breaking news
river connecting
-
నదుల అనుసంధానంతో దేశం సస్యశ్యామలం
సాక్షి, అమరావతి: నదుల అనుసంధానం ద్వారా దుర్భిక్ష పరిస్థితులకు అడ్డుకట్ట వేసి, దేశాన్ని సస్యశ్యామలం చేయవచ్చునని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ చెప్పారు. ఎక్కువ నీటి లభ్యత ఉన్న నదీ పరివాహక ప్రాంతం (బేసిన్) నుంచి తక్కువ నీటి లభ్యత ఉన్న నది బేసిన్‌కు నీటి మళ్లించడానికి బేసిన్ పరిధిలోని అన్ని రాష్ట్రాలు సహకరించాలని కోరారు. బేసిన్లు, ట్రిబ్యునళ్ల అవార్డులకు అతీతంగా నదుల అనుసంధానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) సాధారణ సమావేశం, నదుల అనుసంధానంపై జరిగిన ప్రత్యేక కమిటీ సమావేశంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. రాష్ట్రాలు సహకరిస్తే ప్రాధాన్యత క్రమంలో నదుల అనుసంధానం పనులు చేపడతామని మంత్రి వివరించారు. గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరి అనుసంధానాన్ని ప్రాధాన్యతగా చేపడతామని చెప్పారు. నీటి లభ్యతను శాస్త్రీయంగా అంచనా వేశాక.. గోదావరిలో మిగులు జలాలను దిగువ రాష్ట్రమైన ఏపీ అవసరాలు తీర్చాకనే కావేరికి తరలించాలని ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి జె. శ్యామలరావు ప్రతిపాదించారు. కావేరికి తరలించే గోదావరి జలాల్లో సింహభాగం వాటా తమకు కేటాయించాలని తెలంగాణ సర్కార్ కోరింది. అలాగే, కావేరి బేసిన్‌కు తరలించే గోదావరి జలాలకుగానూ కృష్ణా జలాల్లో అదనపు వాటా కావాలని కర్ణాటక, మహారాష్ట్ర.. కావేరి జలాల్లో అదనపు వాటా కావాలని కర్ణాటక, కేరళ కోరాయి. తొలి దశలో 84 టీఎంసీల గోదావరి జలాలనే కావేరికి తరలిస్తున్నారని.. రెండో దశలో కనీసం 126 టీఎంసీలు కేటాయించాలని తమిళనాడు సర్కార్ కోరింది. దీనిపై కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి షెకావత్ స్పందిస్తూ.. అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకునే గోదావరి–కావేరి అనుసంధానం చేపడతామని స్పష్టంచేశారు. -
కన్నీటికి ఆనకట్ట
విజయవాడ (గుణదల) : కృష్ణమ్మకు వడ్డాణంలా 1,223 మీటర్ల పొడవుతో రూపొందించిన ప్రకాశం బ్యారేజీతో కృష్ణా, గుంటూరు వాసులకు ఎడతెగని అనుబంధం ఉంది. కృష్ణానదీ జలాలను వినియోగించుకోవాలన్న ఆలోచనకు ఇది ప్రతిరూపం. బ్యారేజీ ద్వారా 10 ప్రధాన కాలువలకు నీరు అందించడంతో పాటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల్లో 13.6 లక్షల హెక్టార్ల కృష్ణాడెల్టా ఆయకట్టుకు నీరందుతోంది. 18వ శతాబ్దంలోనే ఈస్ట్ ఇండియా కంపెనీ కృష్ణానదిపై బ్యారేజీ నిర్మించాలని ప్రతిపాదించింది. 1852 నుంచి 1855 వరకూ బ్యారేజీ నిర్మాణం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో సర్ ఆర్ధర్ కాటన్ నిర్మించిన ఆనకట్టలో ఇది రెండోది కావడం విశేషం. బ్రిటీష్ ఆలోచనే కృష్ణా ఆనకట్ట 1982–33లో కృష్ణానది పరీవాహక ప్రాంతంలో కరువు తాండవించింది. డొక్కుల కరువు, నందన కరువు, గుంటూరు కరువు, పెదకరువుగా అప్పట్లో ఆయా ప్రాంతాలను బట్టీ కరువు పరిస్థితులను పిలిచేవారు. ఈ కరువు వల్ల వేలాదిమంది మరణించారు కూడా. అప్పట్లో నది పరీవాహక ప్రాంతంలోని 40 శాతం మంది ప్రజలు కరువు కారణంగానే మరణించారు. దీంతో బ్రిటీష్ ప్రభుత్వం అప్పట్లోనే ఏడాదికి రూ.2.20 కోట్ల ఆదాయం కోల్పోయింది. ఇంత తీవ్రతలోనూ కృష్ణమ్మ ఎండిపోలేదు. ఈ నేపథ్యంలో కృష్ణానదిపై కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య ఆనకట్ట నిర్మించాలని బ్రిటీష్ పాలకులు నిర్ణయించారు. ఈ ప్రతిపాదన అమల్లోకి రావడానికి బ్రిటీష్ ప్రభుత్వానికి 20 ఏళ్లు పట్టింది. బెజవాడలో ఇంద్రకీలాద్రి వద్ద ఎడమ కట్ట, సీతానగరం వద్ద కుడికట్ట మధ్య నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేశారు. సర్ ఆర్ధర్ కాటన్ చార్లెస్ అలెగ్జాండర్ పర్యవేక్షణలో 1852లో ప్రారంభమైన ప్రకాశం బ్యారేజీ నిర్మాణం 1855 మే 9వ తేదీన పూర్తయ్యింది. 11.33 మీటర్ల పొడవుతో, నాలుగు మీటర్ల ఎత్తుతో ఆనకట్ట పై నుంచి వరదనీరు ప్రవహించేలా డిజైన్ రూపిందించారు. అప్పట్లో రూ.1.49 కోట్లతో ఈ ఆనకట్ట నిర్మాణం జరిగింది. నిర్మాణం ద్వారా రెండు జిల్లాలకు 10 కాల్వల ద్వారా తాగు, సాగునీరు అందింది. వందేళ్ల వరకూ చెక్కుచెదరకుండా కృష్ణాడెల్టా రైతులకు సేవలందించిన కృష్ణా ఆనకట్ట 1952లో వచ్చిన వరదలకు కొట్టుకుపోయింది. నాలుగేళ్లలో బ్యారేజీ నిర్మాణం పాత ఆనకట్ట కొట్టుకుపోయిన వెంటనే కొత్త నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం తీర్మానించింది. పాత ఆనకట్ట నిర్మాణానికి ఎగువన నూతన నిర్మాణ పనులు చేపట్టారు. రూ.2.28 కోట్లతో 1954 ఫిబ్రవరి 13న మొదలైన బ్యారేజీ పనులు నాలుగేళ్లపాటు కొనసాగాయి. నిర్మాణం అనంతరం ఏడాది తర్వాత.. అంటే 1957 డిసెంబర్ 24న అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి బ్యారేజీని ప్రారంభించారు. అనంతరం కొద్దిరోజుల తర్వాత బ్యారేజీపై రాకపోకలు ప్రారంభమయ్యాయి. 14 అడుగుల వెడల్పుతో రోడ్డు, ఇరువైపులా 5 అడుగుల వెడల్పుతో కాలినడక దారి నిర్మించారు. 1952లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో టంగుటూరి ప్రకాశం పంతులు కృష్ణా బ్యారేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 1967లో ఆయన పేరుమీద ప్రకాశం బ్యారేజీ అని నామకరణం చేశారు.