గుర్తుపెట్టుకోండి!
సమ్సారం
సంసారంలో సినిమా
‘‘ఏమంటున్నాడూ.. నీ ఫ్రెండ్?’’ సాగదీసి అడిగింది.‘‘పెళ్లి చేసుకుంటే అంతా వింతగా ఉంది అన్నాడు.’’ ‘‘వింతగా ఉండడమంటే?’’ ‘‘ఇదివరకు రాత్రి ఎన్నింటికి వెళ్లినా ఏదోలా మేనేజ్ చేసేవాడు. ఇప్పుడు అస్సలు కుదరట్లేదట. కాస్త లేట్ అయితే ఫోన్ వస్తదట. గొడవలు జరిగిపోతాయట. బయట... వాడికంటూ ఒక స్పేస్ ఉండట్లేదు అన్నాడు.’’ ‘‘పెళ్లయితే ఉండదు మరి!’’ ‘‘అంతేనంటావా?’’ ‘‘అంతే మరి! ఇంట్లో పెళ్లాం వెయిట్ చేస్తదని తెలీదా? నీ ఫ్రెండ్‌కి’’
ఆదివారం రోజది. వాడికి సెలవు. నాకూ సెలవే. ‘ఇంకేదన్నా చెప్పు!’ అని ఎవ్వరూ అడుక్కోవాల్సిన అవసరం లేకుండా మా మాటలు సాగుతున్నాయి. సాయంత్రం ఏడున్నరయింది. వాడికి ఫోనొచ్చింది. ఫోన్ ఎత్తిన తర్వాత స్పీకర్‌కు చెయ్యి అడ్డం పెట్టి చెప్పాడు.. ‘‘వైఫ్ వైఫ్..’’ అని. నేను ‘సరే’ అన్నట్టు నవ్వా. నిమిషం కూడా మాట్లాడలేదు. ఏం మాట్లాడి ఉంటాడోనన్నది నాకిప్పటికీ తెలియలేదు. అది తర్వాత్తర్వాత నేనే తెలుసుకోవాలేమో! ‘‘నేనొస్తా మరి!’’ అంటూ తొందర పడుతూ లేచి వెళ్లిపోయాడు. వాడి భార్య తిట్టి ఉండొచ్చు. పాపం నేనే ఆ అమ్మాయిని తప్పుగా అర్థం చేసుకోవచ్చు కూడా! వాడు అలా వెళ్లిపోగానే నా అమ్మాయి ఫోన్ చేసింది.
‘‘ఏంటి ఇందాక ఫోన్ ఎత్తలేదు?’’ అడిగింది.‘‘ఫ్రెండ్‌తో మాట్లాడుతూ ఉండేరా!’’ సమాధానమిచ్చా.‘‘అచ్చా కూల్!’’‘‘పాపం వాడి వైఫ్ కాల్ చేసింది. పరుగెత్తుకుంటూ వెళ్లిపోయాడు’’‘‘హహహ.. రమ్మనా?’’‘‘యా! ఒక్క నిమిషం కూడా నిలబడలేదు. పాపం కదా!’’‘‘పూర్ ఫెలో!’’‘‘ఆల్ హజ్బెండ్స్ ఆర్ పూర్ ఫెలోస్!’’ స్టేట్మెంట్ ఇచ్చేశా.‘‘అలా ఎందుకు అనుకుంటావ్?’’ గట్టిగా అడిగింది.‘‘అదే నిజం కాబట్టి!’’‘‘అదేం లేదు. జనరలైజ్ చేయడం తప్పు.’’ మందలించింది.‘‘సరే!’’‘‘ఏమంటున్నాడూ.. నీ ఫ్రెండ్?’’ సాగదీసి అడిగింది.
‘‘పెళ్లి చేసుకుంటే అంతా వింతగా ఉంది అన్నాడు.’’
‘‘వింతగా ఉండడమంటే?’’‘‘ఇదివరకు రాత్రి ఎన్నింటికి వెళ్లినా ఏదోలా మేనేజ్ చేసేవాడు. ఇప్పుడు అస్సలు కుదరట్లేదట. కాస్త లేట్ అయితే ఫోన్ వస్తదట. గొడవలు జరిగిపోతాయట. బయట... వాడికంటూ ఒక స్పేస్ ఉండట్లేదు అన్నాడు.’’‘‘పెళ్లయితే ఉండదు మరి!’’‘‘అంతేనంటావా?’’‘‘అంతే మరి! ఇంట్లో పెళ్లాం వెయిట్ చేస్తదని తెలీదా? నీ ఫ్రెండ్‌కి’’‘‘తెలీదని కాదు.’’‘‘మరి! మళ్లీ నీకొచ్చి ఇవన్నీ చెప్పుకుంటాడు. నాకది నచ్చదు.’’‘‘ఏది?’’‘‘ఇలా ఇంట్లోవన్నీ బయటచెప్పుకోవడం’’‘‘నేనేం బయటివాడిని కాదు.’’‘‘నువ్వు ఎవ్వడివైనా! చెప్పుకోవద్దు.’’
‘‘ఇప్పుడేమంటావ్?’’‘‘మా ఇంట్లో కూడా గొడవలు జరుగుతాయ్! అమ్మ అవన్నీ తీసుకెళ్లి తన ఫ్రెండ్స్‌కి చెప్పుకుంటుంది. నాకు నచ్చదు. అదే నాన్న మెచ్చుకున్నవి, అడిగిందల్లా చేసి పెట్టినది చెప్పుకుంటుందా?’’‘‘అలాంటివి మా అన్న కూడా మాకు చెప్పడు. ఎవ్వరైనా గొడవలే చెప్పుకుంటారు.’’‘‘ఆ గొడవలు కూడా చెప్పుకోవద్దు. వైఫ్ అండ్ హజ్బెండ్ అన్నాక వాళ్ల మధ్యవి వాళ్ల మధ్యలోనే ఉండాలి.’’‘‘కానీ ఇలా బయట కాసేపు కూడా ఉండనివ్వకపోతే ఎలా?’’‘‘అదీ నీక్కావల్సింది. ఆల్ మెన్ ఆర్ సేమ్!’’‘‘నువ్వు జనరలైజ్ చెయ్యొచ్చు అయితే!’’‘‘హహహ.. నువ్వు భయపడిపోతున్నావ్?’’‘‘నాకేం భయం! నేనేందుకు భయపడాలి?’’ నిజానికి నిజంగానే భయమేసింది.
‘‘అలా కాదు. నీ టోన్ బట్టి అనిపించింది. నీకొకటి చెప్పనా?’’ స్వీట్‌గా అడిగింది.‘‘చెప్పు..’’‘‘మన పెళ్లయ్యాక నువ్వు రాత్రి ఎన్నింటికి వచ్చినా నేనడగను.’’‘‘హహ.. నువ్వే ఇందాకేదో అన్నావ్?’’‘‘అది తన కేస్. నేనైతే నువ్వు పదిరోజులు రాకున్నా ఏమీ అనుకోను’’ గట్టిగా నవ్వుతూ అంది.ఆదివారం రోజది. తనకు సెలవు. నాకూ సెలవే. సాయంత్రం ఎనిమిది అయింది.గుర్తుపెట్టుకొండి. పెళ్లయ్యాక ఇక్కడే మాట్లాడుకుందాం. అదే! మేము పెళ్లి చేసుకొని వచ్చాక!!
సినిమాలో సంసారం
దేవరాజ్ (ఉపేంద్ర) ఊరి పెద్ద. ఊర్లో ఎవరికి ఏ కష్టమొచ్చినా ఆయనకు చెప్పుకుంటారంతా. మంచోడే కానీ తాతల కాలం నుంచి వచ్చిన పగలను వదిలిపెట్టడు. అతడి భార్య లక్ష్మి (స్నేహ) ముందు మాత్రం ఏ గొడవలకు వెళ్లనట్టే కనిపిస్తాడు. ‘ఒక్క పనైనా సరిగ్గా చేయరు’ అంటూ లక్ష్మి దేవరాజ్‌ను ఎప్పుడూ తిడుతూనే ఉంటుంది. అంత పెద్ద మనిషైనా భార్య ముందు మాత్రం మామూలోడే! ఆమెకు భయపడి మెల్లిగా ఫ్యాక్షనిజం కూడా పక్కన పెట్టేస్తాడు. చివర్లో ఏయే కారణాల వల్ల మారినా, భార్య ముందే తన తప్పులన్నీ ఒప్పేసుకొని మంచి వాడైపోతాడు దేవరాజ్. ఇలాంటి దేవరాజ్‌లు మన జీవితాల్లోనూ ఉంటారు కదూ! భార్య మీద ఇష్టమైన భయంతో మంచిగా బతికేవారు, మంచిగా మారిపోయేవారు!! త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలో దేవరాజ్–లక్ష్మిల సంసారాన్ని చూడొచ్చు.
ప్రతి సంసారంలోనూ కొన్ని ఇబ్బందులుంటాయి. అప్పటికవి పెద్దవే. ఎలాగోలా గట్టెక్కుతాం. వాటివల్లనే సంసారం బలపడుతుంది. ఆ అనుభవంతో చిన్న, పెద్ద ఇబ్బందులను దాటుకుని హాయిగా జీవించడం నేర్చుకుంటాం. కొంతకాలం తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అదసలు సంకటమే కాదనిపిస్తుంది, పొట్ట చెక్కలయ్యేలా నవ్వొస్తుంది కూడా. అలాంటి సరదా సంఘటనలను అక్షరాలతో కళ్లకు కట్టండి.
సాక్షి పాఠకులతో పంచుకోండి.
ఈ మెయిల్: samsaaram2017@gmail.com
– వి. మల్లికార్జున్