breaking news
Raj Mohan Gandhi
-
శత్రుత్వం కన్నా మిత్రత్వం మిన్న..
శత్రుత్వాన్ని శాశ్వతీకరించడం చాలా సులభం. సరిహద్దుకు ఇరువైపులా ఉన్న పక్షాలకు యుద్ధాలు రాజకీయ ప్రయోజనాలను తీసుకురావచ్చు కానీ ఆర్థిక, భౌగోళిక, చారిత్రక సత్యాలు ఎంతో విలువైనవి. చైనా జాతి చైతన్యంలో శతాబ్దాలుగా భారత్ ఒక భాగమై ఉంటూ వస్తోంది. చరిత్ర, హిమాలయన్ అనుసంధానం రీత్యా భారత్, చైనా ప్రజల మధ్య శత్రుత్వం శాశ్వతంగా ఉంటుందన్న అభిప్రాయాలు నేడు తిరస్కరణకు గురవుతున్నాయి. పైగా, భౌగోళిక రాజకీయాలు, పాలకుల పేరాశలు, సరిహద్దు వివాదాలు వంటివాటిని కఠిన వాస్తవాల ప్రాతిపదికన నిశితంగా విశ్లేషించాల్సి ఉంది. అతిపెద్ద పొరుగుదేశాల్లోని దాదాపు 300 కోట్ల మంది ప్రజల మధ్య సంబంధాలను కొద్దిమంది నేతలకు, వారి సలహాదార్లకు విడిచిపెట్టడం ప్రశ్నించాల్సిన విషయమే. చైనా ప్రెసిడెంట్ షి జిన్‌పింగ్ ఇటీవల టిబెట్ లోని నింగ్చి మెయిన్లింగ్ విమానాశ్రయంలో దిగి, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకు సమీపంలోని లాసాకు బుల్లెట్ ట్రెయిన్లో ప్రయాణించడం రెండు అంశాలపై ఆసక్తి కలిగించింది. ఒకటి, పాక్షికంగా పూర్తిచేసిన ప్రమాదకరమైన 1,629 కిలోమీటర్ల రైల్ ప్రాజెక్టు. ఇది చైనాలో అతిపెద్ద ఇన్నర్ సిటీ అయిన చెంగ్డును పశ్చిమాన ఉన్న లాసాతో అనుసంధానిస్తుంది. ఈ మార్గంలోని చాలా భాగం అతిపెళుసైన, ఎల్తైన, భూకంపాలు చెలరేగే, పర్యావరణపరంగా ప్రమాదకరమైన భూభాగంనుంచి వెళుతుంది. ఈ ప్రాజెక్టులో తొలి భాగమైన చెంగ్డు నుంచి యాన్ మార్గం దాదాపుగా పూర్తయింది. నింగ్చి నుంచి లాసా మార్గం కూడా పూర్తయింది. అయితే యాన్ నుంచి నింగ్చి మార్గంలోనే అత్యంత పొడవైన మధ్య భాగం నిర్మాణం పూర్తి కావడానికి మరొక పదేళ్ల సమయం పట్టవచ్చు. రెండోది, దక్షిణ టిబెట్‌కి షీ జిన్‌పింగ్ యాత్ర... భారత్‌తో సరి హద్దు ఘర్షణకు చైనా జాతీయ ఎజెండాలో ఆయన అత్యంత కీలక స్థానం ఇస్తున్నట్లు సూచించింది. టిబెట్ పరిణామాలను అధ్యయనం చేస్తున్న బ్రిటిష్ స్కాలర్ రాబర్ట్ బర్నెట్ దీన్నే నొక్కి చెబుతున్నారు. చైనా ప్రభుత్వ మీడియా ఇప్పుడు భారత్‌కు ప్రాధాన్యమివ్వడం ద్వారా బర్నెట్ అంచనా మరోసారి నిజమైంది. 1980లలో రాజీవ్‌గాంధీ నుంచి 2014లో నరేంద్ర మోదీ వరకు భారత ప్రధానుల హయాంలో భారత్ సైనిక సామగ్రి పరంగా సాధించిన విజయాలను విస్తృతంగా గుర్తిస్తూ చైనా మీడియా ఇప్పుడు స్పందిస్తోంది. భారత్, చైనా మధ్య శత్రుత్వం కొనసాగే అవకాశముందని, ఘర్షణలకు సన్నద్ధమయ్యే ఆవశ్యకత కూడా ఉంటుందని వాస్తవికవాదులు తప్పక గుర్తించాల్సి ఉంది. అదేసమయంలో పవిత్రమైన హిమాలయాలను ఒక భారీ శ్మశాన వాటికగా మార్చిన ఆ విషాద ఉన్మాదాన్ని, యుద్ధం అనే ప్రమాదకరమైన ప్రయోగం ద్వారా హిమాలయా పర్వతాలకు, నదులకు నష్టం కలిగించే పర్యవసానాలను కూడా వీరు మనసులో ఉంచుకోవాల్సి ఉంది. శత్రుత్వాన్ని శాశ్వతీకరించడం చాలా సులభం. సరిహద్దుకు ఇరువైపులా ఉన్న పక్షాలకు యుద్ధాలు రాజ కీయ ప్రయోజనాలను తీసుకురావచ్చు కానీ ఆర్థిక, భౌగోళిక, చారి త్రక సత్యాలను లెక్కించడం కూడా విలువైనదేనని చెప్పాలి. చైనా జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ (జీఏసీ) అంచనా ప్రకారం లద్దాఖ్ ఘర్షణలు చెలరేగిన 2020 సంవత్సరం నాటికి భారత్, చైనా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 87.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. గత సంవత్సరంలో ఇది 5.6 శాతానికి పడిపోయింది. చైనా నుంచి భారత్‌కు దిగుమతులు 66.7 శాతంగా నమోదయ్యాయి. 2016 నుంచి చూస్తే ఇది అతితక్కువ శాతం అన్నమాట. దాదాపు 10.8 శాతం పతనమైందన్నమాట. కానీ చైనాకు భారత్ ఎగుమతులు 2020లో 16 శాతం పెరిగి 20.86 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందాయి. వీటిలో ఇనుప ఖనిజం ఎగుమతులు అత్యధికంగా పెరిగాయి. భారత వాణిజ్య లోటు అయిదేళ్ల స్వల్పానికి అంటే 45.8 శాతానికి పడిపోయింది. కానీ ఈ సంవత్సరం ఇరుదేశాల మధ్య వాణిజ్యంలో మళ్లీ పెరుగుదల కనిపించింది. చైనా ప్రభుత్వ పత్రిక ‘గ్లోబల్ టైమ్స్ చైనా’ జీఏసీ నివేదికనుంచి పేర్కొన్నట్లుగా గత సంవత్సరంలో డాలర్ల రూపంలో పోలిస్తే, భారత్‌తో చైనా వాణిజ్యం 2021 జనవరి నుంచి జూన్ నెలలో 62.7 శాతానికి పెరిగింది. అంటే చైనా–భారత్ వాణిజ్యం వృద్ధి మొత్తం చైనా వాణిజ్యంలో రెండో స్థానం ఆక్రమించింది. దక్షిణా ఫ్రికా తొలి స్థానంలో ఉంది. కోవిడ్–19 మహమ్మారిని ఎదుర్కొనేం దుకు అవసరమైన చైనా సరఫరాలు భారత్‌కు దిగుమతి కావడం బాగా పెరగడం దీంట్లో భాగమేనని చెప్పాలి. మరీ ముఖ్యంగా 2020 సంవత్సరంలో చైనా విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో 23 వేలమంది భారతీయ విద్యార్థులు విభిన్న కోర్సులలో చేరి అధ్యయనం సాగించారు. వీరిలో 21 వేలమంది డాక్టర్లు అయ్యేందుకు తమ పేర్లు నమోదు చేసుకోవడం విశేషం. 2021లో కూడా ఈ సంఖ్య మారలేదు. పైగా, చైనాలోని భారత్ లేక బహుళ జాతి సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్న బారతీయుల సంఖ్య కూడా తక్కువగా లేదు. చైనాలో మొత్తం 36 వేలమందికి పైగా భారతీయులు పనిచేస్తున్నారని అంచనా. ఈ సంఖ్య తక్కువేమీ కాదు. ఎర్రచైనా పెట్టుబడిదారీ విధానాన్ని పరిధికి మించి అధికంగా అనుమతించినట్లయితే, మతపరమైన, తాత్వికపరమైన విశ్వాసాలకు సంబంధించిన వాస్తవాలను కూడా అది ఆమోదిస్తున్నట్లు కనిపిస్తోంది. కన్ఫ్యూసియనిజంను గౌరవించి, చైనా ప్రభుత్వం స్వీకరించగా, మావో కాలంలో బౌద్ధమతం పట్ల సర్వసాధారణంగా అవలంబించిన సైద్ధాంతిక అవహేళనను నేటి చైనాలో అనుసరిస్తున్న సూచనలు లేవు. ఇప్పుడు టిబెట్‌లోనే కాకుండా చైనాలో ప్రతి చోటా బుద్ధిజం చొచ్చుకుపోయిందని పలువురు భారతీయులు గుర్తించడంలేదు. సంఖ్యలకు ప్రాధాన్యం ఉందంటే, చైనాలో పెరుగుతున్న లక్షలాది బౌద్ధమతానుయాయులు భారత్‌లో కంటే ఎక్కువ సంఖ్యలో ఉండి ప్రభావం చూపగలరన్నది వాస్తవం. బౌద్ధమత గ్రంథాలను పొందడం కోసం శతాబ్దాల క్రితం అత్యంత కష్టభూయిష్టమైన ప్రయాణాలు సాగించి భారత్‌కు చేరుకున్న చైనా పండితులు... అదృశ్యమయ్యే అవకాశమున్న భారతీయ చరిత్రను తమ రచనల్లో నమోదు చేశారు. ఇలాంటి పండితుల్లో సుప్రసిద్ధుడైన హుయాన్‌త్సాంగ్ భారతదేశంలో అత్యంత గౌరవం పొందాడు. చైనాలో అత్యంత జనాదరణ పొందిన 16వ శతాబ్దం నాటి చారిత్రక గాథ ‘గ్జియుజి లేదా పశ్చిమానికి పయనం’ అనే కథ... హుయాన్‌త్సాంగ్ 7వ శతాబ్దిలో భారత్‌కి సాగించిన తీర్థయాత్రను అత్యంత ఉత్కంఠతో, సరదాతో కూడిన సాహస యాత్రకు కాల్పనిక రూపమిచ్చిందని బహుశా చాలామంది భారతీయులకు తెలీకపోవచ్చు. 2015లో మరణించిన ఆంథోనీ సి. యు అనే అమెరికన్ పండితుడు ‘ఎ జర్నీ టు ది వెస్ట్’ అనే ఈ పుస్తకానికి చేసిన నాలుగు సంపుటాల అనువాదం ఇంగ్లిష్ అనువాదాల్లో అత్యుత్తమ రచనగా నిలిచిపోయింది. బుద్ధుడికి, జర్నీ టు ది వెస్ట్ గ్రంథానికి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే చైనా జాతి చైతన్యంలో శతాబ్దాలుగా భారత్ ఒక భాగమై ఉంటూ వస్తోంది. ఈ చరిత్ర రీత్యా, హిమాలయన్ వారధి రీత్యా భారత ప్రజలు, చైనా ప్రజల మధ్య శత్రుత్వం శాశ్వతంగా ఉంటుందన్న అభిప్రాయాలు ఇప్పుడు తిరస్కరణకు గురవుతున్నాయి. మరోవైపున భౌగోళిక రాజకీయాలు, పాలకుల పేరాశలు, సరిహద్దు వివాదాలు వంటి వాటిని కఠిన వాస్తవాల ప్రాతిపదికన నిశితంగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కాలమిస్టులకు అందుబాటులో ఉండవు. కాబట్టి వీటి నుంచి విశాల దృష్టితో కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఒకటి, అతిపెద్ద పొరుగు దేశాల్లోని దాదాపు 300 కోట్ల ప్రజల మధ్య సంబంధాలను కొద్దిమంది నాయకులకు, వారి సలహాదార్లకు విడిచిపెట్టడం అన్నది ఆలోచించదగిన కీలక విషయం. రెండు.. అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియాతో కూడిన క్వాడ్ కూటమిలో కొన్ని ఉపయోగకరమైన అంశాలు కూడా ఉండవచ్చు. ఎందుకంటే, ఒకటి అమెరికా నేతృత్వంలో, మరొకటి చైనా నేతృత్వంలో ఉండే రెండు శిబిరాల మధ్య ఆసియా, ప్రపంచ ప్రజలను విడదీసే ప్రయత్నాలు చెడు ఫలితాలను ఇవ్వవచ్చు. కాబూల్ ప్రభుత్వం తెలుసుకున్నట్లుగా అగ్రరాజ్యాలు శాశ్వతమైన రక్షణ ఛత్రాలను అందించవు. అందుకే, క్వాడ్ కూటమి కంటే ఎక్కువగా, భారతీయ స్వతంత్ర పౌరుల స్వేచ్ఛ, రాజకీయ నేతలను ఓటు వేసి సాగనంపే భారత పౌరుల సామర్థ్యం అనేవి చైనా ప్రజలకు అత్యంత ప్రభావం కలిగించే సందేశాన్ని ఇస్తాయి. చైనా ప్రజలు ఈర‡్ష్య పడేవిధంగా, భారత్‌లో ఉన్న మనం మన నేతలను పరిహాసం చేయవచ్చు, అవహేళన చేయవచ్చు లేదా ఇంటికి సాగనంపవచ్చు కూడా. మనం ఈ ప్రయోజనాన్ని కూడా కోల్పోయామంటే ఇక ఆట ముగిసినట్లే. -రాజ్‌మోహన్ గాంధీ వ్యాసకర్త ప్రస్తుతం ఇలినాయ్ యూనివర్సిటీలో బోధకుడుగా ఉన్నారు -
గుర్తుకొస్తున్నాడా! అబ్దుల్ గఫర్ ఖాన్....
సాక్షి, న్యూఢిల్లీ : ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్.... ఈ పేరును ఎప్పుడో, ఎక్కడో విన్నట్టుగా ఉందే అని ఎక్కువ మందికి అనిపించవచ్చు. సరిహద్దు గాంధీ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ అంటే ‘అవును గదా!’ అని కొద్ది మందికి గుర్తుకు రావచ్చు. పాకిస్థాన్‌లోని పంఖ్తూన్ రాష్ట్రంలో పంఖ్తూన్ లేదా పఠాన్‌గా పుట్టి జాతిపిత మహాత్మా గాంధీ నిర్దేశించిన అహింసా మార్గంలో అడుగులు వేసి బ్రిటీష్ పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన స్వాతంత్య్ర సమరయోధుడు మన సరిహద్దు గాంధీ. ఆయుధం పట్టుకొని యుద్ధం చేసే పఠాన్ కన్నా అహింసా మార్గమే ఆయుధంగా ధరించిన పఠాన్ యమ డేంజర్ అని బ్రిటీష్ పాలకులతో అనిపించుకున్న ధీరోదాత్తుడు. ‘నేను ఎట్టి పరిస్థితుల్లో అహింసామార్గాన్ని వీడను. పగ, ప్రతీకారం జోలికి వెళ్లను. నన్ను అణచివేసిన, హింసించిన వ్యక్తులను కూడా క్షమిస్తాను’ అన్న ప్రతిజ్ఞతతో ‘కుదాయ్ కిద్మత్ గర్’ పేరిట భారత స్వాతంత్య్ర పోరాటానికి స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసిన శాంతికాముకుడు సరిహద్దు గాంధీ. భారత్, పాకిస్థాన్ విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన సరిహద్దు గాంధీ విభజన సందర్భంగా పంఖ్తూన్ రాష్ట్రంలో చెలరేగిన అల్లర్లలో ముస్లింల దాడుల నుంచి ఎంతో మంది హిందువులు, సిక్కుల మాన ప్రాణాలను కాపాడారు. ఈ విషయంలో ఆయనకు కుదాయ్ కిద్మత్ గర్ సేన కూడా ఎంతో సహాయపడింది. అల్లర్లను ఆపేందుకు ఆయన మహాత్మాగాంధీతో కలసి బీహార్‌కు వెళ్లి బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. భారత్‌ను తగులబెడితే హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవులు అందరం దగ్ధం అవుతామని హెచ్చరించారు. అల్లర్లు, హింసతో ఏమీ సాధించలేమని, అలా సాధించుకున్నది శాశ్వతంగా నిలబడదని కూడా ఆయన ప్రజలకు హితవుచెప్పారు. శాంతి, సౌభ్రాతృత్వాలతో సంపాదించకున్నది శాశ్వతంగా మిగిలిపోతుందని పిలుపునిచ్చారు. ఇటు బ్రిటీష్ ఇండియాలో, అటూ పాకిస్థాన్‌లో 27 ఏళ్లపాటు జైలు జీవితాన్ని అనుభవించిన సరిహద్దు గాంధీ అఫ్గానిస్థాన్‌లోని కాబూల్ నగరానికి వెళ్లి ప్రవాస జీవితం గడిపారు. తుది శ్వాస విడిచేంత వరకు నమ్ముకున్న సిద్ధాంతానికే కట్టుబడి జీవించిన గఫర్ ఖాన్ కన్నుమూసి నేటికి సరిగ్గా 30 ఏళ్లు. పాకిస్థాన్‌లోని పెషావర్‌లో 1988, జనవరి 20వ తేదీన ఆయన మరణించారు. మహాత్మా గాంధీ పిలుపు మేరకు 1930లో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొనేందుకు ఆయన ఉట్మంజాయ్ నుంచి పెషావర్ వెళుతుండగా అరెస్ట్ చేశారు. ఇది తెలిసి కుదాయ్ కిద్మత్ గర్ సేన సహా లక్షలాది ప్రజలు పోలీసు స్టేషన్‌ను, పరిసరాలను చుట్టుముట్టారు. వారిపై కాల్పులు జరపాల్సిందిగా బ్రిటీష్ అధికారులు ఉత్తర్వులిచ్చినా ‘కాల్పులు జరిపినా ఫర్వాలేదు. ప్రాణాలిస్తాం.’ అంటూ శాంతియుత నినాదాలతో సమన్వయం పాటించిన ప్రజలపై కాల్పులు జరిపేందుకు సైనికులు నిరాకరించారట. అదే సమయంలో అరెస్టయిన మహాత్మాగాంధీని, ఇతరులను 1931, జనవరి నెలలో విడుదల చేసిన బ్రిటిష్ పాలకులు ఖాన్‌ను విడుదల చేయలేదు. చివరకు ఆయన్ని గాంధీయే విడిపించారు. అప్పటికి విడిచిపెట్టిన బ్రిటీష్ అధికారులు ఆయన్ని మళీ అరెస్ట్ చేసి నాలుగేళ్ల పాటు జైల్లో పెట్టారు. ఆ రోజుల్లో కుదాయ్ కిద్మత్ గర్‌కు ప్రజల్లో ఎంత ఆదరణ ఉండేదంటే, 1946లో జరిగిన ప్రావిన్షియల్ ఎన్నికల్లో కాంగ్రెస్ బ్యానర్ కింద పోటీ చేసిన కిద్మత్ గర్ సేనకు 30 సీట్లు రాగా, ముస్లిం లీగ్‌కు కేవలం 17 సీట్లు వచ్చాయి. అంతకుముందు ఒక్క సీటును కూడా దక్కించుకోని ముస్లిం లీగ్ పాకిస్థాన్ విభజన తీర్మానం ద్వారా ఆ మాత్రం సీట్లను దక్కించుకుంది. మొదటి నుంచి దేశ విభజనను వ్యతిరేకిస్తూ వచ్చిన ఖాన్ చివరకు నిర్ణయాన్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకే వదిలేశారు. ఆ సమావేశం అత్యధిక మెజారిటీతో దేశ విభజన తీర్మానాన్ని ఆమోదించింది. ఆ సమావేశంలో గఫర్ ఖాన్‌తో పాటు మహాత్మాగాంధీ, రామ్ మనోహర్ లోహియా, జయప్రకాష్ నారాయణ్‌లు పాల్గొనలేదు. ‘మీకు అండగా నిలబడ్డాం. మీతో పాటు పఠాన్లు దేశ స్వాతంత్య్రం కోసం ఎన్నో త్యాగాలు చేశారు. చివరకు మీరు మమ్మల్ని నక్కల పాలు చేశారు’ అని సీడబ్ల్యూసీను ఉద్దేశించి ఖాన్ వ్యాఖ్యానించారట. ‘పాక్‌లో ఉంటారా, భారత్‌లో ఉంటారా? అని తేల్చుకోమన్నారనే గానీ స్వతంత్య్ర భారతదేశంలో ఉంటారా? అంటూ మాకు మరో ఆప్షన్ ఇవ్వలేదు’ అని ఖాన్ తన బాధను వ్యక్తం చేస్తూ దేశ విభజన అనంతరం పెషావర్‌కే పరిమితం అయ్యారు. అక్కడి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడి జైలు పాలయ్యారు. 1960వ దశకంలో జైలు నుంచి విడుదలయ్యాక అఫ్ఘాన్‌కు ప్రవాసం వెళ్లారు. 1969లో మహాత్మాగాంధీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా గఫర్ ఖాన్ భారత్‌కు వచ్చారు. ఆయనకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. అదే సమయంలో అహ్మదాబాద్‌తోపాటు దేశంలోని పలు చోట్ల హిందూ, ముస్లింల మధ్య అల్లర్లు చెలరేగాయి. ఆయన సరాసరి అహ్మదాబాద్ వెళ్లి అక్కడ అల్లర్లను ఆపేందుకు మూడు రోజులపాటు నిరాహార దీక్ష చేశారు. అల్లర్ల అనంతరం హిందూ ప్రాంతాల్లో, హిందువులు, ముస్లిం ప్రాంతాల్లో ముస్లింలు సహాయక చర్యల్లో పాల్గొనడం చూసి ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆ తర్వాత ఢిల్లీకి వచ్చి అంతర్జాతీయ అవగాహన కింద ఇచ్చే ‘జవహర్ లాల్ నెహ్రూ అవార్డు’ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ ఈ దేశంలో ఉండాలంటే అంటరాని వారిగా అణగిమణగి ఉండండి లేదా పాకిస్థాన్ వెళ్లిపోండంటూ బెదిరిస్తున్నారని ఓ ముస్లిం బాలిక చెప్పడం బాధేసింది’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత ఆయన పార్లమెంట్ సంయుక్త సమావేశంలో మాట్లాడుతూ ‘మీరు బుద్ధుడిని మరచిపోయినట్లుగానే గాంధీని మరచిపోతున్నారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వారితో పాటు మరచిపోతున్న మన సరిహద్దు గాంధీని కూడా గుర్తు చేద్దామనే ఈ వార్తా కథనం. (గమనిక: ‘గఫర్ ఖాన్: నాన్ వాయలెంట్ బాద్షా ఆఫ్ పంఖ్తూన్’ పేరిట రాజ్‌మోహన్ గాంధీ రాసిన పుస్తకంలో అంశాల ఆధారంగా ఈ వార్తా కథనం)