breaking news
Reliance Towers
-
‘టవర్స్’ ప్రతిపాదనలు మార్చండి
- రిలయన్స్ ఇన్ఫ్రా ప్రతినిధులకు కేటీఆర్ సూచన - పెనాల్టీ మాఫీ తదితర అంశాలపై త్వరలో స్పష్టత - 2017 డిసెంబర్ నాటికి ఓఆర్ఆర్ వెలుపలకు పరిశ్రమలు - సూక్ష్మ, లఘు, మధ్య తరహా పరిశ్రమలపై సుదీర్ఘ సమీక్ష సాక్షి, హైదరాబాద్ : వంద అంతస్తుల ఆకాశ హర్మ్యం ‘రిలయన్స్ టవర్స్’ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. అయితే ఎనిమిదేళ్ల క్రితం రూపొందించిన ఆ ప్రతిపాదనల్లో మార్పుచేర్పులు చేయాల్సిందిగా కాంట్రాక్టు సంస్థ అయిన రిలయన్స్ ఇన్ఫ్రాకు సూచించారు. పరిశ్రమల శాఖకు సంబంధించిన పలు కీలకాంశాలపై ఆయన శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు పూర్తిస్థాయి ప్రతిపాదనలతో రావాల్సిందిగా సంస్థ ప్రతినిధులను కోరారు. టీఎస్ఐఐసీ భాగస్వామ్యంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు కోసం తామిప్పటికే రూ.150 కోట్లు చెల్లించామన్న రిలయన్స్ ఇన్ఫ్రా, తమ నిధులు ఏళ్ల తరబడి ప్రభుత్వ ఖాతాలో వున్నందున పెనాల్టీని మాఫీ చేయాలని కోరినట్టు సమాచారం. ప్రాజెక్టు కాలపరిమితికి సంబంధించి తుది షెడ్యూలును రూపొందించాల్సిందిగా మంత్రి సూచించినట్టు తెలిసింది. కాగా, కాలుష్యకారక కంపెనీలను 2017 డిసెంబర్‌లోగా ఔటర్ రింగ్ రోడ్డు వెలుపలికి తరలిస్తామని కేటీఆర్ వెల్లడించారు. రాజధానివాసుల జీవితాల్లో నాణ్యత పెంచే లక్ష్యంతో తొలి దశలో 1,068 కాలుష్య కారక పరిశ్రమలను తరలిస్తామన్నారు. ఇది సవాలుతో కూడిందే అయినా పరిశ్రమలకు ప్రోత్సాహకాలివ్వడం, నూతన పరిశ్రమలను జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేయడం ద్వారా సమస్యను అధిగమిస్తామన్నారు. కొత్తగా వచ్చే పరిశ్రమల్లో జీరో లిక్విడ్ డిశ్చార్జి వంటి విధానాలతో జల, వాయు కాలుష్యాలను తగ్గించవచ్చన్నారు. ల్యాండ్ కన్వర్షన్, పన్ను రాయితీలు, పరిశ్రమల ఆవరణలో గృహాలకు అనుమతి తదితరాలపై సూత్రప్రాయ అంగీకారానికి వచ్చారు. ప్రభుత్వ భూముల్లో ఒకే రంగానికి చెందిన పరిశ్రమలను ఒకే క్లస్టర్లో ఏర్పాటు చేసేలా హెచ్ఎండీఏ వంటి సంస్థలతో కలసి పని చేయాల్సిందిగా టీఎస్ఐఐసీకి మంత్రి సూచిం చారు. హైదరాబాద్‌లోని రసాయన, ఫార్మా కంపెనీలను ఫార్మా సిటీకి తరలిస్తామన్నారు. ఎంఎస్ఎంఈలకు ఆస్తి పన్నులో స్పెషల్ కేటగిరీ సూక్ష్మ, లఘు, మధ్య తరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)ల సమస్యలపై తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య అధ్యక్షుడు సుధీర్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధుల బృందంతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఆస్తి పన్ను వసూలులో ఎంఎస్ఎంఈలను ప్రత్యేక కేటగిరీగా పరిగణించే అంశంపై పరిశ్రమల శాఖ కమిషనర్ అధ్యక్షతన కమిటీ వేస్తామన్నారు. హైదరాబాద్ పరిసరాల్లోని 18 పారిశ్రామికవాడల్లోని కార్మికుల కుటుంబాలు వినియోగించే మంచినీటి కుళాయిలను కమర్షియల్ కేటగిరీగా పరిగణిస్తూ కిలో లీటరుకు రూ.120 చొప్పున వసూలు చేస్తున్నారని సుధీర్‌రెడ్డి చెప్పారు. దాన్ని రూ.60కి తగ్గించాలని కోరారు. సమాఖ్య సభ్యుల్లో పరిశ్రమల స్థాపనకు ముందుకొస్తున్న 438 మందికి ఏడాదిన్నర కాలపరిమితితో ఉత్పత్తి ప్రారంభించే షరతుపై భూమి కేటాయిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఓఆర్ఆర్ వెలుపలకు తర లేందుకు సిద్ధంగా వున్న పరిశ్రమలకు కన్వర్షన్ చార్జీలు మాఫీ చేయడంతో పాటు మౌలిక సౌకర్యాలు కల్పించాలని, ప్రభుత్వం చెల్లించాల్సిన రాయితీలు ఆలస్యమైతే బ్యాంకర్ల నుంచి బ్రిడ్జి లోన్లు ఇప్పించాలని సమాఖ్య కోరగా సానుకూలంగా స్పందించారు. చిన్న పరిశ్రమల ఉత్పత్తులు కొనుగోలు ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం మూలంగా మూత పడిన చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకోవాలని చిన్న, మధ్య తరహా పరిశ్రమల సమాఖ్య (ఎఫ్‌ఎస్‌ఎంఈ) జాతీయ అధ్యక్షుడు ఏపీకే రెడ్డి మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. టీఎస్‌ఐపాస్‌లో నూతన పరిశ్రమలకు ఇస్తున్నట్టే మూసివేత దిశలో వున్న పరిశ్రమల పునరుద్ధరణకూ రాయితీలిచ్చేందుకు కేటీఆర్ సుముఖత వ్యక్తం చేశారు. సీజనల్ పరిశ్రమలపై విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించే దిశగా యూనిట్వారీ బిల్లింగ్ విధానానికీ సానుకూలంగా స్పందించారు. తమిళనాడు తరహాలో చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఉత్పత్తులను కొనుగోలు చేయాలని తక్షణం ఆదేశాలిచ్చారు. సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ తెరపైకి రిలయన్స్ టవర్స్
- ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై నేడు సమీక్షించనున్న కేటీఆర్ - వైఎస్సార్ హయాంలో ‘రిలయన్స్ టవర్స్’కు ఒప్పందాలు - రూ.7 వేల కోట్లతో వంద అంతస్తుల వాణిజ్య భవనం నిర్మాణానికి ప్రతిపాదనలు - ఆర్థిక మాంద్యం, రాష్ట్ర విభజనతో నిలిచిపోయిన ప్రాజెక్టు సాక్షి, హైదరాబాద్: బుర్జ్ దుబాయ్, పెట్రొనాస్ టవర్ల తరహాలో రాష్ట్రంలో నిర్మించతలపెట్టిన వంద అంతస్తుల ఆకాశహర్మ్యం ‘రిలయన్స్ టవర్స్’ ప్రాజెక్టు మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రపంచ ఆర్థిక మాంద్యం, రాష్ట్ర విభజన నేపథ్యంలో నిలిచిపోయిన ఈ ప్రాజెక్టును తిరిగి చేపట్టడంపై పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె.తారక రామారావు శనివారం కీలక సమీక్ష నిర్వహించనున్నారు. ఈ ప్రాజెక్టును తిరిగి గాడిన పెట్టేందుకు కాంట్రాక్టు సంస్థ రిలయన్స్ ఇన్ఫ్రా కోరుతున్న పలు ‘మాఫీల’పై అందులో చర్చించనున్నారు. వైఎస్ హయాంలో ప్రతిపాదన 2007లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం రూ.7 వేల కోట్ల అంచనాతో ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను రిలయన్స్ ఇన్ఫ్రాకు అప్పగించింది. వంద అంతస్తుల్లో, 20 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే వాణిజ్య భవనం కోసం రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో 76.2 ఎకరాలను కేటాయించింది. ప్రాజెక్టులో పర్యవేక్షణ సంస్థ టీఎస్ఐఐసీకి 11 శాతం, రిలయన్స్ ఇన్ఫ్రాకు 66 శాతం, సాంకేతిక భాగస్వామి శోభా డెవలపర్స్‌కు 23 శాతం వాటాలున్నాయి. తన వంతు వాటాగా రిలయన్స్ ఇన్ఫ్రా రూ.527 కోట్ల పెట్టుబడికి అంగీకరించగా.. డిబెంచర్లు, నగదు రూపంలో సుమారు సగం మొత్తాన్ని చెల్లించింది కూడా. అయితే ఆర్థిక మాంద్యం, రాష్ట్ర విభజన తదితర పరిణామాలతో ప్రతిపాదిత ప్రాజెక్టు నిలిచిపోయింది. ప్రస్తుతం బ్రాండ్ హైదరాబాద్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టును తిరిగి చేపట్టేందుకు రిలయన్స్ ఇన్ఫ్రా ఆసక్తి చూపుతోంది. అయితే తన వంతు వాటాలో కొంత పెట్టుబడితో పాటు, పెనాల్టీ మాఫీ చేయాలని ఆ సంస్థ ఇన్ఫ్రా కోరుతోంది. మరోవైపు కన్సల్టెన్నీ సంస్థ ఎర్నెస్ట్ యంగ్ ఇచ్చిన ప్రాజెక్టు రీస్ట్రక్చరింగ్ ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శనివారం కేటీఆర్ నిర్వహిస్తున్న సమీక్ష కీలకం కానుంది. ఓఆర్ఆర్ వెలుపలకు పరిశ్రమలు హైదరాబాద్ నగరం లోపలా, శివార్లలో ఉన్న పరిశ్రమలను ఔటర్ రింగు రోడ్డు వెలుపలకు తరలించే అంశంపైనా శనివారం భేటీలో కేటీఆర్ సమీక్షించనున్నారు. హైదరాబాద్‌లోని 14 పారిశ్రామికవాడల్లో సుమారు పదివేలకుపైగా చిన్నా, పెద్దా పరిశ్రమలున్నాయి. వాటి చుట్టూ ప్రస్తుతం జనావాసాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు వెలుపలకు తరలించాలని నిర్ణయించారు. దీనిపై శ నివారం జరిగే సమావేశంలో కాల పరిమితిని విధించనున్నట్లు సమాచారం.