breaking news
Raghavasharma
-
సాంస్కృతిక విప్లవ సేనాని త్రిపురనేని
త్రిపురనేని మధుసూదనరావు విమర్శ చాలా పదునుగా ఉంటుంది. వ్యాసమైనా, ఉపన్యాసమైనా ముక్కుకు సూటిగా పోతుంది. ఎదురుగా వస్తే అడ్డంగా నరికేసేటట్టు ఉంటుంది. పక్కనొచ్చినా చాలు. సమాజాన్ని, సాహిత్యాన్ని గతితార్కిక చారిత్రక భౌతికవాద తాత్విక దృష్టితో అధ్యయనం చేసి, పరిశీలించి విమర్శిం చారు. త్రిపురనేని మధుసూదనరావు సాహిత్య సర్వస్వం’ మూడు సంపుటాలుగా విప్లవ రచయితల సంఘం అచ్చేసింది. ఈ సంపుటాలను ఆదివారం (అక్టోబరు 28) ఉదయం తిరుపతిలో ఆవిష్కరించనున్నారు. త్రిపురనేని భాష, శైలి, తాత్విక నిబద్ధతతో నిక్కచ్చిగా ఉంటాయి. ఆయన భావాలు తన తరాన్నే కాకుండా, తరువాతి తరాన్ని కూడా ప్రభావితం చేసేవిధంగా ఉంటాయి. సాహిత్యంలో యుగవిభజనను కాలక్రమపద్ధతిని బట్టో, కవుల్ని బట్టో, రాజవంశాలను బట్టో, ప్రక్రియలను బట్టో చేయడం అశాస్త్రీయం. చరిత్ర పరిణామానికి ఏ శక్తులు, ఏ ఆలోచనలు దారి తీశాయో, వాటి వ్యవస్థ ఆధారంగానే సాహిత్య పరి ణామం ఉంటుందని త్రిపురనేని విశ్లేషించారు. మౌఖిక సాహిత్యం నుంచి, లిఖిత, పురాణ, ప్రబంధ, భావవాద, అభ్యుదయ, ప్రజా విప్లవసాహిత్యంగా జరిగిన పరిణామాన్ని వివరించారు.సాహిత్య చరిత్రలో ప్రతి యుగం అంతకుముందు యుగాన్ని అధిగమిస్తుంది. పాత వ్యవస్థపైన దాడి చేయకపోతే కొత్త వ్యవస్థ రాదంటారు. విమర్శ ఘాటుగా ఉండవలసిందే. అది ఎంత తీవ్రంగా ఉన్నా నాకు అభ్యంతరం లేదంటారు త్రిపురనేని. జ్ఞానానికి హద్దులు ఉంటాయి కానీ, అజ్ఞానానికి మాత్రం వుండవంటారు. చిన్నపిల్లలు మనల్ని ఆకర్షించినట్టే, బాల్యదశలో ఉన్న సమాజం సృష్టిం చిన సాహిత్యం కూడా మనల్ని ఇప్పటికీ ఆకర్షిస్తుం దని మార్క్స్ చెప్పిన మాటలను గుర్తు చేస్తారు. జీవితంలో వ్యక్తిగత సుఖాన్ని, అవసరమైతే ప్రాణాన్ని కూడా ఫణంగా పెట్టి ఉన్నత శ్రామికరాజ్యాన్ని సాధించడానికి కలాన్ని ఆయుధంగా చేసే వాడే ఈ రోజు కవి. కవి అంతరంగిక సంస్కారం, ఆలోచనా ధోరణి పూర్తిగా శ్రమజీవులతో మమేకం చెందడం చాలా అవసరమంటారు. కవితని తొలుత రాజకీయ ప్రమాణంతోనే పరిశీలించాలని, వాల్మీకి, వ్యాసుడు రాజకీయాలే రాశారని అని గుర్తు చేస్తారు. ఒక విమర్శని పూర్వపక్షం చేయడానికి అవసరమైన అధ్యయనం కృషి, జ్ఞానం త్రిపురనేని సొంతం. సికింద్రాబాదు కుట్రకేసు సందర్భంగా అక్కడి మేజిస్ట్రేట్ కోర్టులో, తిరుపతి కుట్రకేసు సందర్భంగా చిత్తూరు సెషన్స్ కోర్టులో త్రిపురనేని చదివిన ప్రకటనలో మధ్యయుగాల నుంచి ఈ నాటి వరకు వచ్చిన సాహిత్యాన్నంతా సమీక్షించారు. మార్క్సిస్టు మూల సిద్ధాం తాలను ఆధారం చేసుకునే సాహిత్య విమర్శను అభివృద్ధి చేసిన త్రిపురనేని అనేక కొత్త అంశాలను ప్రతిపాదిస్తూ, సాహిత్య విమర్శని ముందుకు తీసుకెళ్లారు. త్రిపురనేని ‘గతితార్కిక సాహిత్య భౌతిక వాదం’ సాహిత్య చరిత్రలో ఒక సరికొత్త ప్రతిపాదన. పునాది, ఉపరితలం అవయవాలతో కూడిన సమాజమనే అవయవిలో ఒక అవయవంగానే సాహిత్యానికి అస్తిత్వముంటుంది. ఈ దృష్టి నుంచి పరిశీలించడమే గతితార్కిక సాహిత్య భౌతికవాదం. గతించిన రచయితల్లో అశాస్త్రీయ అవగాహన ఉంటే సరిచేయలేం కనుక అంచనావేయడానికి ఇది ఉపయోగపడుతుంది. సజీవులైతే సవరించగలుగుతుంది. ఇది సాహిత్య కళాసిద్ధాంతాలలో ఒకటి కాదు. పూర్వ సిద్ధాంతాలన్నిటినీ వెనక్కు నెట్టిన శాస్త్రీయ తాత్విక ప్రతిపాదన. త్రిపురనేని ప్రతిపాదన విరసంలో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ప్రతిపాదనను చలసాని ప్రసాద్, కొండపల్లి సీతారామయ్య లాంటి వారు తీవ్రంగా వ్యతిరేకిస్తూ రాస్తే, కేవీఆర్ పాక్షికంగా వ్యతిరేకించారు. వీరి విమర్శలను కూడా అంతే తీవ్రంగా పూర్వపక్షం చేస్తూ త్రిపురనేని వినయంగా వివరించారు. ఆయనొక గొప్ప వాదప్రియుడు. ఈ చర్చలన్నీ త్రిపురనేని మధుసూదనరావు సాహిత్య సర్వస్వంలో ఉన్నాయి. ఆయనతో మాట్లాడడం, ఆయన ఉపన్యాసాలు వినడం, ఆయన రచనలు చదవడం నిజంగా ఒక విజ్ఞానోత్సవం. త్రిపురనేని పైన ఎన్ని వాద వివాదాలున్నా ఆయనొక సాంస్కృతిక విప్లవ సేనాని. (తిరుపతిలో ఆదివారం ‘త్రిపురనేని మధుసూదనరావు సాహిత్య సర్వస్వం’ ఆవిష్కరణ సందర్భంగా) వ్యాసకర్త : రాఘవశర్మ, సీనియర్ పాత్రికేయులు, మొబైల్ 94932 26180 -
సంక్షిప్తంగా సమస్త మానవాళి చరిత్ర
మానవ నాగరికత పరిణామక్రమాన్ని శాస్త్రీయంగా తెలుగులో చెప్పడానికి చేసిన గొప్ప ప్రయత్నం డాక్టర్ ఎం.వి.రమణారెడ్డి ‘టూకీగా ప్రపంచ చరిత్ర’. ఇది ఇప్పటికి రెండు భాగాలుగా వచ్చింది. జీవశాస్త్రంలో వచ్చిన పరిశోధనలు, చరిత్ర రచనకు జరిగిన వాదోపవాదాలను పరిశీలించి భారతీయ దృక్పథం నుంచి ఈ రచన చేశారు. సంఘటనలన్నిటినీ గుదిగుచ్చినట్టు చెప్పడం కాకుండా, వాటికి చోదకశక్తులైన ఆర్థిక, సామాజిక, ఉత్పత్తి సంబంధాలను విశ్లేషించారు. వందలాది సంవత్సరాలుగా మత విశ్వాసాలకూ, విజ్ఞానానికీ మధ్య జరిగిన పోరాటంలో విజ్ఞానమే ఎలా విజయం సాధించిందో వివరించారు. మొదటి భాగంలో సృష్టి రహస్యాన్ని ఛేదించడం నుంచి, పనిముట్ల తయారీలో వచ్చిన మార్పులు, ధనుర్బాణాల నుంచి తుపాకుల దాకా జరిగిన పరిణామం, జంతువులను మచ్చిక చేసుకోవడం, పశుపోషణ, వ్యవసాయం, భాష పుట్టుక, లిపి గురించి వివరించారు. ఒక వైపు మారణాయుధాలతోపాటు బౌద్ధిక ప్రపంచంలో చోటు చేసుకుంటున్న మార్పులను రెండో భాగంలో విశ్లేషించారు. క్రీ.పూ. 8వ శతాబ్దం నాటికే మానవుడు నక్షత్రాల గమనాన్ని పసిగట్టడం, ‘వేగుచుక్క’ ద్వారా కాలాన్ని లెక్కించడం నేర్చుకున్నాడు. నక్షత్రాలను బట్టి నౌకాయానం సాగించాడు. జవాబు దొరకని ప్రశ్నలకు పరలోకం ఉందనే భావనతో సమాధానపరచుకున్నాడు. ‘థాలిస్’ చరిత్రకందిన తొలి తాత్వికుడు. ‘సంకెళ్లు లేని ఆలోచన’ను అందించిన సోక్రటీస్తో సామాజిక అంశాలు పట్టించుకోవడం మొదలైంది. ‘గ్లాడియేటర్ స్కూలు’ విద్యార్థి స్పార్టకస్ తిరుగుబాటు చెప్పుకోదగ్గది. గ్రీకు, రోమన్ సామ్రాజ్యాల మధ్య ఏర్పడిన అగాథం, నరమేధం క్రైస్తవ మతానికి ప్రాబల్యం ఏర్పడేదాకా సాగాయి. చైనాలో రైతు కుటుంబం నుంచి వచ్చిన లియుబ్యాంగ్ మూలపురుషుడిగా హన్ వంశీయుల ఏలుబడి (క్రీ.పూ.206 – క్రీ.శ.220) స్వర్ణయుగంగా గుర్తింపుపొందింది. ఈ కాలంలోనే చైనా వ్యవసాయంలో ‘విత్తనం గొర్రు’ ప్రవేశించడంతో సాగు విస్తీర్ణం పెరిగి, ప్రభుత్వ ఖజానా నిండింది. చంద్రగుప్తుని విజయపథాన నడిపిన చాణక్యుడు, అర్థశాస్త్రం రాసిన కౌటిల్యుడు ఒకరు కాదు. చాణక్యుడి తర్వాత 300 ఏళ్ల అనంతరం అర్థశాస్త్రం వచ్చిందనేది పరిశోధకుల వాదన. వింధ్య పర్వతాలు దాటుకుని ఆర్యులు దక్షిణాదికి గుంపులు గుంపులుగా రాలేదు. ఆర్యీకరణ కోసం వచ్చిన తొలి ఆర్యుడు అగస్త్యుడు. ఆర్యీకరణ తర్వాత కూడా ద్రవిడ సంప్రదాయాలు కొనసాగాయి. ఇలాంటి ఆసక్తికర అంశాలతో ఈ రెండో భాగం సాగుతుంది. చరిత్ర చదివేముందు చరిత్రకారుడి గురించి తెలుసుకోవాలి. మార్క్స్ ప్రభావం ఈ రచనపై బలంగా పడింది. చరిత్రను భౌతికవాద దృష్టితో చూడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాఘవశర్మ 9493226180 టూకీగా ప్రపంచ చరిత్ర– రెండవ భాగం; రచన: ఎం.వి.రమణారెడ్డి; పేజీలు: 288(హార్డ్ బౌండ్); వెల: 300; ప్రతులకు: కవిత పబ్లికేషన్స్, 3/75, ఖాదరాబాద్ (పి.ఒ.), ప్రొద్దుటూరు –516362. ఫోన్: 9063077367