ముంచుకొస్తున్న తాగునీటి గండం
రాయచూరుకు తప్పని తాగునీటి ఎద్దడి
రాయచూరు రూరల్ : రాయచూరు పట్టణానికి తాగునీటిని అందిస్తామని ప్రగల్భాలు పలికిన నగరసభ అధికార యంత్రాంగానికి మరో 10 రోజుల్లో నీటి గండం ఎదురు కానుంది. పట్టణ జనాభా సుమారు 4 లక్షలు ఉంది. ప్రస్తుతం రాయచూరులో తాగునీటి ఎద్దడి నెలకొనకుండా నగర సభ అధ్యక్షుడు, తాగునీటి సరఫరా మండలి ఉపాధ్యక్షుడు జయణ్ణలు చర్యలు తీసుకుంటున్నా, పట్టణానికి నీరందించే రాంపూర్, గణేకల్ రిజర్వాయర్లలో ఉన్న నీరు మరికొన్ని రోజుల్లో ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. రాంపూర్ జలాశయంలో ప్రస్తుతం 12 అడుగుల మేర నీటి నిల్వ ఉంది.
రాంపూర్ రిజర్వాయర్ నుంచి రాయచూరు ప్రధాన నీటి పంపింగ్‌కు 5 కి.మి.ల దూరంలో వుంది. 12 అడుగుల నీరు ఈ నెలాఖరు వరకూ సరఫరా చేసేందుకు సరిపోతాయి. ఆ తర్వాత పట్టణ ప్రజలను నీటిని ఎలా అందించాలనే ప్రశ్న నెల కొంది. ఈ విషయంలో తాగునీటి ఎద్దడి నెలకొనకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లాధికారి ప్రకటిస్తున్నారు. 95వ మైలు వద్ద గణేకల్ రిజర్వాయర్ వుండటం వల్ల అక్కడి నుంచి రాంపూర్ జలాశయానికి నీటిని కాలువల గుండా విడవటానికి దాదాపు 22 కి.మి.ల దూరంలో ఉంది. ఏదేమైనా రాంపూర్ జలాశయంలో నీరు ఖాళీ కాక మునుపే గణేకల్ రిజర్వాయర్ నుంచి రాంపూర్ రిజర్వాయర్‌కు నీటిని నింపేందుకు చర్యలు చేపట్టాల్సి వుంది.