breaking news
rpf groups
-
మహిళకు సు‘భద్రతా’ వాహిని
సాక్షి, తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర) : రైళ్లలో మహిళా ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యతనిస్తున్నట్టు ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ డీఆర్ఎం ముకుల్ శరణ్మాథుర్ తెలిపారు. సోమవారం విశాఖపట్నం రైల్వే స్టేషన్లో రైల్వే భద్రతా దళం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మహిళా ప్రయాణికుల భద్రత కోసం ఆర్పీఎఫ్, కమర్షియల్ సిబ్బందితో ప్రత్యేక రక్షణ విభాగం ‘సుభద్ర వాహిని’ని ఆయన సోమవారం ప్రారంభించారు. సుభద్ర వాహినికి సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలను ఆయన ప్రారంభించారు. ఈ టీమ్‌లో 10 మంది ఆర్పీఎఫ్ సిబ్బంది, 10 మంది మహిళా టికెట్ తనిఖీ సిబ్బంది ఉంటారు. ఈ టీమ్‌కు ప్రత్యేక డ్రెస్‌ను కూడా ఆవిష్కరించి వారికి అందజేశారు. ఈ సందర్భంగా శరణ్మాథుర్ మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల భద్రతకు ప్రత్యేకంగా కేటాయించిన టోల్‌ఫ్రీ నంబరు 182ను ఏ సమయంలోనైనా వినియోగించి ఫిర్యాదులు అందజేయవచ్చన్నారు. రైళ్లల్లో మహిళలకు ఎదురైయ్యే సమస్యలను ఈ బృందం పరిష్కరించడంలో సహకరిస్తారన్నారు. రైళ్లలో గానీ, రైల్వేస్టేషన్లలో గానీ మహిళలకు ఇబ్బందులు ఎదురుకాకుండా వీరు పని చేస్తుంటారు. ఒకొక్కసారి పురుష భద్రతా అధికారులకు ఫిర్యాదు చేయడానికి మహిళా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, అందుకే వాల్తేరు డివిజన్లో మొట్టమొదటిసారిగా సుభద్రవాహిని టీంను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. దేశంలోనే ఇటువంటి టీంను ఏర్పాటు చేయడం ఇదే ప్రథమమని ఆయన తెలిపారు. ఈ కమిటీలో సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్(ఆర్పీఎఫ్), సీనియర్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్లు సభ్యులుగా ఉన్నారు. ఎవరైనా 182 నంబరుకు ఫిర్యాదు చేయవచ్చని, లేదా వాట్సాప్ నెంబరు 8978080777కు ఫిర్యాదు చేయవచ్చని ఆయన తెలిపారు. ఈ విధంగా అందిన ఫిర్యాదులకు వెంటనే సమీప ఆర్పీఎఫ్ సిబ్బందికి చేరవేయడం ద్వారా వారిని అప్రమత్తం చేస్తారని, తద్వారా వెంటనే తప్పు చేసిన వారిని అదుపులోకి తీసుకోవడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్పీఎఫ్ సీనియర్ డీఎస్పీ జితేంద్ర శ్రీ వాత్సవ, డివిజనల్ కమర్షియల్ మేనేజర్ అశోక్‌కుమార్, సీనియర్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చారుమతి, ఇతర విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
రైళ్లలో అనధికార విక్రేతలపై చర్యలు
ఆర్పీఎఫ్ బృందాల నియామకం విశాఖపట్నం సిటీ: రైళ్లలో అనధికార విక్రేతలపై రైల్వే పోలీసులు దృష్టి పెట్టారు. రైళ్లలోకి అక్రమంగా ప్రవేశించే అనధికార విక్రేతలను పట్టుకునేందుకు ఆర్పీఎఫ్ బృందాలను నియమించారు. ఇకపై రైళ్లలో అనధికార విక్రేతలు ఎవరు కనిపించినా ఆర్పీఎఫ్ జవాన్లదే బాధ్యతగా రైల్వే గుర్తిస్తుంది. ఆ రోజు విధుల్లో ఉన్న ఆర్పీఎఫ్ జ వాన్లపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయడంతో ఆర్పీఎఫ్ అప్రమత్తమైంది. రైల్వే స్టేషన్లు, రైళ్లలో రక్షక దళ సభ్యులు అప్రమత్తమై విక్రేతలను పట్టుకుని కేసులు బనాయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రైల్వే స్థలాల్లోకి అనుమతి లేని విక్రేతలు రావడానికి వీల్లేదు. ఆర్పీఎఫ్ పోలీసులు చేతివాటంతో రైల్వే స్టేషన్లు, రైళ్లలోకి అనధికారిక విక్రేతలు వస్తున్నారని ఇటీవల ఫిర్యాదులు వెళ్లాయి. ఇటీవల రాజమండ్రి రైల్వే స్టేషన్లో అనధికారిక విక్రేతలు ప్యాంట్రీకార్ సిబ్బందిపై భౌతిక దాడికి పాల్పడడంతో ఈ కేసు మరింత ముదిరింది. ఈ మొత్తం వ్యవహారంపై పోలీసులు ఆరా తీస్తే రాజమండ్రి స్టేషన్లో విక్రేతలకు ఎలాంటి అధికారిక గుర్తింపు లేనప్పటికీ యథేచ్ఛగా అమ్మకాలు సాగించడంతో పాటు ప్యాంట్రీకార్ సిబ్బందిని అకారణంగా గాయపరచినట్టు నిర్ధారించారు. దీంతో అనధికారిక విక్రేతలను ఏరిపారేసేందుకు ఉన్నత స్థాయిలో ఉత్తర్వులు వెలువడడంతో అందుకు తగ్గ ప్రయత్నాలు చేస్తున్నారు. విశాఖ స్టేషన్లో ఇప్పటికే అనధికార విక్రేతలు చొరబడకుండా చర్యలు తీసుకున్నారు.