షిర్డీ ఉద్యోగులు రాజకీయాలకు దూరం
సాక్షి, ముంబై: షిర్డీలోని సాయిబాబా ఆలయ సంస్థాన్ ఉద్యోగులు రాజకీయ పదవులను స్వీకరించరాదని కొత్తగా నియమ నిబంధనలు విధించారు. దీంతో సంస్థాన్‌లో పనిచేసే ఉద్యోగులు భవిష్యత్తులో స్థానిక సంస్థలు, శాసన సభ, లోక్‌సభ తదితరా ఎన్నికల్లో పోటీచేసేందుకు అవకాశం లేకుండా పోయింది. ఎన్నికల్లో పోటీచేయాలనుకుంటే ఉద్యోగులు సాయి సంస్తాన్ను వదులుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం సాయి సంస్థాన్ కార్యవర్గంలో రాజకీయ నాయకులు వివిధ పదవుల్లో కొనసాగుతున్నారు.
కొత్త నియమాలు ఇలా ఉన్నాయి...
సాయి సంస్థాన్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారులు ఎలాంటి రాజకీయ పార్టీల్లో సభ్యులుగా ఉండరాదు. ఎలాంటి ఎన్నికల్లోనైనా అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయరాదు. తమ వాహనాలపై లేదా ఇంటివద్ద లేదా ఒంటిపై ఎన్నికల గుర్తుతో కూడిన కండువాగాని, జెండాగాని ధరించరాదు. ఆలయ సిబ్బందిగాని, వారి కుటుంబ సభ్యులుగాని రాజకీయ నాయకులు అందజేసే ఎలాంటి కానుకలు స్వీకరించరాదు. వారిచ్చే విందులు, వినోదాలు, ఇతర ఆర్థిక సాయం పొందరాదు.
ఒకవేళ అతిదగ్గరి బంధువుతే ముందుగా సంస్థన్కు తెలియజేయాలి. రూ.ఐదు వేల కంటే ఎక్కువ విలువైన వస్తువులుంటే సంస్థాన్ అనుమతి పొందిన తరువాతే వాటిని తీసుకోవాలి. ఏదైనా సంస్థ, కంపెనీ లేదా ఎవరైన వ్యక్తి ఇచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించేందుకు వీలులేదు. అంతేగాకుండా సంస్థాన్ అనుమతి లేకుండా సిబ్బంది ఎలాంటి పురస్కారాలు పొందరాదు. సంస్థాన్‌లో పనిచేస్తున్న సిబ్బంది మరోచోట ఉద్యోగం చేయరాదు. సంస్థాన్ అనుమతి లేకుండా వ్యాపారాల్లో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్గొనకూడదు.
బ్యాంకుల్లో లేదా ఇతర సహకార సంస్థల్లో, వాణిజ్య సంస్థల్లో ఎవరికి జామీను ఉండకూడదు. కొత్త నియమాలు అమలులోకి రావడంవల్ల రెండు చోట్ల ఉద్యోగం చేస్తున్న కొందరు అందులో ఏదో ఒకటి వదులుకోవల్సి ఉంటుంది. దీంతో త్వరలో అనేక పదవులు ఖాళీ కానున్నాయి. నిరుద్యోగులకు ఇదొక మంచి అవకాశంగా పరిణమించనుంది.