శ్రావిల్‌కు హైకోర్టు బెయిలు
90 రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేయని పోలీసులు
సాక్షి, హైదరాబాద్: మద్యం సేవించి నిర్లక్ష్యంగా కారు నడిపి చిన్నారి రమ్యతో పాటు ముగ్గురు మృతికి కారణమైన కేసులో విద్యార్థి ఆర్.శ్రావిల్‌కు బెయిల్ లభించింది. కేసు నమోదు చేసి 90 రోజులు పూర్తయినప్పటికీ పోలీసులు చార్జిషీట్ దాఖలు చేయకపోవడంతో నిబంధనల ప్రకారం శ్రావిల్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ గత నెల 30న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది మే 1న పంజగుట్ట శ్మశానవాటిక వద్ద అతివేగంతో శ్రావిల్, అతని మిత్రులు నడుపుతున్న కారు, డివైడర్‌ను ఢీకొట్టి రోడ్డుకు మరోవైపు వెళుతున్న కారుపై పడింది. ఈ ఘటనలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాజేశ్ అక్కడిక్కడే మృతి చెందారు. అతని అన్న కుమార్తె చిన్నారి రమ్య, అతని అన్న, వదిన, తండ్రి తీవ్ర గాయాలపాలయ్యారు. ఆ తరువాత చికిత్స పొందుతూ రమ్య, ఆమె తాతయ్య మృతి చెందారు.
ఈ ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బెయిల్ కోసం శ్రావిల్ రెండు సందర్భాల్లో పిటిషన్లు దాఖలు చేయగా, నాంపల్లి కోర్టు వాటిని కొట్టేసింది. దీంతో అతను ఆగస్టులో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్... దర్యాప్తు ఇంకా పెండింగ్‌లో ఉందని, అందువల్ల ఈ దశలో బెయిల్ మంజూరు చేయడం సాధ్యం కాదంటూ, శ్రావిల్ పిటిషన్‌ను కొట్టేస్తూ ఆగస్టు 23న తీర్పునిచ్చారు. కేసు నమోదు చేసి 90 రోజులు పూర్తయినా పోలీసులు చార్జిషీట్ దాఖలు చేయకపోవడంతో శ్రావిల్ గత నెల 19న మరోసారి హైకోర్టును ఆశ్రయించగా... న్యాయమూర్తి బెయిలు మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చారు.