సామినేని ఉదయభానుకు వైఎస్ జగన్ పరామర్శ
                  
	జగ్గయ్యపేట : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం పార్టీ  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని ఉదయభానును పరామర్శించారు. సామినేని ఉదయభాను తండ్రి సామినేని విశ్వనాథం అస్వస్థతతో ఇవాళ ఉదయం మృతి చెందారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పంచాయతీ కి సామినేని విశ్వనాధం ఇరవై రెండు సంవత్సరాల పాటు సర్పంచ్ గా పనిచేశారు. మార్కెట్ యార్డ్ ఛైర్మన్గా కూడా పని చేశారు. జగ్గయ్యపేట కు ఆయన హయాంలోనే రక్షిత మంచినీటి పథకం,  విద్యా, వైద్యశాలలను అందుబాటులోకి తీసుకువచ్చారు.
	
	దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో విశ్వనాధంకు అత్యంత సాన్నిహిత్యం వుంది. ఆయన అకాల మరణ వార్త తెలియగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ హుటాహుటిన జగ్గయ్యపేటకు చేరుకుని ఉదయభాను కుటుంబాన్ని పరామర్శించారు. విశ్వనాధం మృతదేహానికి నివాళి అర్పించారు. వైఎస్ జగన్ తో పాటు పార్టీ నేతలు కొలుసు పార్థసారథి,  ఎమ్మెల్యే రక్షణనిధి, జోగి రమేష్, సింహాద్రి రమేష్, గౌతం రెడ్డి,  తోట శ్రీనివాస్, ఉప్పాల రాము తదితరులు విశ్వనాథం మృతదేహానికి నివాళి అర్పించారు.