breaking news
Reduced demand
-
గుడ్డుకు గడ్డు కాలం.. రోజుకు రూ.1.05 కోట్లు నష్టం
మండపేట(తూర్పుగోదావరి): పౌష్టికాహారాన్ని అందించే గుడ్డు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇతర రాష్ట్రాల నుంచి ఎదురవుతున్న పోటీతో జిల్లా ఎగుమతులకు డిమాండ్ లేక రైతు ధర పతనమవుతోంది. కోడి మేత ధరలు పెరిగిపోగా, గుడ్డు ధర గిట్టుబాటు కాక పౌల్ట్రీ పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోతోంది. గుడ్డు ధర రూపంలో జిల్లాలోని పరిశ్రమకు రోజుకు దాదాపు రూ.1.05 కోట్ల నష్టం వాటిల్లుతున్నట్టు అంచనా. మరోపక్క ముదురుతున్న ఎండలు కోళ్ల రైతులకు గుబులు పుట్టిస్తున్నాయి. జిల్లాలో సుమారు 200 పౌల్ట్రీ ఫాంలు ఉండగా వీటిలో గుడ్లు పెట్టే కోళ్లు దాదాపు 1.4 కోట్లు వరకు ఉన్నాయి. రోజుకు సుమారు 1.10 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. చదవండి: AP: మతుకువారిపల్లె రైతుభరోసా కేంద్రానికి ఐఎస్ఓ గుర్తింపు ఎగుమతులే పౌల్ట్రీకి ప్రధాన వనరుగా ఉన్నాయి. 60 శాతం గుడ్లు పశ్చిమ బెంగాల్, ఒడిశా, బిహార్, అస్సాం తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. మిగిలినవి స్థానికంగా వినియోగమవుతున్నాయి. గత కొన్నేళ్లుగా పశి్చమ బెంగాల్, ఒడిశా, బిహార్ తదితర రాష్ట్రాల్లో పౌల్ట్రీ పరిశ్రమ విస్తరించడం జిల్లా ఎగుమతులపై ప్రభావం చూపుతోంది. అక్కడి పౌల్ట్రీల నుంచి ఎదురవుతున్న పోటీతో అయిన కాడికి అమ్ముకోవాల్సిన దుస్థితిలో కోళ్ల రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని అక్కడి ట్రేడర్లు గుడ్డు ధరను మరింత తగ్గించేస్తున్నారు. నెక్ ప్రకటిత ధర కంటే తక్కువకు కొనుగోళ్లు చేస్తున్నారు. పౌల్ట్రీకి సీజన్‌గా భావించే శీతాకాలంలోనూ రైతు ధర ఈ ఏడాది రూ.5 దాటకపోవడం పౌల్ట్రీ దుస్థితికి అద్దం పడుతోంది. చుక్కల్లో మేత ధరలు కోడి మేతకు వినియోగించే మేతల ధరలు చుక్కల్లో చేరాయి. రెండు నెలల క్రితం రూ.38గా ఉన్న సోయా రూ.110కి చేరుకోగా, జీఎన్ కేకు రూ.35 నుంచి రూ. 110కి, మొక్కజొన్న రూ.14 నుంచి రూ. 25కు, డీఓబీ రూ.9 నుంచి రూ.18కి, ఎండు చేప రూ.30 నుంచి రూ.60కి, నూకలు రూ.13 నుంచి రూ.20కి పెరిగిపోయాయి. గుడ్డు రైతు ధర పతనమవుతుండగా పౌల్ట్రీల నిర్వహణ వ్యయం పెరిగిపోవడం పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టేస్తుందని కోళ్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గుడ్డు ఉత్పత్తికి దాదాపు రూ.4.75 వ్యయమవుతుండగా నెక్ ప్రకటిత రైతు ధర రూ.3.79 మాత్రమే. ఈ మేరకు రోజుకు రూ.1.05 కోట్ల నష్టం వాటిల్లుతున్నట్టు అంచనా. వేసవి మొదలు కావడంతో ఇప్పటికే సాధారణ స్థాయికి మించి కోళ్ల మరణాలు సంభవిస్తుండగా, గుడ్ల ఉత్పత్తి తగ్గనుంది. ఎండలు ముదిరేకొద్ది గుడ్డు రైతు ధర, కోళ్ల మరణాల రూపంలో నష్టాలు పెరిగి కోళ్ల పరిశ్రమ మరింత సంక్షోభంలో కూరుకుపోతుందని పౌల్ట్రీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సీఎం జగన్ దృష్టికి పౌల్ట్రీ సమస్యలు పౌల్ట్రీ సమస్యలపై ఇటీవల అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, రాష్ట్ర పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షుడు కేవీ ముకుందరెడ్డి, అసోసియేషన్ ప్రతినిధులు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి, ఆదుకొనేందుకు రుణాలపై 4 శాతం వడ్డీ రాయితీ ఇవ్వాలని, సబ్సిడీపై మేతలు అందజేయాలని, విద్యుత్‌లో రాయితీ ఇవ్వాలని, ఇతర సదుపాయలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం సానుకూల స్పందన పౌల్ట్రీ పరిశ్రమను ఆదుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డితో కలిసి సీఎం జగన్‌ను కోరగా ఆయన వెంటనే సానుకూలంగా స్పందించారు. సమస్యపై నివేదికను అందజేయాలని సీఎం కార్యదర్శి ధనుంజయరెడ్డిని ఆదేశించారు. సమస్యలపై చర్చించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేశారు. – కేవీ ముకుందరెడ్డి, రాష్ట్ర పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షుడు, కొమరిపాలెం. సంక్షోభంలో కూరుకుపోతోంది మేత ధరలు పెరిగిపోవడం, గుడ్డు ధర గిట్టుబాటవక కోళ్ల పరిశ్రమ సంక్షోభంలో ఉంది. ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న సీఎం జగన్, ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. – పడాల సుబ్బారెడ్డి, నెక్ జాతీయ కమిటీ సభ్యులు, పౌల్ట్రీ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అర్తమూరు -
పత్తి ధర చిత్తు
ఖమ్మం వ్యవసాయం: పత్తి ధర పతనమవుతోంది. 20 రోజుల క్రితం రూ. 5 వేల వరకు పలికిన రేటు క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం క్వింటాల్ పత్తి రూ.3,000 నుంచి రూ. 4,000 వరకు మాత్రమే పలుకుతోంది. పంట సీజన్ కానప్పటికీ ధర పడిపోవటం చర్చనీయాంశంగా మారింది. సరుకు తక్కువగా అమ్మకానికి వచ్చే సమయంలో ధర బాగుటుందని భావించి రైతులు నిల్వ ఉంచిన పత్తిని అమ్మకానికి తెస్తున్నారు. పంటలకు పెట్టుబడిగా కూడా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నారు. కొత్త పత్తి అక్టోబర్ నెలలో వచ్చే అవకాశం ఉండటంతో నిల్వ ఉంచిన పాత పత్తిని అమ్మకానికి తెస్తున్నారు. ఇక్కడి పత్తిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ర్ట, గుజరాత్ రాష్ట్రాల్లోని జిన్నింగ్ మిల్లుల యజమానులు, వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. జిన్నింగ్ మిల్లుల్లో పత్తిని బేళ్లుగా తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. విదేశాల్లో పత్తికి అంతగా డిమాండ్ లేకపోవటంతో ధర పతనమవుతోందని వ్యాపారులు చెబుతున్నారు. కొత్త పత్తి వచ్చే సీజన్ దగ్గరలోనే ఉండటంతో జిన్నింగ్ మిల్లుల యజమానులు సరుకు కొనుగోలుకు అంతగా ఆసక్తి చూపటం లేదని అంటున్నారు. క్వింటాల్‌కు రూ.1500 వరకు తగ్గింపు.. 20 రోజుల క్రితం క్వింటాల్ పత్తి రూ.4,900 వరకు పలికింది. రోజుకు కొంత చొప్పున తగ్గుతూ వచ్చింది. సోమవారం జెండా పాట రూ.4,400 పలికింది. అయితే వ్యాపారులు ఆ రేటు పెట్టలేదు. జెండాపాటకు ఖరీదుదారులు ముందుకు రాలేదు. మార్కెట్ అధికారులు వ్యాపారులను పిలిపించి జెండాపాట నిర్వహించారు. సరకుకు డిమాండ్ లేదని, ధర పెట్టలేమని వ్యాపారులు అధికారులకు చెప్పారు. రూ.4,400 జెండాపాట పలుకగా మార్కెట్లో రైతులు తెచ్చిన సరకులో అధికభాగానికి రూ.3 వేల నుంచి రూ.3,500 వరకే ధర పెట్టారు. బాగా నాణ్యంగా ఉన్న కొంత సరుకుకు రూ.4 వేల వరకు ధర పడింది. సోమవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు దాదాపు 10 వేల బస్తాల పత్తి అమ్మకానికి వచ్చింది. అన్‌సీజన్‌లో ధర అధికంగా ఉంటుందని పంటను తెస్తే తీరా ఇక్కడికి వచ్చాక ఈ పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.