breaking news
ravula chandrashekarreddy
-
‘పని కంటే ప్రగల్భాలకే ప్రాధాన్యమిస్తున్నారు’
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలుకుని కిందిస్థాయి నాయకుల వరకూ... చేసే పని కంటే ప్రగల్భాలు, ప్రచారానికే అధిక ప్రాధాన్యతనిస్తున్నారని తెలంగాణ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి విమర్శించారు. లంచం అడిగిన వారిని చెప్పులో కొట్టమని మంత్రి కేటీఆర్ చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని ఆయన బుధవారమిక్కడ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ వారే అనుసంధానంగా వ్యవహరిస్తున్నట్లు, ఉద్యోగాల కోసం సీఎంఓలోని వ్యక్తులకు రూ.40 లక్షలు ఇచ్చినట్లు సతీష్‌రెడ్డి అనే వ్యక్తి చెప్పడం, ఈ అవినీతికి సంబంధించి పత్రికల్లో వార్తలొచ్చాయని గుర్తుచేశారు. ఏ చిన్నపని కావాలన్నా డబ్బులు లేనిదే కావడం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారని, గొంగట్లో తింటూ వెంట్రుకలు ఉన్నాయన్నట్లుగా టీఆర్ఎస్ నాయకుల మాటలున్నాయన్నారు. మిషన్‌కాకతీయలో అవినీతి జరగకపోతే ఎందుకు అంతమంది అధికారులు సస్పెండ్ అయ్యారో చెప్పాలన్నారు.సబ్ కాంట్రాక్ట్‌లు ఎవరి చేతుల్లో ఉన్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. మిషన్ కాకతీయలో మట్టి అమ్ముకోవడంపై, ఇసుక దోపిడిపై విచారణ జరిపించగలరా అని ప్రశ్నించారు. -
'కేటీఆర్, హరీష్‌లది ఫిరాయింపుల యజ్ఞం'
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా అపవిత్ర రాజకీయ యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగుతోందని టీ టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్, అల్లుడు హరీష్‌రావు ఫిరాయింపుల యజ్ఞం చేస్తున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో ప్రతిపక్షాలు లేకుండా చేయాలని టీఆర్ఎస్ నేతలు చూస్తున్నారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేయడానికి వచ్చిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులను పోలింగ్ బూత్‌ల నుంచి ఎత్తుకుపోయి బెదిరించి ఓట్లు వేయించుకున్నారని ఆరోపించారు. ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా ఎవరు అడ్డుకుంటున్నారో ప్రజలకు తెలియాల్సి ఉందన్నారు. రైతుల ఆత్మహత్యల విషయంలో ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో 782 మంది రైతులు చనిపోయారని, అందులో 342 మంది రైతులవి మాత్రమే ఆత్మహత్యలని ప్రభుత్వం పేర్కొనడం సరికాదన్నారు. రైతుల ఆత్మహత్యలు నిరోధించేందుకు ప్రభుత్వం వద్ద సరైన విధానం లేదని తెలిపారు. గత ఏడాది జూన్ నుంచి ఇప్పటివరకు 2132 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారని, వీరందరికీ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌ను ఉప సంహరించుకోవాలని రావుల డిమాండ్ చేశారు.