ఎమ్మెల్యే రాసలీలలు వైరల్.. ‘అది నేను కాదు’
మోరిగావ్: అసోంలో ఓ బీజేపీ ఎమ్మెల్యేకు కొత్త చిక్కులొచ్చి పడ్డాయి. అతడికి సంబంధించిన లైంగిక చేష్టల వీడియో ఒకటి ఇప్పుడు అసోం అంతటా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీంతో ఇప్పుడు ఆ రాష్ట్ర అధిష్టానం అతడిపై గుర్రుగా ఉంది. కానీ, ఆ వీడియోలో ఉంది తాను కాదని, తానే అని రుజువు చేస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించాడు. వివరాల్లోకి వెళితే.. బీజేపీకి చెందిన రమాకాంత ద్యూరీ అనే మోరిగావ్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నాడు.
అతడు ఓ మహిళతో ఒక హోటల్లో లైంగిక కార్యకలాపాల్లో ఉన్నట్లుగా, ఆమెను కాంప్రమైజ్ చేస్తున్నట్లుగా ఉన్న వీడియో ఒకటి శనివారం బయటకు వచ్చి సోషల్ మీడియాలో ధుమారం రేపింది. దీనిపై బీజేపీ కన్నెర్రజేసింది. అయితే, నేరుగా దీనిపై ఎలాంటి స్పందన మాత్రం తెలియజేయలేదు.
అయితే, అసలు ఆ వీడియోలో ఉంది తాను కాదని, త్వరలో మంత్రి వర్గ విస్తరణ ఉన్న నేపథ్యంలో తనకు ఎక్కడ మంత్రి పదవి ఇస్తారోనని, పార్టీలో తనంటే గిట్టని వారే ఈ చర్యకు పాల్పడ్డారని, ఫొరెన్సిక్ నివేదిక తానే అని చెబితే కచ్చితంగా తన పదవికి రాజీనామా చేయడంతోపాటు పూర్తిగా రాజకీయాల్లో నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు.