breaking news
religious Reformation
-
ఓ తండ్రి ఆలోచన.. ఒకే ముహూర్తానికి ఆరు పెళ్లిళ్లు
ఈ హెడ్డింగ్‌కి అర్థం తెలుసుకోవాలంటే మనం కేరళకు వెళ్లాలి. అక్కడ ఒక తండ్రి తన కుమార్తెకు పెళ్లి చేయదలిచాడు. కాని పెళ్లికి అనవసర ఖర్చు వద్దనుకున్నాడు. కట్నం ఇవ్వకూడదనుకున్నాడు. ఆ డబ్బును సద్వినియోగం చేయాలనుకున్నాడు. కూతురి పెళ్లికి ఎంత డబ్బు దాచాడో ఆ మొత్తం డబ్బును అదే ముహూర్తానికి మరో ఐదు మంది అమ్మాయిల పెళ్లికి ఖర్చు చేశాడు. ఒకే ముహూర్తానికి ఆరు పెళ్ళిళ్లు జరిగాయి. ఈ ఆలోచన మనం చేయలేమా? అసలు పెళ్లికి ఖర్చు అవసరమా? పెళ్లి ఖర్చు అనే సామాజిక రుగ్మత నుంచి బయటపడలేమా? ఒక ఆలోచనాత్మక కథనం. ఇటీవల హైదరాబాద్ గోల్కొండ సమీపంలోని ఒక రిసార్ట్‌లో పెళ్లి జరిగింది. ఆ పెళ్లి ఖర్చు.. అంటే పెళ్లి జరిపేందుకు అయిన ఖర్చు 2 కోట్లు. ఈ మొత్తంలో లాంఛనాలు లేవు. ఇచ్చిపుచ్చుకున్న ఖర్చూ లేదు. కేవలం కల్యాణ మంటపానికి, భోజనానికి, అతిథి మర్యాదలకి, సంగీత్కి, అలంకరణలకి, అట్టహాసానికి అయిన ఖర్చు అది. ఆ రెండు కోట్లతో మధ్యతరగతి పెళ్లిళ్లు 20 అయినా చేయొచ్చు. పేద పెళ్ళిళ్లు 50 అయినా చేయొచ్చు. పెళ్లి ఇద్దరు స్త్రీ, పురుషులు కలిసే సంతోషకరమైన సందర్భం. దానిని సంతోషంగా చేసుకోవాల్సిందే. ఇరువురి ఆత్మీయులు హాజరవ్వాల్సిందే. కాని ఆ పెళ్లిని ఆసరా చేసుకుని తమ సంపదను, అహాన్ని, హోదాని, పలుకుబడిని నిరూపించాలనుకున్నప్పుడే పేచీ వస్తుంది. వెండి అంచు ఉన్న శుభలేఖలు, వాటితో పాటు ఇచ్చే పట్టుచీరలు, వస్తువులు, భోజనంలో ముప్పై నలభై వంటకాలు, ఖరీదైన వినోద కార్యక్రమాలు ఇవన్నీ పెళ్లి బడ్జెట్‌ను అమాంతం పెంచేస్తాయి. ఉన్నవారికి ఇదంతా తేలికే కావచ్చు. ఇమిటేట్ చేయాలనుకునే వారికి చిక్కొచ్చి పడుతుంది. ఇటీవల కేరళ లో అట్టహాసపు పెళ్ళిళ్లు, అందుకు పెళ్లికొడుకులు మారాము చేయడం, ఘనంగా చెప్పుకోవడానికి బైక్ దగ్గర కారు అడగడం, కట్నం దగ్గర ఆస్తులు అడగడం, అవి వీలు కాకపోతే భార్యను వేధించడం మామూలు అయిపోయింది. ఈ నేపథ్యంలో ఇటీవల కన్నూరులో ఒక ఆసక్తికరమైన ఘటన జరిగింది. కన్నూరు సమీపంలోని ఎడచ్చేరీకి చెందిన సలీమ్, రుబీనా జంట తమ కుమార్తె రమీజా పెళ్లిని వినూత్నంగా చేయాలనుకున్నారు. గల్ఫ్‌లో ఉద్యోగం చేసే సలీమ్ తన కుమార్తె పెళ్లికి డబ్బు దాచి పెట్టాడు. కాని దానిని కట్నంగా ఇవ్వడం, అట్టహాసపు పెళ్లికి ఖర్చు పెట్టడం వద్దనుకున్నాడు. ఎలాగైనా సరే కట్నం అడగని పెళ్లికొడుకుని వెతికి పెళ్లి చేయాలి అని నిశ్చయించుకున్నాడు. అలాంటి వరుడే దొరికాడు. దాంతో అతనికి కట్నం డబ్బు మిగిలిపోయింది. దాంతో పాటు పెళ్లి అర్భాటంగా వద్దనుకున్నాడు కాబట్టి ఆ ఖర్చూ మిగిలింది. ఆ మొత్తం డబ్బుతో ఆర్థికంగా వెనుకబడిన ఐదుగురు అమ్మాయిలను ఎంపిక చేసుకుని వారికి అబ్బాయిలను వెతికి తన కుమార్తెకు పెళ్లి జరిగిన ముహూర్తానికే వారికీ పెళ్లి జరిపించాడు. అంతే మొత్తం ఆరు పెళ్ళిళ్లు ఒకే ముహూర్తానికి జరిపించాడు. ఇందులో ఇద్దరు వధువులు హిందువులు కావడంతో వారి పెళ్లి హైందవపద్ధతిలో జరిగింది. ఈ పెళ్ళిళ్లు జరిపించడంలో సలీమ్, రుబీనా దంపతులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ ఐదుగురు అమ్మాయిలకు తగిన అబ్బాయిలను వెతికారు. అలాగే పెళ్లిలో సొంత కూతురితో పాటు మిగిలిన ఐదుగురికీ సమానంగా 10 సవరల బంగారం పెట్టారు. అందరికీ ఒకేరకమైన పట్టు చీరలు తెచ్చారు. ఇంత చక్కగా డబ్బును సద్వినియోగం చేయడం వల్ల ప్రశంసలు పొందారు. ఇందులో మతసామరస్యం కూడా ఉండటంతో పొగడ్తలు మరిన్ని వస్తున్నాయి. కాలం మారుతుంది. రెండు తీవ్రతలు కనిపిస్తున్నాయి. ఒకటి పెళ్లికి చాలా ఎక్కువగా ఖర్చు పెట్టడం...మరొకటి రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా కేవలం బొకేలు ఇచ్చి పుచ్చుకుని వియ్ ఆర్ మేరీడ్ అనుకోవడం. ఎవరి ఇష్టం వారిదే అయినా పెళ్లి ఖర్చును తగ్గించడం అనేది ఒక అవసరంగా పాటించడం ఆదర్శం అవుతుంది. ఆ ఆదర్శం అందరూ పాటించగలిగితే చాలా కుటుంబాలకు పెళ్లి భారం అనే ఆలోచన తప్పుతుంది. తద్వారా ఆడపిల్లలను కనేందుకు, ఆడపిల్లలను పెంచేందుకు జంకే పరిస్థితి పోతుంది. ‘అమ్మాయి పుడితే ఖర్చు’ అనే మాట ఇంకా ఎంత కాలం? ఆ ఖర్చు పెళ్లి వల్లే కదా? దానిని తేలిక చేయలేమా? సలీం వంటి ఆలోచనలు చేయలేమా? ఆలోచించాలి అందరం. పెళ్లి ఖర్చును తగ్గించడం అనేది ఒక అవసరంగా పాటించడం ఆదర్శం అవుతుంది. ఆ ఆదర్శాన్ని అందరూ పాటించగలిగితే చాలా కుటుంబాలకు పెళ్లి భారం అనే ఆలోచన తప్పుతుంది. -
ది కామన్ వీల్ పత్రికా స్థాపకులెవరు?
మత సంస్కరణోద్యమాలు -వాటి ప్రభావం రాజా రామ్మోహన్రాయ్ స్థాపించిన ‘బ్రహ్మసమాజం’ సాంస్కృతిక పునరుజ్జీవనానికి నాంది అయింది. దీని ప్రధాన ఉద్దేశాలు ‘ఏకేశ్వరోపాసన’ ద్వారా నిర్గుణభక్తిని పెంపొందించడం, స్త్రీ సమస్యలపై ఉద్యమించడం, ఆధునిక విద్యా విధానం కోసం పోరాడటం. రామ్మోహన్రాయ్ సామాజిక, ఆర్థిక సమస్యలపై తువ్వత్ఉల్, మువాయుద్దీన్ పత్రిక, మహానిర్వాణ్ తాంత్రిక మండలి సంస్థల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేశారు. రాజా రామ్మోహన్రాయ్ ఆధ్వర్యంలోని బ్రహ్మసమాజం సతీసహగమన నిషేధం (1829), ఆంగ్ల భాషను ప్రవేశ పెట్టడంలో (1835) కీలక పాత్ర పోషించింది. కానీ ఈయన అనంతరం నేతృత్వం వహించిన దేవేంద్రనాథ్ ఠాగూర్‌కు వ్యతిరేకంగా ‘కేశబ్ చంద్రసేన్’, అతడి అనుచరులు ఆనంద మోహన్ బోస్, ఎస్.ఎస్. చిప్లూంకర్ తిరుగుబాటు చేయడంతో బ్రహ్మసమాజం మొదటిసారిగా విభజనకు గురైంది. బ్రహ్మసమాజానికి, బ్రాహ్మణ మతానికి మధ్య ఉన్న తేడాలను నిరూపించడంలో దేవేంద్రనాథ్ ఠాగూర్ విఫలమైనందువల్ల కేశబ్ చంద్రసేన్ అతని అనుచరులు బ్రహ్మసమాజం నుంచి విడిపోయి 1866లో ‘అఖిల భారత బ్రహ్మ సమాజం’ స్థాపించారు. కేశబ్ చంద్రసేన్ అభ్యుదయ భావాలకు వ్యతిరేకంగా బాల్య వివాహాలకు పూనుకోవడం, బ్రహ్మసమాజంలో భజనలు, కీర్తనలు ప్రవేశ పెట్టడం, తనను ఒక ప్రవక్తగా ప్రకటించుకోవడం లాంటివి సహించలేని ఆనందమోహన్ బోస్, చిప్లూంకర్ 1878 లో బ్రహ్మ సమాజం నుంచి విడిపోయి సద్ధర్మ బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు. ఈవిధంగా విభజనలు చోటు చేసుకోవడం, బ్రాహ్మణ మతానికి వ్యతిరేకంగా తన ప్రత్యేకతను బ్రహ్మసమాజం నిలుపులేకపోవడం, సమాజం ఆలోచనలు కేవలం విద్యాధికులకే, పట్టణాలకే పరిమితం అవ్వడం, బ్రహ్మ సమాజం వైఫల్యానికి దారితీసిన కారణాలుగా చెప్పవచ్చు. ఆర్య సమాజం ఆర్య సమాజాన్ని 1875లో స్వామి దయానంద స్థాపించారు. ఇది సాంస్కృతిక పునరుజ్జీవనంలో ఒక భిన్న దృక్పథాన్ని అలవర్చుకుంది. బ్రహ్మసమాజాన్ని అభ్యుదయ భావాలతో ప్రారంభించారు. వేదాల సారమైన నిర్గుణోపాసన బోధించిన ఉపనిషత్తులు బ్రహ్మ సమాజానికి ఆధారం కాగా, ఆర్య సమాజం వేదాలనే ప్రమాణంగా భావించింది. సామాజిక కార్యక్రమాల్లో భాగంగా ఆర్య సమాజం వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించింది. నిమ్న జాతుల్లో విద్యావ్యాప్తికి పాటు పడింది. సమాజంలోని దురాచారాలకు పురోహిత వర్గం సంకుచిత వైఖరే కారణమని భావించింది. సంఘసేవ కోసం విద్యాలయాలు, వైద్యశాలలను విస్తృతంగా స్థాపించింది. ఆర్య సమాజం సామాజిక కార్యక్రమాల్లో అత్యంత వివాదాస్పదమైన రెండు అంశాలు న్నాయి. అవి: 1. శుద్ధి ఉద్యమం 2. గో సంరక్షణ ఉద్యమం శుద్ధి ఉద్యమంలో భాగంగా హిందూమతం నుంచి ఇతర మతాల్లోకి మారినవారిని తిరిగి హిందూమతంలోనికి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ఇందువల్ల 19వ శతాబ్దం చివరి భాగంలో పలుచోట్ల ముఖ్యంగా బాంబే, మీరట్, కాన్పూర్, లక్నో లాంటి పట్టణాల్లో హిందువులకు, క్రైస్తవులకు మధ్య మత కలహాలు చోటు చేసుకున్నాయి. అదేవిధంగా గో సంరక్షణ ఉద్యమం కూడా హిందు, ముస్లింల మధ్య మత కలహాలకు కారణమైంది. వేద సంస్కృతి ప్రాతిపదికన ప్రారంభమైన ఆర్య సమాజ ఉద్యమం క్రమంగా బలపడి, జాతీయ ఉద్యమాన్ని కూడా ఆకర్షించింది. జాతీయ ఉద్యమాన్ని ఆద్యంతం ప్రభావితం చేసిన నినాదం ‘స్వరాజ్’ను ఆర్య సమాజమే ప్రవేశపెట్టింది. స్వామీ దయానంద మరణానంతరం విద్యా మాధ్యమంపై ఆర్య సమాజంలో విభేదాలు చోటు చేసుకున్నాయి. స్వామి శ్రద్ధానంద ఆధ్వర్యంలోని గురుకుల వర్గంగా పిలిచే వర్గం సంస్కృత విద్యను మాధ్యమ భాషగా ఉండాలని భావించగా, లాలా లజపతిరాయ్, లాలా హన్సరాజ్ కళాశాల వర్గం ఆంగ్ల భాష మాధ్యమంగా ఉండాలని పట్టుబట్టింది. స్వామీ శ్రద్ధానంద నేతృత్వంలో గురుకుల వర్గం హరిద్వార్ వద్ద సంస్కృత విద్యాపీఠం నెలకొల్పింది. లాలా లజపతిరాయ్, హన్సరాజ్ వర్గం లాహోర్‌లో ఓరియంటల్ కాలేజ్‌ను స్థాపించింది. దివ్యజ్ఞాన సమాజం 1875లో రష్యన్ మహిళ అయిన మేడమ్ హెచ్.పి. బ్లావట్క్సీ, కల్నల్ ఒ.హెచ్. అల్నాట్ నేతృత్వంలో దివ్యజ్ఞాన సమాజం అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో ప్రారంభమైంది. తర్వాత దీని కేంద్ర కార్యాలయాన్ని చెన్నైలోని అడయార్‌కు మార్చారు. అనిబీసెంట్ 1916లో హోమ్‌రూల్ ఉద్యమాన్ని ప్రారంభించారు. దీంట్లో భాగంగా గ్రంథాలయ ఉద్యమాలు కూడా బాగా ప్రాచుర్యం పొందాయి. హోమ్‌రూల్ భావాలను ప్రచారం చేయడానికి అనిబీసెంట్ ది కామన్ వీల్, న్యూ ఇండియా అనే పత్రికలు స్థాపించారు. ఉద్యమంలో భాగంగా అనిబీసెంట్ మదనపల్లిలో జాతీయ కళాశాలను, వారణాసిలో సంస్కృత విద్యాపీఠాన్ని స్థాపించారు. రామకృష్ణ మఠం 19వ శతాబ్దం నాటి సాంస్కృతిక పునరుజ్జీవనంలో ఒక విశిష్టమైన సంస్థగా రామకృష్ణమఠం ఆవిర్భవించింది. రామకృష్ణ పరమహంస మతాలకు అతీతమైన విశ్వజనీన భావాలకు ప్రాధాన్యమిచ్చారు. పరమహంస భావాలను ప్రచారం చేయడం కోసం 1887లో స్వామి వివేకానంద బేలూరులో రామకృష్ణ మఠాన్ని స్థాపించారు. మఠానికి అనుబంధంగా సామాజిక సేవా సంస్థగా 1897లో రామకృష్ణ మిషన్ కూడా ఏర్పాటు చేశారు. మతాలకతీతమైన విశ్వజనీన దృక్పథాన్ని పెంపొందించడంలోనూ, సామాజిక సేవను అందించడంలోనూ ఇప్పటికీ రామకృష్ణమఠం తన ప్రత్యేకతను నిలుపుకుంటూనే ఉంది. బ్రహ్మసమాజంలో భాగంగా ఆత్మారాం పాండురంగ స్థాపించిన ప్రార్థనా సమాజం బాంబే ప్రెసిడెన్సీలో సంస్కరణోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించింది. స్త్రీ జనోద్ధరణ, వితంతు పునర్ వివాహాలు, నిమ్న కులాల్లో విద్యావ్యాప్తి లాంటి ఉత్తమ ఆశయాలకు ప్రార్థనా సమాజం ప్రేరణ అయింది. శివదయాల్ (తులసీరామ్) ఆగ్రాలో 1861లో ‘రాధాస్వామి సత్సంగ్’ను స్థాపించారు. 1887 లో లాహోర్‌లో శివనారాయణ అగ్నిహోత్రి ‘దేవసమాజాన్ని’, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ 1864 లో సైంటిఫిక్ సొసైటీ, 1863లో గాజీపూర్‌లో విక్టోరియా స్కూల్‌ను, థియోడార్బిక్ ప్రిన్సిపాల్‌గా మహ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాలను ప్రారంభించారు. పార్సీల్లో దాదాబాయి నౌరోజీ వయోజన విద్య కోసం ‘జ్ఞాన ప్రసారక మండలి’ సంస్థను ప్రారంభించారు. మాదిరి ప్రశ్నలు 1. కిందివాటిలో సరికానిది ఏది? 1) దాదాబాయి నౌరోజీ: ‘ది పావర్టీ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా’ 2) దయానంద సరస్వతి: సత్యార్థ ప్రకాశిక 3) బంకించంద్ర చటర్జీ: దేవికారాణి 4) స్వామి వివేకానంద: లైఫ్ డివైన్ సమాధానం: 4 వివరణ: స్వామి వివేకా జ్ఞానమార్గ, కర్మమార్గ, రాజమార్గ గ్రంథాలనే కాకుండా, ఉద్బోధన (బెంగాల్), ప్రబుద్ధ భారత్ (ఆంగ్లంలో) పత్రికలు ప్రారంభించారు. ‘డివైన్ లైఫ్’ను స్వామి వివేకానంద, లైఫ్ డివైన్’ను అరబిందో ఘోష్ రచించారు. 2. 1863లో మహ్మదరన్ లిటరరీ సొసైటీని స్థాపించింది ఎవరు? 1) నవాబ్ అబ్దుల్ లతీఫ్ 2) సయ్యద్ అమీన్ అలీ 3) షరియతుల్లా 4) ముక్తార్ అహ్మద్ అన్సారీ సమాధానం: 1 వివరణ: కలకత్తాలో అబ్దుల్ లతీఫ్ ఈ సంస్థను ప్రారంభించారు. ముస్లింలలో ఆధునిక భావాలు, విద్యా విషయాల్లో నూతన ఆలోచనల కోసం ఈ సంస్థను ప్రారంభించారు. 3. పుణేలో ‘పరమహంస సభ’ను స్థాపించిందెవరు? 1) బాలశాస్త్రి 2) మహాదేవ గోవిందరనకడే 3) గణేష్ వాసుదేవ్ జోషి 4) దారోగా పాండురంగ సమాధానం: 4 వివరణ: పాండురంగ 1840లో పరమహంస మండలి సంస్థను పుణేలో ప్రారంభించారు. ధర్మ వివేచన అనే రచన చేసి, 1849లో ఉద్యమం ప్రారంభించారు. 4. రాజా రామ్మోహన్రాయ్ వేటి కోసం పోరాడారు? ఎ) సతీసహగమన నిషేధం బి) ఆధునిక విద్య సి) వితంతు పునర్వివాహం డి) స్త్రీ విద్య 1) ఎ, బి మాత్రమే 2) ఎ,బి,సి మాత్రమే 3) ఎ, సి మాత్రమే 4) అన్నీ సమాధానం: 1 5. ‘దేవి చౌదరిరాణి’ గ్రంథ రచయిత ఎవరు? 1) అరబిందో గోష్ 2) బంకించంద్ర చటర్జీ 3) శివనారాయణ అగ్నిహోత్రి 4) శివదయాల్ సమాధానం: 2 6. ‘మేఘనాథ్ బంద్ కావ్యం’ రచించింది? 1) మధుసూదన్ దత్ 2) దీనబందు మిత్ర 3) బంకించంద్ర 4) రవీంద్రనాథ్ ఠాగూర్ సమాధానం: 1 7. ఇండియన్ బ్రహ్మసమాజ్‌ను కేశబ్ చంద్రసేన్, సాధారణ బ్రహ్మ సమాజ్ ఆనంద్ మోహన్ బోస్, ఆది బ్రహ్మసమాజ్ దేవేంద్రనాథ్ స్థాపించారు. అయితే ‘దక్షిణ భారత బ్రహ్మ సమాజ్’ను స్థాపించిందెవరు? 1) చిప్లూంకర్ 2) శ్రీధర్‌లు నాయుడు 3) వీరేశలింగం పంతులు 4) జ్యోతిబా పూలే సమాధానం: 2 వివరణ: చిప్లూంకర్, ఆనంద్ మోహన్ బోస్ సాధారణ బ్రహ్మసమాజం, శ్రీధర్‌లు నాయుడు దక్షిణ భారత బ్రహ్మసమాజం లేదా ‘వేదసమాజం’ను స్థాపించారు. వీరేశలింగం పంతులు 1905లో హితకారిణి సమాజాన్ని, జ్యోతిబా పూలే ‘సత్యశోధక్’ సమాజాన్ని స్థాపించారు.