టీవీ నటితో తాగుబోతు అసభ్య ప్రవర్తన!
ముంబై: ప్రముఖ టీవీ సీరియల్ నటి ప్రతిభా తివారిని నడిరోడ్డుమీద ఓ తాగుబోతు వేధించాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ముంబైలో ఇటీవల ఈ ఘటన జరిగింది. 'సాథ్ నిభానా సాథియా' వంటి పలు హిందీ సీరియళ్లతో ప్రతిభా తివారీ గుర్తింపు తెచ్చుకుంది
ఇటీవల కందివాలి హైవేపై రాత్రి పది గంటల సమయంలో ఆమె, తన హెయిర్ డ్రెస్సర్ తో కలిసి ఎదురుచూస్తోంది. ఈ సమయంలో ఓ తాగుబోతు వారిని సమీపించి, అసభ్యంగా ప్రవర్తించాడు. అతడి సతాయింపులతో విసిగిపోయిన ప్రతిభా తివారీ.. ఆ ఆకతాయిని సమీపంలోని పోలీసు స్టేషన్ కు ఈడ్చుకెళ్లి అప్పగించింది. అతడిపై ఫిర్యాదు చేసింది. తాగిన మత్తులో ఆమెను వేధించిన వ్యక్తి కనీసం క్షమాపణ కూడా చెప్పలేదని తెలిసింది.
ఈ ఘటన గురించి తాజాగా 'టైమ్స్ ఆఫ్ ఇండియా'తో మాట్లాడిన ప్రతిభా తివారీ మహిళలు ఇలాంటి ఆకతాయిలను ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించింది. 'రద్దీగా ఉన్న రోడ్డుపై రాత్రి 10 గంటల సమయంలో ఇలాంటి ఘటన జరగడం నన్ను విస్మయ పరిచింది. ఇది నన్ను షాక్ కు గురిచేయడమే కాదు వాస్తవ పరిస్థితి ఏమిటో తెలియజేసింది. ఇలాంటి ఘటనలపై ఫిర్యాదు చేయడానికి మహిళలు భయపడతారని నాకు తెలిసింది. కానీ ఇలాంటివాటిపై వారు పోరాడాల్సిన అవసరముంది' అని ఆమె పేర్కొంది.