రవాణాకనుగుణంగా సైలేజ్ బేల్స్ తయారు
పశు సంవర్ధకశాఖ జేడీ రవీంద్రనాథఠాగూర్
అనంతపురం అగ్రికల్చర్ : రైతులు సులభంగా తీసుకెళ్లడానికి వీలుగా సైలేజ్ బేల్స్ (మాగుడి గడ్డి బేల్స్) తయారు చేస్తున్నట్లు పశుసంవర్ధకశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ వి.రవీంద్రనాథఠాగూర్ తెలిపారు. గురువారం తన ఛాంబర్లో ఫాడర్ ఏడీ సుబ్రమణ్యంతో పాటు బేల్స్ తయారు చేసే కంపెనీ ప్రతినిధితో ఆయన సమావేశమయ్యారు. గతేడాది ఒక్కో బేల్ బరువు 400 నుంచి 400 కిలోలుగా ఉండటంతో వాటిని తీసుకెళ్లడానికి రైతులు అవస్థలు పడ్డారన్నారు. ఈ సారి 120 కిలోలు బరువు కలిగిన బేల్స్ను తయారు చేయాలని కంపెనీ ప్రతినిధిని ఆదేశించగా...అందుకు సానుకూలంగా ఆయన స్పందించారు. తాడిపత్రి ప్రాంతంలో మొక్కజొన్న సాగు చేసిన రైతులను గుర్తిస్తున్నట్లు తెలిపారు. టన్ను మొక్కజొన్న గడ్డికి రైతుకు రూ.2 వేల చొప్పున చెల్లిస్తున్నట్లు కంపెనీ ప్రతినిధి తెలిపారు. త్వరలోనే కిలో రూ.2 ప్రకారం బేల్స్ సిద్ధం చేస్తామన్నారు. బేల్స్తోపాటు ఇప్పటికే కిలో రూ.4 ప్రకారం పశుదాణా, కిలో రూ.3.50 ప్రకారం దాణామృతం (టీఎంఆర్ బ్లాక్స్) రైతులకు పంపిణీ చేస్తున్నట్లు జేడీ తెలిపారు.