breaking news
Ruin buildings
-
ఎన్ని ఉన్నా.. కూల్చేయాల్సిందే..
► అధికారులకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశం సాక్షి, సిటీబ్యూరో: నగరంలో అత్యంత ప్రమాదకరంగా ఉన్న శిథిలావస్థలోని భవనాలను వెంటనే కూల్చివేయాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇందుకుగాను జోనల్, డిప్యూటీ కమిషనర్లు, ఏసీపీలు స్వయంగా తనిఖీలు నిర్వహించాలన్నారు. నగరంలో ఎడతెగని వర్షం కురుస్తున్న నేపథ్యంలో బుధవారం రాత్రి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ అంశంలో అశ్రద్ధ వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. శిథిల భవనాల్లో ఉంటున్నవారిని ఖాళీ చేయాల్సిందిగా వారికి నచ్చజెప్పాలన్నారు. డిప్యూటీ కమిషనర్లు పదిశాతం, జోనల్ కమిషనర్లు ఐదు శాతం శిథిలావస్థలోని ఇళ్లను తనిఖీ చేయాలని, ఏసీపీలు నూరు శాతం ఇళ్లు తనిఖీ చేయాలని సూచించారు. ఇతర ఆశ్రయం లేని వారికి తాత్కాలిక షెల్టర్లు ఏర్పాట్లు చేయాలని సూచించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించనున్న ప్రాంతాల్లోని ప్రజలకు వాటి గురించి వివరించి వారిని ఒప్పించాల్సిందిగా జోనల్, డిప్యూటీ కమిషనర్లకు సూచించారు. భవన నిర్మాణ అనుమతులు, సెట్‌బ్యాక్స్ తదితరమైన వాటికి సంబంధించి వచ్చేవారం నుంచి బిల్డర్లు, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా సూచించారు. ఎల్ఆర్ఎస్ ఫైళ్లను త్వరితంగా పరిష్కరించాలని సూచించారు. -
ఇరుకు గదుల్లో బాల్యం
సగానికిపైగా అంగన్వాడి కేంద్రాలు అద్దె కొంపల్లోనే ఏళ్ల తరబడి నిర్మాణం పూర్తికాని 309 భవనాలు వాటిని పట్టించుకోకుండా కొత్తగా 691 భవనాలు మంజూరు 225 చోట్లే అందుబాటులో స్థలాలు అంచనా వ్యయం రూ.12.50 లక్షలు.. ఇచ్చింది ఏడు లక్షలు ఏం చేయాలో పాలుపోని స్థితిలో అధికారులు ప్రజాప్రతినిధుల చిత్తశుద్ధి లోపం.. శాఖల మధ్య కొరవడిన సమన్వయం అంగన్వాడీ చిన్నారులకు శాపంగా మారింది. అద్దె కొంపలు.. ఇరుకు గదులు.. శిథిల భవనాల్లో బిక్కుబిక్కుమంటూ కాలం గడపాల్సి వస్తోంది. ఆర్భాటంగా శంకుస్థాపనలు చేయడం.. ఆనక నిధులు చాల్లేదని మధ్యలోనే అర్ధతరంగా నిలిపేయడం పరిపాటిగా మారింది. గత అనుభవాలను పట్టించుకోకుండా జిల్లా యంత్రాంగం మరోమారు అరకొర నిధులతో అంగన్వాడీ భవనాలు నిర్మిం చేందుకు సిద్ధమవుతోంది. విశాఖపట్నం: ముఖ్యంగా ఉపాధి హామీ, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారుల తీరు వల్ల వందలాది అంగన్వాడీ భవనాలు పిల్లర్ల స్థాయిలో నిలిచిపోయి ఎందుకూ కొరగాకుండా తయారయ్యాయి. జిల్లాలో 4952 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో 3587 మెయిన్, 1365 మినీకేంద్రాలున్నాయి. మెయిన్ కేంద్రాల్లో 1071 సెంటర్లకు సొంత భవనాలు ఉన్నాయి. 592 కేంద్రాలు ఎలాంటి అద్దె లేని ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్నాయి. మరో 1924 కేంద్రాలు అద్దె భవనాల్లో ఉన్నాయి. ఇక మినీ అంగన్వాడీ కేంద్రాల్లో ఏ ఒక్క దానికి సొంత భవనం లేదు. వీటిలో చాలా కేంద్రాలు పూరిపాకల్లో నెట్టుకొస్తున్నారు. ఏళ్ల తరబడి మొండిగోడలకే పరిమితం ఆర్ఐడీఎఫ్, ఏపీఐపీ, అప్గ్రేడేషన్ల వంటి పథకాల కింద గతంలో 981 భవనాలు మంజూరు కాగా వాటిలో 387 మాత్రమే పూర్తయ్యాయి. 285 భవనాల పనులు కనీసం ప్రారంభానికి కూడా నోచుకోలేదు. 309 భవనాల నిర్మాణాలను అర్ధంతరంగా నిలిపేశారు. అప్పట్లో ఒక్కో భవనం రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల అంచనా వ్యయంతో నిర్మాణాలు చేపట్టగా, నిధుల లేమితో మధ్యలో నిలిచిపోయి ఏళ్ల తరబడి మొండిగోడలకే పరిమితమయ్యాయి. వీటిని పూర్తిచేసేందుకు ఐసీడీఎస్ అధికారులు ఎంతగా ఒత్తిడి తీసుకొచ్చినా ఫలితం లేకుండా పోతోంది. నిధుల లేమి.. స్థలాల కొరత తాజాగా జిల్లాకు కొత్తగా 691 భవనాలు మంజూరు కాగా.. వాటిలో 346 భవనాల నిర్మాణానికి నిధులు కూడా మంజూరయ్యాయి. ఓ పక్క స్థలాల కొరత.. మరో పక్క నిధుల కొరతే వీటికి శాపంగా మారింది. కనీసం నాలుగు సెంట్లు కూడా లేకుండా భవనాలు నిర్మించే అవకాశం లేదు. కొత్తగా మంజూరైన భవనాల కోసం స్థలాలు చూపించాల్సిందిగా పంచాయతీ కార్యదర్శులను కోరినా ప్రయోజనం లేకుండా ఉంది. కేవలం 225 కేంద్రాలకు మాత్రమే చాలినంత స్థలం అందుబాటులో ఉన్నట్టు గుర్తించారు. మిగిలిన చోట్ల స్థలాల కొరత పీడిస్తోంది. మరో పక్క కనీసం రూ.12 లక్షలు అంచనా వ్యయంతో చేపడితే కానీ ఈ భవనాల నిర్మాణం పూర్తయ్యే పరిస్థితి లేదు. కానీ ఉపాధి హామీ కాంపొనెంట్ నిధుల నుంచి రూ.5 లక్షలు, ఐసీడీఎస్ నుంచి రూ.2 లక్షల చొప్పున కేటాయిస్తున్నారు. ఈ నిధులు ఏ మూలకూ సరిపోవని అధికారులు చెబుతున్నారు. మరో రూ.3 లక్షలు జెడ్పీ నుంచి సపోర్టు ఇవ్వాల్సిందిగా కోరినప్పటికీ ఆర్థిక సంఘం నిధులు నేరుగా పంచాయతీలకు కేటాయిస్తుండడంతో జెడ్పీ కూడా నిధుల కొరతతో ఇబ్బందిపడుతోంది. దీంతో ఇచ్చే పరిస్థితి లేకుండా ఉంది. దీంతో ఎన్ఆర్ఐల ద్వారా విరాళాలు సమీకరించి కనీసం రూ.10 లక్షలతోనైనా భవన నిర్మాణం చేపట్టాలని ఐసీడీఎస్ అధికారులు కృషి చేస్తున్నారు. ఇప్పటికే చిత్తూరులో ఈ విధంగా ఓ ఎన్ఆర్ఐ సంస్థ అంగన్వాడీ భవనాల నిర్మాణానికి అదనపు ఆర్థిక సాయం ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఆ సంస్థ ద్వారా జిల్లాలో అర్ధంతరంగా నిలిచిన భవనాలతో పాటు కొత్తగా నిర్మిస్తున్న భవనాలకు కూడా అవసరమైన ఆర్థికసాయం కూడగట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. -
అదే టెన్షన్
శిథిల భవనాలు.. అరకొర సదుపాయాలు నిర్వహణ సరిగాలేని మరుగుదొడ్లు సవాలక్ష సమస్యలతో టెన్త్ పరీక్షలకు సన్నాహాలు పరీక్షలు రాయడానికి సరైన బెంచీలుండవు. బెంచీలున్నా ఊగుతూ, తూగుతూ కుదురుగా ఉండవు. గదులకు సరైన కిటీకీలు, తలుపులూ ఉండవు. మరుగుదొడ్ల నిర్వహణ ఉండనే ఉండదు. ఏటా లాగే ఈ ఏడు కూడా సవాలక్ష అసౌకర్యాల నడుమ పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్నారు. జిల్లాలో పలు పరీక్షా కేంద్రాల్లో ఏళ్ల తరబడి నేలబారు పరీక్షలే రాస్తున్నారు. కంప్యూటర్ కాలంలోనూ కనీస సదుపాయాల కోసం అర్రులు చాస్తున్నారు. సాక్షాత్తూ విద్యాశాఖ మంత్రి ఇలాకాలోనే అన్ని పరీక్షా కేంద్రాల్లో ఫర్నిచరు సమకూర్చలేని పరిస్థితి. ప్రభుత్వ పాఠశాలలపై హైటెక్ సర్కారు చిన్నచూపు చూస్తుందనడానికి అరకొర సౌకర్యాలే సాక్ష్యం. అయినా ఆ పరీక్షా కేంద్రాల్లోనే ‘పదో తరగతి గండం’ గట్టెక్కడానికి తంటాలు పడుతున్నారు. - సాక్షి, విశాఖపట్నం కూర్చోడానికి బెంచీలు ఉండవు.. తాగునీరు సరిగ్గా దొరకదు.. మరుగుదొడ్లు కానరావు. గాలీవెలుతురు లేని గదుల్లోనే పరీక్షల యుద్ధం చేయాలి. చెమట పట్టినా.. కంటికి కనిపించకపోయినా పోరాటం చేయాల్సిందే. ముంచుకొస్తున్న సమయం.. తీవ్రమైన ఒత్తిడితో కొట్టుమిట్టాడాల్సిందే. దీనికి తోడు పరీక్ష కేంద్రాలకు వెళ్లడం, రావడం ఓ ప్రహసనం. బస్సు సౌకర్యం ఉండదు. ఆటోలు దొరకవు. ఇతర వాహనాల్లో పరుగులు తీయాలి. ఇదీ జిల్లాలో పదో తరగతి విద్యార్థుల పరిస్థితి. దుర్భరస్థితి. ఈ నెల 21వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్ష కేంద్రాలను సాక్షి పరిశీలించింది. పలు సమస్యలను గుర్తించింది. - సాక్షి నేలబారు రాతలే అరకులోయ: అరకులోయ నియోజకవర్గం పరిధిలో 2,168 మంది విద్యార్థులు పరీక్షలకు సిద్ధం అవుతున్నారు. కొన్ని పరీక్ష కేంద్రాలు మినహా మిగిలిన చోట్ల విద్యార్థులకు నేలబారు పరీక్షే. అరకులోయ గురుకులం బాలికల పాఠశాల విద్యార్థులు రోజు ఆటోలపై కిక్కిరిసి ప్రయాణం సాగించాల్సి ఉంది. కొత్తభల్లుగుడ, గురుకులం బాలుర, బాలికల పాఠశాలలలో 160 మంది చొప్పున 320 మంది, సీఏహెచ్స్కూల్లో 150 విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. సీఏహెచ్ స్కూల్లో బెంచీలు లేవు. హుకుంపేట, ముంచంగిపుట్టు, అనంతగిరి పరీక్ష కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి. పెదబయలు మండలంలో గురుకుల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో మాస్ కాపీయింగ్ జరిగే అవకాశం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే పలు పాఠశాలలోని పరీక్షా కేంద్రాల్లో వెలుతురు సమస్యా ఉంది. డుంబ్రిగుడ మండలం గిరిజన సంక్షేమ బాలుర పరీక్ష కేంద్రంలో బెంచీలు లేకపోవడంతో వేరే చోట నుంచితీసుకొస్తున్నారు. తాగునీటి సమస్యా ఉంది. ఏజెన్సీలో ఎన్ని తిప్పలో.. పాడేరు: పరీక్షల సమయం ఆసన్నమైతే ఏజెన్సీలోని ఆశ్రమ పాఠశాలల పదో విద్యార్థులకు అన్నీ అవస్థలే ఎదురౌతున్నాయి. ఏజెన్సీ 11 మండలాల పరిధిలో 145 ఉన్నత పాఠశాలలు ఉండగా ఇందులో 100కు పైగా పాఠశాలలకు పరీక్షా కేంద్రాలు అందుబాటులో లేవు. పరీక్షా కేంద్రాలు లేని పాఠశాలల విద్యార్థులకు మండల కేంద్రాల్లో వేర్వేరు పాఠశాలల్లో వసతి ఏర్పాటు చేస్తున్నారు. ఆశ్రమాల్లో అరకొర మౌలిక సౌకర్యాల వల్ల విద్యారులు కఠిన పరీక్షను ఎదుర్కొంటున్నారు. పరీక్షా కేంద్రాల్లో కూడా కూర్చునే బెంచీల నుంచి తాగునీరు, వైద్యసదుపాయల కల్పన కూడా అధికారులు పరీక్షల ముందే తాత్కాలిక ఏర్పాట్లు చేయడం పరిపాటిగా మారింది. ఇంటర్ పరీక్షలు పూర్తయిన తరువాత కళాశాలల నుంచి టెన్త్ పరీక్షా కేంద్రాలకు ఫర్నీచర్ సర్దుబాటు చేస్తున్నారు. మైదాన ప్రాంతమైన వి.మాడుగుల మండల పరిధిలోనున్న నర్సయ్యపేట, తాటిపర్తి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల నుంచి గిరిజన విద్యార్థులు 160 మంది పాడేరు వచ్చి పరీక్షలు రాయాల్సిన పరిస్థితి. అలాగే మండలంలోని గుత్తులపుట్టు, రాయిగెడ్డ, డోకులూరు, మోదాపుట్టు, కందమామిడి, మలకపొలం 6 ఆశ్రమ పాఠశాలల నుంచి 300 మంది విద్యార్థులు పాడేరు పరీక్షా కేంద్రాలకు హాజర వుతున్నారు. 83 కేంద్రాల్లో ఫర్నీచర్ లేదు.. విశాఖపట్నం: ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను జిల్లావ్యాప్తంగా 268 పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. ఇందులో జిల్లాలో 140 కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 70 కేంద్రాల్లో పాక్షికం, 13 కేంద్రాల్లో పూర్తిగానూ ఫర్నిచరు లేదు. అంటే.. నాలుగోవంతు సెంటర ్లలో బెంచీలు, బల్లలు లేవన్న మాట. ఈ కేంద్రాల్లో పిల్లలు పరీక్షలు రాయడానికి పొరుగు స్కూళ్లు, కాలేజీల నుంచి ‘అప్పు’ తెస్తున్నారు. ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 7 వరకు జరగనున్న పదో తరగతి పరీక్షలకు జిల్లాలో 62,568 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 56,756 మంది, ప్రైవేటు విద్యార్థులు 5,812 మంది రాస్తున్నారు. అరకొర వసతులు నర్సీపట్నం: పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతుల్లేక ఏటా టెన్త్ విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. గతేడాది చాలా కేంద్రాల్లో నేలపై కూర్చొని పరీక్షలు రాశారు. నర్సీపట్నం మున్సిపాలిటీ, రూరల్ మండలంలోని పది కేంద్రాల్లో 2,500 మంది, మాకవరపాలెం మండలంలో 3 కేంద్రాల్లో 540 మంది, నాతవరం మండలం 3 కేంద్రాల్లో 625 మంది, గొలుగొండ మండలంలో 3 కేంద్రాల్లో 723 మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలు రాయనున్నారు. గతేడాది స్థానిక జెడ్పీ బాలికల హైస్కూల్లో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేయడంతో అధికారులు బెంచీలు ఏర్పాటుచేశారు. నర్సీపట్నం ప్రభుత్వ హైస్కూల్లో బెంచీలు లేవు. రన్నింగ్‌వాటర్ లేక మరుగుదొడ్లు నిరుపయోగంగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం అందుబాటులో లేక విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోలేక అవస్థలు పడ్డారు. డీఈవో ఎంవీ కృష్ణారెడ్డి ఏమంటున్నారంటే జిల్లాలో 70 పరీక్షా కేంద్రాల్లో పాక్షికంగాను, 13 సెంటర్లలో పూర్తిగాను ఫర్నిచరు లేదు. ఫర్నిచరు లేని 13 సెంటర్లకు తాజాగా ప్రభుత్వం మూడు వేల బెంచీలను మంజూరు చేసింది. వీటిలో వెయ్యి గాజువాక, చోడవరం, నర్సీపట్నం ప్రాంతాల్లోని కేంద్రాలకు పంపించాం. మంగళవారం నాటికి మరో రెండు వేల బెంచీలు రానున్నాయి. వీటిని మిగిలిన సెంట్లకు పంపుతాం. ఈ ఏడాది టెన్త్ పరీక్షలు నేలపై రాయకుండా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. దూరాభారం..పరీక్షపై ప్రభావం అనకాపల్లి: నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన 19 కేంద్రాల్లో 4,620 మంది విద్యార్థులు పరీక్షలు హాజరుకానున్నారు. అనకాపల్లి మండలంలో 14, కశింకోట మండలంలో ఐదు కేంద్రాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు నానా హరానా పడుతున్నారు. అనకాపల్లి మండలంలోని 32 పంచాయతీలకు కేవలం మూడు ప్రాంతాల్లోనే పరీక్షా కేంద్రాలు కేటాయించారు. దీంతో శారదానది ఒడ్డు గ్రామాలు, సబ్బవరం రహదారి గ్రామాలకు చెందిన పదో తరగతి విద్యార్థులకు పరీక్ష కేంద్రాలు దూరంగా ఉన్నాయి. దీంతో వీరువెళ్లాలన్నా.. రావాలన్నా వీరికి అవస్థలు తప్పవు. అనకాపల్లి పట్టణానికి దూరంగా ఉన్న జేఎంజే సెంటర్‌కు కూడా వెళ్లేందుకు ఇబ్బంది పడవలసి వస్తుంది. అవస్థ పట్టని వ్యవస్థ యలమంచిలి: యలమంచిలిలో పదో తరగతి విద్యార్థుల కోసం నాలుగు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిల్లో 800 పరీక్షలు రాస్తారు. యలమంచిలి బాలికోన్నత పాఠశాలలో గదులకు కిటికీలు, తలుపులు సక్రమంగా లేవు. పరీక్షా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన బల్లలు కొన్ని మరమ్మతులకు గురయ్యాయి. వీటిలో కొన్ని ఊగడం, రాసుకునేందుకు అనువుగా లేకపోవడంతో విద్యార్థులకు అసౌకర్యం ఎదురుకానుంది. మునగపాక జిల్లా పరిషత్, ప్రియదర్శిని పబ్లిక్ స్కూళ్లకు పదో తగరతి పరీక్షా కేంద్రాలు కేటాయించారు. గణపర్తి జిల్లాపరిషత్ హైస్కూల్‌కు ఈ ఏడాది నుంచి పదోతరగతి పరీక్షా కేంద్రం మంజూరు చేశారు. ఇక్కడ 105 మంది విద్యార్థులు పరీక్ష రాస్తారు. తోటాడ జిల్లా పరిషత్ నుంచి మునగపాక హైస్కూల్‌కు పరీక్ష రాసేందుకు రావాలంటే విద్యార్థులకు తిప్పలు తప్పడంలేదు. సుమారు 5 కిలోమీటర్ల మేర ప్రయాణం చేయాల్సి ఉంది. ఇక్కడ నుంచి వీరికి బస్సు సదుపాయం లేదు. ఆటోలే గతి. మరుగుదొడ్లు సరిపడా లేవు. రాంబిల్లి మండలంలో రాంబిల్లి, పంచదార్ల, దిమిలి ఉన్నత పాఠశాలలు పదో తరగతి పరీక్ష కేంద్రాలుగా ఉన్నాయి. రాంబిల్లిలో 335 మంది, దిమిలిలో 119 మంది, పంచదార్లలో 160 మంది పరీక్షలు రాస్తున్నారు. రాంబిల్లి కేంద్రంలో రెండే మరుగుదొడ్లు ఉన్నాయి. పంచదార్ల కేంద్రంలో ఫర్నీచర్ కొరత ఉంది. దిమిలి పరీక్ష కేంద్రానికి రవాణా సమస్య ఉంది. ఈ కేంద్రానికి ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. వెళ్లాలన్నా..రావాలన్నా.. మాడుగుల: మాడుగుల మండలంలో కేజేపురం, వొమ్మలి పదో తరగతి పరీక్ష కేంద్రాలకు వెళ్లేందుకు ఎటువంటి వాహన సదుపాయం లేదు. కేజేపురం కేంద్రానికి వీరనారాయణం, చింతలూరు, గొటివాడ అగ్రహారం, జంపెన గ్రామాల నుంచి విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. వీరంతా ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటు చేసుకుని పరీక్షకు రావాలి. వొమ్మలి కేంద్రానికి గాదిరాయి, ఎం. కృష్ణాపురం, కింతలి, వీజేపురం, జేడీపేట, సత్యవరం, పొంగలిపాక, కింతలి వల్లాపురం విద్యార్థులు హాజరుకానున్నారు. వీరికి ఆర్టీసీ బస్సు సదుపాయం లేదు. అలాగే దేవరాపల్లి మండలంలోని 27 పంచాయతీల నుంచి మండల కేంద్రానికి వచ్చేందుకు ఒక్క బస్సు కూడా లేకపోవడం దారుణం. దీంతో పరీక్ష సమయంలో విద్యార్థులకు ఆటోలు, మోటారుసైకిళ్లే ఆధారం. కె.కోటపాడు మండలంలోని కొరువాడ విద్యార్థులు దేవరాపల్లికి వెళ్లి పరీక్ష రాయాలి. దూరం భారం వల్ల ఇబ్బందులు పడుతున్నామని..కె.కోటపాడులో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయాలని విద్యార్థులు..వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రయాణమే ప్రసహనం చోడవరం: మండలంలో చాకిపల్లి, కన్నంపాలెం, రామజోగిపాలెం, తిమ్మనపాలెం, జన్నవరం, బెన్నవోలు, పిఎస్ పేట, బంగారమ్మపాలెం, గౌరీపట్నం, లక్ష్మీపురం, దామునాపల్లి, మైచర్లపాలెం, ఖండేపల్లి గ్రామాల నుంచి పరీక్షలు రాయడానికి వచ్చే విద్యార్థులకు బస్సు సౌకర్యంలేదు. అంతేకాదు నియోజకవర్గ వ్యాప్తంగా 40పైగా గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులకు ఆర్టీసీ సేవలు అందుబాటు లేవు. ఆటోలు, ఇతర వాహనాలే గతి. బుచ్చెయ్యపేట మండలంలో నేలబార్ పరీక్షలు తప్పేలా లేవు. దిబ్బిడి పరీక్ష కేంద్రంకు ప్రహారీ సౌకర్యం లేదు. వడ్డాది హై స్కూల్దీ అదే పరిస్థితి. ఈ రెండు పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు తగిన మరుగుదొడ్లు, నీటి సదుపాయం లేవు. రావికమతం మండలంలో కొత్తకోట హైస్కూల్లో బెంచీల కొరత ఉంది. గతేడాది నేలపైనే కూర్చోబెట్టి పరీక్షలు రాయించారు. మెయిన్ స్కూల్లోనూ సమస్యలు నెలకొని ఉన్నాయి.