస్థితి. అలా ఐదు రూపాయల కూలికి వ్యవసాయ పనులకు వెళ్లాను. చదువుపై ఇష్టంతో 1989లో నెహ్రూ యు వ కేంద్రం వయోజన విద్యాకార్యక్రమాలు నిర్వహించాను. *150 వేతనంతో వాలిం టర్గా పనిచేశా. టైలర్‌గా, విద్యావలంటీర్‌గా, సేల్స్‌గర్ల్‌గా కూడా పనిచేశారు. 1991లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చేరి డిగ్రీ, పీజీ చదివా. అన్నా యూనివర్సిటీలో బీఈడీ చదివి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సంపాదించాను. అమెరికా వైపు.. మా బంధువుల్లో చాలామంది అమెరికాలో ఉండడంతో అ మెరికా వెళ్లాలని ఉండేది. 1997లో హెచ్ -1విజిటర్ వీసాపై అమెరికాలో అడుగుపెట్టాను. విజిటర్స్ వీసాతో ఉ ద్యోగం చేయడానికి అక్కడి చట్టాలు అనుమతించవని తెలిసి ఇబ్బం దిపడ్డాను. ముందుగా న్యూజెర్సీలో ‘మూవీటైం’అనే వీడి యోషాలోనే సేల్స్‌పర్సన్‌గా ఉద్యోగంలో చేరాను. అక్క డ ఓ గుజరాతీ కుటుంబంలో పేయింగ్‌గెస్ట్‌గా తలదాచుకున్నాను. టైప్రావడం, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండడంతో అక్కడ పనిచేస్తున్న వరంగల్ జిల్లాకు చెందిన వారి సహకారంతో ఓసాప్ట్వేర్ కన్సలెన్సీలో ఉద్యోగం సంపాదించాను. తర్వాత కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఆఫ్ అమెరికా కంపెనీలో రి క్రూటర్గా ఉద్యోగం దొరికింది. ఈ కంపెనీ వారి సహకారం తో ముందుగా వీసా ఎక్స్టెన్షన్, ఆతర్వాత వర్జీనియాలో ఏడాదికి ఆరవైవేల డాలర్ల ప్యాకేజీతో ఉద్యో గం రావడంతో అమెరికాలో సెటిలయ్యాను. 2001లో ‘కీ’ సొల్యూషన్ సాప్ట్ వేర్ కంపెనీని స్థాపించా. ప్రస్తుతం మాకంపెనీలో పనిచేస్తు న్న 65మంది ఉద్యోగులకు నెలకు కోటిన్నర రూపాయల దా కా వేతనాలు ఇస్తున్నాను. వీసా కోసం నేను పడిన ఇబ్బంది మరొకరికి రాకుండా ఉండాలనే సంస్థను స్థాపించా. పిల్లలు అమెరికాలోనే పిల్లలిద్దరికీ పెళ్లిళ్లలయ్యాయి. వారు అమెరికాలోనే స్థిరపడ్డారు. నేను అనాథ స్కూల్లో చదివాను. మా పిల్లలను ఏటా కోటి రూపాయల ఫీజులుండే విద్యాసంస్థల్లో చది వించాను. వారు కూడా ఫ్రొఫెషనల్స్గా పనిచేస్తున్నారు. నా విజయగాథకు అక్షర రూపమిచ్చాను. ‘అయినా...నేను ఓడిపోలేదు’ అనే పుస్తకం రాశాను. నేను అనుభవించిన ప్రతి కష్టాన్నీ ఆత్మక థగా వివరించా.