రాముని గుణగణాలను అలవరచుకుందాం!
మానవాళి సంక్షేమం కోసం సహజయోగాన్ని ఆవిష్కరించిన పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి దేశ విదేశాలలో ఇచ్చిన అనేక ప్రవచనాలలో శ్రీ రాముని గుణ గణాలను, లక్షణాలను, ఆయన వ్యక్తిత్వం నుండి మనం నేర్చుకుని, వాటిని మనలో అంతర్గతంగా స్థిరపరచుకొని వ్యక్తీకరించుకోవలసిన అవశ్యకతను గురించి విశదీకరించారు.శ్రీరాముడు పుడమిపై అవతరించినప్పుడు విశ్వ విరాట్‌లో కుడిపార్శ్వం అభివృద్ధి చెందడానికి దోహద పడింది. తేత్రాయుగంలో రాక్షసుల నుండి, దుష్ట శక్తుల బారి నుండి తన భక్తులను, ప్రజలను సంరక్షించడానికి శ్రీ విష్ణువు తీసుకున్న అవతారమే శ్రీ రాముడు. ఆ కాలంలోనే రాజుల రాజ్యాధిపత్యం మొదలయ్యి అన్నిటికన్నా మిన్నగా ప్రజాభీష్టానికి ప్రాధాన్యత ఇవ్వడం ్ర΄ారంభమయ్యింది. ప్రజల కొరకు, మానవాళి యొక్క అభివృద్ధి కొరకు రాజు మంచితనాన్ని, ప్రేమ తత్వాన్ని కలిగి వుండాలని నిర్ణయించబడింది. నాయకుడైన రాజు ఎంత త్యాగం చేయడానికైనా సిద్దపడాలి. అది శ్రీరామునితోనే మొదలయ్యింది. నేటి సమస్త ప్రజానీకం కోరుకున్న ఋజు ప్రవర్తన, మంచితనం శ్రీ రామునిగా అవతరించాయి. ప్రభువు అనే వాడు శ్రీ రామునిగా వుండాలని కోరుకున్నారు. మంచితనం గురించి, రాజ ధర్మం గురించి కేవలం చెప్పడమే కాదు, దానిని ఆచరించి చూపించిన ఆదర్శవంతమైన రాజు. శ్రీ రాముడు అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఒక ఆదర్శవంతమైన తండ్రిగా, ఆదర్శవంతమైన భర్తగా, ఆదర్శవంతమైన కొడుకుగా, ఆదర్శవంతమైన రాజుగా, మర్యాద పురుషోత్తముడుగా ఇతిహాసంలో చెప్పుకోబడుతున్నాడు.అగస్త్య మహాముని రచించిన శ్రీ రామ రక్షా కవచంలో శ్రీ రాముని గుణగణాల గురించి ఇలా వర్ణించడం జరిగింది.ఆయన ఆజానుబాహుడు. చేతులలో ధనుర్బాణాలు ధరించి, పీతాంబరధారుడై సింహాసనంపై ఆసీనుడై వుంటాడు. ఆయన పద్మదళాయతాక్షుడు. తన ఎడమ పార్శ్వమున కూర్చున్నసీతాదేవిని చూస్తూమందస్మిత వదనార విందుడై మనకు కనిపిస్తాడు. అతని యొక్క మేని రంగు లేత నీలిరంగు ఛాయతోనూ, నేత్రములు తామర పుష్ప రేకులవలే పెద్దవిగా వుండి, ఇతరులకు ఆనందమును చేకూరుస్తుంటాయి. ఒక చేతిలో ఖడ్గం, మరొక చేతిలో విల్లు, వీపున అంబుల పొదితో దుష్ట సంహారం కొరకు సదా సన్నద్ధుడై ఉంటాడు.ఆయన జనన మరణాలకు అతీతుడు. అపార శక్తిమంతుడు. దుష్ట శక్తులన్నిటిని నాశనపరచి, మన కోరికలన్నిటినీ నెరవేర్చే సామర్ధ్యం కలవాడు శ్రీ రాముడు. తానొక అవతార పురుషుడునని గానీ, అవతార మూర్తినని గానీ ఎక్కడా ప్రకటించుకోలేదు. శ్రీ రాముని సుగుణాలలో మరొకటి ఏమిటంటే తను ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం. ఆ లక్షణాన్ని మనలో కూడా స్థిరపరచు కోవాలి. ఇచ్చిన మాట తప్పించుకోవడానికి ఏవేవో కుంటిసాకులు వెతికి తప్పించుకోకూడదు. ఆయనకున్న మరో సుగుణం – అవతలివారి హృదయాన్ని నొప్పించే విధంగా మాట్లాడక ΄ోవడం. దీనినే సంకోచమని అంటారు. మానవ అంతర్గత సూక్ష్మ శరీరంలో అంగాంగమునందు, చక్రాలలోనూ, నాడులలోనూ దేవీదేవతలు కొలువై వున్నారు. కుండలినీ జాగృతి ద్వారా ఆత్మ సాక్షాత్కారం పొందినప్పుడు వారిని, వారి లక్షణాలను మనలో జాగృతి పరచుకోవచ్చును. అలా సీతా సమేతుడైన శ్రీరాముడు మన హృదయంలోని కుడి పార్శ్వం వైపు ఆసీనులై వుంటాడు. ఆత్మ సాక్షాత్కారం పొంది సహజయోగ సాధన చేస్తున్న వారిలో మర్యాద పురుషోత్తమునిగా, ఆదర్శవంతమైన తండ్రిగా, శ్రీరాముని లక్షణాలు జాగృతి చెంది ప్రతిబింబిస్తూ వుంటాయి. ఆయన మనలోని ఊపిరి తిత్తులను పరిరక్షిస్తూ వుంటాడు. ఎవరితో ఎప్పుడు, ఎలా సంభాషించాలో మనం ఆయన దగ్గరనుండి నేర్చుకోవాలి. తన పరిమితులు, హద్దులు, శ్రీ రామునికి బాగా తెలుసు. వాటిని ఆయన ఎప్పుడూ అతిక్రమించలేదు. దేశాన్ని పరిపాలించే పరిపాలకుడు ఎలా వుండాలనేది రామరాజ్యం నుండే నేర్చుకుంటారు.మర్యాద పురుషోత్తముడైన శ్రీ రాముని శ్రీ రామ నవమి పర్వదినాన బాహ్య పరంగా పూజించుకోవడమే కాకుండా అతని గుణగణాలను, వ్యక్తిత్వాన్ని సహజ యోగ సాధన ద్వారా మనలో పొందు పరచుకుని అభివ్యక్తీరించుకోవటం అవసరం. – డా. పి. రాకేష్(పరమపూజ్య మాతాజీ శ్రీ నిర్మలాదేవి ప్రవచనాల ఆధారంగా)