breaking news
Robert Orr
-
ఇండియాది బ్రాడ్ థింక్..!
-
ఇండియాది బ్రాడ్ థింక్.. అందుకే దూసుకెళుతోంది
వాషింగ్టన్: అమెరికా ప్రజాప్రతినిధులు భారత్‌ను కలవరించారు. భారత్ ఎంతో శ్రద్ధగా ముందుకు దూసుకెళుతోందంటూ తెగ పొగిడేశారు. దేశీయంగా, అంతర్జాతీయంగా పెట్టుబడులను ఆకర్షించడంలో భారత్ ఆశ్చర్యపోయే రీతిలో ముందడుగు వేస్తోందంటూ కొనియాడారు. అమెరికా ప్రజా ప్రతినిధుల సమావేశంలో యూనివర్సిటీ ఆఫ్ మేరిలాండ్ స్కూల్‌ఆఫ్ పబ్లిక్ పాలసీకి చెందిన ప్రొఫెసర్ రాబర్ట్ ఓర్ భారత్‌కు సంబంధించి ఈ విధమైన వ్యాఖ్యలు చేయగా వారంతా ఏకీభవించారు. ‘భారత్ వివిధ రంగాల్లో శరవేగంగా శ్రద్ధగా ముందుకు కదులుతోంది. దేశానికి బంగారు భవితను అందించగల రినెవబుల్ ఎనర్జీవంటి విషయాల్లో పురోగమిస్తోంది. భారత్ బృహత్తరంగా ఆలోచన చేస్తోంది.. బృహత్తర అడుగులు వేస్తోంది’ అని ప్రొఫెసర్ రాబర్ట్ అన్నారు. ‘సౌర విద్యుత్, పవన విద్యుత్ వంటి రంగాల్లో భారత్‌కు పెద్ద పెద్ద ఆశయాలు ఉన్నాయి. వాటిని చేరుకుంటున్నారు కూడా. దీంతోపాటే దేశీయంగా, అంతర్జాతీయంగా పెట్టుబడులను ఆకర్షించడాన్ని కూడా కొనసాగిస్తున్నారు. ప్రధాని మోదీ తీసుకొచ్చిన స్మార్ట్ సిటీస్ అనే అడుగులో చాలా అంశాలు ఇమిడి ఉన్నాయి. ఇది నిజంగా ఒక వ్యూహాత్మక అడుగు. అటు వ్యాపార పరంగా, ఆర్థికాభివృద్ధి ముందుకు తీసుకెళ్లే వ్యూహం. నేడు అమెరికా మాదిరిగానే ఎన్నో అవకాశాలను భారత్ అందిస్తోంది. ఈ విషయంలో చైనాలాంటి దేశం ఉన్నప్పటికీ కూడా అంతకంటే సునాయాసంగా భారత్ ముందుకు శరవేగంగా కదులుతోంది’ అంటూ రాబర్ట్ భారత్‌ను తెగపొగిడేశారు. ఈ ప్రసంగం విన్న చట్ట ప్రతినిధులు కూడా ఆయనతో ఏకీభవించారు. రాబర్ట్ గత ఏడాది న్యూయార్క్ మాజీ మేయర్ మైఖెల్ బ్లోంబర్గ్తో కలిసి భారత్ వచ్చి పలువురు నేతలను కలిసి మాట్లాడిన విషయాలను కూడా ఆయన సభలో చెప్పారు.