breaking news
Reduced yields
-
నీలి రంగుతో రక్తపోటు తగ్గుముఖం!
ఒంట్లో బీపీ ఎంతకూ తగ్గడం లేదా? అయితే రోజూ కాసేపు నీలి రంగు కాంతిలో సేద తీరండి అంటున్నారు బ్రిటన్‌లోని సర్రే యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. ఈ విషయాన్ని తాము కొంతమందిపై ప్రయోగం చేసి మరీ కనుక్కున్నామని చెబుతున్నారు వీరు. రోజూ అరగంట సేపు నీలి రంగు కాంతిలో.. ఆ మరుసటి రోజు వేరే రంగు కాంతిలో ఉండేలా చేశామని.. మూడు దశలలో వీరి బీపీని పరిశీలించినప్పుడు నీలి రంగు కాంతిలో ఉన్నప్పుడు సిస్టోలిక్ రక్తపోటు 8 మిమీ హెచ్‌జీ వరకూ తగ్గిందనీ, ఇది మందులేసుకుంటే తగ్గేంత మోతాదులో ఉండటం గమనార్హమనీ అంటున్నారు ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త క్రిస్టియన్ హైజ్! అంతేకాకుండా ఈ నీలి రంగు కాంతి... ధమనుల పెళుసుదనాన్ని తగ్గించడమే కాకుండా రక్తంలోని నైట్రిక్ ఆసిడ్ మోతాదును పెంచిందని వివరించారు. నైట్రిక్ యాసిడ్ మోతాదు ఎక్కువగా ఉంటే గుండె ఆరోగ్యంగా ఉంటుందన్నది తెలిసిందే. నీలి రంగు కాంతి కారణంగా చర్మంలో నైట్రిక్ యాసిడ్ ఉత్పత్తి జరిగి రక్తంలో కలిసిందని, ఫలితంగా రక్తపోటు తగ్గిందని ఆయన వివరించారు. దాదాపు 450 నానోమీటర్ల పౌనఃపున్యమున్న నీలిరంగును ప్రయోగాల్లో వాడామని, ఇంతేస్థాయి వెలుతురు ప్రసారం చేసే గాడ్జెట్లను సిద్ధం చేసి వాడితే బీపీని నియంత్రించడం వీలవుతుందని చెప్పారు. -
తెల్లబోతున్న తెల్లబంగారం
చేవెళ్ల: పత్తి రైతు పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి పెట్టుబడులు కూడా వెనక్కి వచ్చే పరిస్థితి కనబడటం లేదు. తగ్గిన దిగుబడులకు తోడు ధరలు కూడా లేకపోవడంతో రైతన్న తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వర్షాభావ పరిస్థితులతో ఎకరానికి కనీసం మూడు నుంచి నాలుగు క్వింటాళ్లకు మించి దిగుబడి రాకపోవడంతో రైతన్న ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. మరోవైపు పత్తి ధర కూడా విపరీతంగా తగ్గిపోవడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు. చేవెళ్ల డివిజన్లో ప్రధానపంట పత్తి గత మూడు దశాబ్దాలుగా చేవెళ్ల వ్యవసాయ డివిజన్ ప్రాంతంలో ఖరీఫ్‌లో పత్తిని ప్రధాన పంటగా పండిస్తున్నారు. వ్యవసాయ డివిజన్ పరిధిలోని చేవెళ్ల, షాబాద్, శంకర్పల్లి, మొయినాబాద్‌లతోపాటు పరిగి నియోజకవర్గంలోని కొన్నింటిని కలుపుకొని మొత్తం పది మండలాల్లో ఖరీఫ్‌లో భారీ విస్తీర్ణంలో పత్తిని సాగుచేస్తున్నారు. ఈ సంవత్సరం ఖరీఫ్‌లో చేవెళ్ల మండలంలో 4200 హెక్టార్లు, షాబాద్ మండలంలో 6750 హెక్టార్లు, శంకర్పల్లి మండలంలో 3120 హెక్టార్లు, మొయినాబాద్ మండలంలో 870 హెక్టార్లలో పత్తి పంటను సాగుచేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో పత్తి దిగుబడి దారుణంగా పడిపోయింది. దిగుబడి తగ్గితే.. ధరలూ తగ్గాయ్ ఎకరా పత్తి సాగుకు రూ. 6 వేల నుంచి రూ. 8 వేలకు ఖర్చుఅవుతుంది. వర్షాలు సమృద్ధిగా కురిస్తే ఎకరానికి పది క్వింటాళ్లనుంచి 12 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. కానీ ఈసారి వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో దిగుబడి ఎకరానికి మూడు నుంచి నాలుగు క్వింటాళ్లకు మించి వచ్చే సూచనలు కనిపించడంలేదు. దిగుబడులు తగ్గినప్పటికీ పత్తి ధరలు పెరగకపోవగా ఇంకా తగ్గడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. గతేడాది ప్రభుత్వ కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర క్వింటాలుకు రూ. 4000గా నిర్ణయించారు. అయితే ఈసారి గతేడాది కంటే కూడా కేవలం రూ. 50 పెంచి మద్దతు ధరను రూ. 4050గా నిర్ణయించారు. అదే సమయంలో గతేడాది బహిరంగ మార్కెట్లో పత్తి క్వింటాలు ధర రూ. 4500 నుంచి ప్రారంభమై సీజన్ చివరి నాటికి రూ. 6వేలకుపైగా పలికింది. దీంతో రైతులు అధికశాతం చివరిదశలో బహిరంగమార్కెట్లో పత్తిని విక్రయించి లాభాలనార్జించారు. కానీ ప్రస్తుతం మాత్రం బహిరంగ మార్కెట్లో పత్తి ధర రూ. 3900 మించి పలకడం లేదు. దిగుబడులు తగ్గినా ధరలు పెరగకపోవడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఈఏడాది విత్తనాలు, ఎరువులు, కూలీలు, రవాణా ఖర్చు భారీగా పెరిగడం విశేషం. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ధరలతో తాము పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి రాదని రైతులు ఆందోళన చెందుతున్నారు.