breaking news
public taps
-
క‘న్నీళ్ల్లు’
తీరని పేదల దాహార్తి తగ్గిపోతున్న పబ్లిక్ కుళాయిలు కేంద్రం ఆదేశాలూ బేఖాతర్ జలమండలి తీరుపై ఆందోళన సాక్షి, సిటీబ్యూరో: హైటెక్ సిటీలో పేదల దాహార్తిని తీర్చేందుకు అందుబాటులో ఉన్న పబ్లిక్ ట్యాప్స్ 2559 మాత్రమే అంటే ముక్కున వేలేసుకోవాల్సిందే. గత ఐదేళ్లుగా ప్రజాకుళాయిలకు దశలవారీగా మంగళం పాడడంతో నగరంలో గుక్కెడు మంచి నీళ్లు దొరక్క పేదలు విలవిల్లాడుతున్నారు. ఒకవైపు దారిద్య్ర రేఖకు దిగువనున్న నిరుపేదలకు కుళాయి కనెక్షన్ ఇవ్వడానికి సవాలక్ష నిబంధనలు పెడుతున్న జలమండలి... మరోవైపు నిరుపేదలు గొంతు తడుపుకొనేందుకు అవసరమైన ప్రజా నల్లాలను సైతం కనుమరుగు చేసేస్తోంది. దేశరాజధాని ఢిల్లీలో నిరుపేద కుటుంబాలకు నెలకు 20 వేల లీటర్ల చొప్పున ఉచితంగా మంచినీటిని సరఫరా చేసేందుకు ఢిల్లీ జలబోర్డు ముందుకు రాగా.. రాష్ట్ర రాజధానిలో మాత్రం పేదల దాహార్తిని తీర్చే విషయాన్ని గాలికొదిలి నీటిచార్జీలను పలుమార్లు పెంచేందుకు జలమండలి తహతహలాడుతుండడం దారుణం. ప్రపంచ బ్యాంకు మార్గదర్శకాల మేరకు పేదల నల్లాలను తొలగిస్తున్న జలమండలి తీరుపై ప్రజాసంఘాలు, విపక్షాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. కాగితాలపైనే మార్గదర్శకాలు ‘ది హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ యాక్ట్, 1989’ సెక్షన్-28 ప్రకారం..పేదల బస్తీలు, పబ్లిక్ ప్రదేశాల్లో ప్రజా కుళాయిల ఏర్పాటు బాధ్యత జలమండలిదే. నగరపాలక సంస్థ చట్టం ప్రకారం 200 పేద కుటుంబాలు నివసించే చోట విధిగా ప్రజా కుళాయి ఉండాలి. తొలినాళ్లలో ఈ నిబంధన నగరంలో బాగానే అమలైనా ప్రస్తుతం దశలవారీగా కనుమరుగవుతోంది. ఐదేళ్ల క్రితం జీహెచ్ఎంసీ పరిధిలో 6559 పబ్లిక్ కుళాయిలుండేవి. వీటి ద్వారా నిత్యం 3 మిలియన్ గ్యాలన్ల మంచినీటిని సరఫరా చేసేవారు. వీటిలో సుమారు 2000 కుళాయిలు అవసరం లేని చోట ఉన్నాయంటూ దశలవారీగా తొలగించారు. మరో 2000 కుళాయిలకు మరమ్మతులు చేపట్టకపోవడంతో శిథిలావస్థకు చేరుకున్నాయి. తెల్ల రేషన్‌కార్డున్న పేదలు రూ.200 చెల్లిస్తే అదీ పైప్‌లైన్ అందుబాటులో ఉంటే కనెక్షన్ ఇస్తామంటోంది జలమండలి. ఫలితంగా సుమారు 460 మంది పేదలు ఆరునెలలుగా కుళాయి కనెక్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. అన్నీ కుంటిసాకులే పబ్లిక్ కుళాయిలపై నియంత్రణ సరిగా లేకపోవడంతో భారీగా మంచినీరు వృథా అవుతోందంటూ జలమండలి గతఐదేళ్లుగా సుమారు రెండువేలకుళాయిలను దశలవారీగా తొలగించింది. అసలు విషయం ఏమిటంటే.. వేళాపాళా లేకుండా అర్ధరాత్రి నీటిసరఫరా అవుతుండడంతో నీరు వృథా అవుతోంది. మరికొన్ని చోట్ల చెత్తకుప్పలు, అపరిశుభ్ర పరిస్థితులుండటంతో స్థానికులు పబ్లిక్ కుళాయి వద్దకు వెళ్లక నీరు వృథా అవుతోంది. ఇక మరో రెండు వేల కుళాయిలకు మరమ్మతులు చేపట్టకపోవడం వల్ల దీనావస్థకు చేరుకున్నాయి. నగరంలో రహదారుల విస్తరణ, విద్యుత్, టెలిఫోన్ కేబుల్‌వైర్ల కోసం తవ్వకాలు చేపట్టడం, బహుళ అంతస్తుల భవన నిర్మాణం సమయంలో చెత్త, మట్టి పడవేయడంతో కొన్ని భూమిలో కూరుకుపోయాయి. వీటిని పునరుద్ధరణను అధికారులు విస్మరించారు. దీంతో ప్రస్తుతం పూర్తిస్థాయిలో పనిచేస్తున్న స్థితిలో ఉన్నవి 2559 మించి లేవని బోర్డు వర్గాలే అంగీకరిస్తుండడం గమనార్హం. పాతనగరం, బాలానగర్, జీడిమెట్ల, మెహిదీపట్నం, సికింద్రాబాద్, మలక్‌పేట్, చంచల్గూడా, సైదాబాద్ తదితర ప్రాంతాల్లోని బస్తీల్లోని ప్రార్థనాస్థలాలు, ప్రభుత్వ పాఠశాలలున్న చోట కూడా పబ్లిక్ నల్లాలను పునరుద్ధరించాలన్న విషయాన్ని జలమండలి విస్మరించింది. ఉచిత నీటి సరఫరా సాధ్యమే జీహెచ్ఎంసీ ఏటా వసూలు చేస్తున్న ఆస్తిపన్ను సుమారు రూ.1500 కోట్లలో 20 శాతం జలమండలికి చెల్లిస్తే గ్రేటర్ పరిధిలోని అల్పాదాయ, మధ్యాదాయ వర్గాలకు చెందిన 4 లక్షల గృహ వినియోగ కుళాయిలకు ఉచితంగా మంచినీరు సరఫరా చేయవచ్చు. వాటర్‌బోర్డుకు రావాల్సిన రూ.870 కోట్ల పెండింగ్ నీటి బిల్లు బకాయిలను తక్షణం వసూలు చేయాలి. మంచినీటి సరఫరాకు అవసరమైన విద్యుత్‌కు గృహవినియోగ చార్జీ మాత్రమే వసూలు చేస్తే నెలకు జలమండలి రూ.30 కోట్ల లాభం గడిస్తుంది. - పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ ప్రతినిధి పబ్లిక్ కుళాయిలు ఉండాల్సిందే ప్రపంచ బ్యాంకు మార్గదర్శకాలు, మంచినీటి వృథా అన్న సాకులు చూపుతూ జలమండలి ప్రజా కుళాయిలకు దశలవారీగా మంగళం పాడుతుండటం దారుణం. బస్తీల్లో రెండు వందల కుటుంబాలు నివాసం ఉండే వీధులు, ప్రార్థనాస్థలాలు, పార్క్‌లు, ప్రభుత్వ ఆస్పత్రులు, బస్టాండ్లు, సాధారణ జనసంచారం అధికంగా ఉండే ఇతర పబ్లిక్ ప్రదేశాల్లో విధిగా పబ్లిక్ కుళాయిలు ఉండాల్సిందే. సరఫరా నష్టాలు కట్టడి చేస్తే మేలు జరుగుతుంది తప్ప పబ్లిక్ కుళాయిలు తొలగించడం సరికాదు. - ప్రొఫెసర్ డి.నరసింహారెడ్డి, చేతన సొసైటీ చీఫ్ మెంటార్ -
వచ్చేది వేసవికాలం
సాక్షి, మంచిర్యాల : జిల్లాలో కాలమేదైనా కన్నీటి కష్టాలు తప్పవు. గతేడాది కూడా మంచినీటి కోసం ప్రజలు అవస్థలు పడ్డారు. ఇప్పటివరకు అధికారులు నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోలేదు. రెండు నెలల్లో వేసవి సమీపిస్తోంది. ప్రధానంగా మున్సిపాలిటీల్లో మంచినీటి సమస్య ఉంది. మంత్రి ప్రకటించినట్టుగా కొన్నిచోట్ల నల్లాలు తొలగిం చారు. కొన్నిచోట్ల తొలగించకపోవడంతో నీరు వృథాగా పోతోంది. కాగా, కొత్త కనెక్షన్ కోసం రూ.200 చెల్లించినా వేలాది మందికి నల్లా కనెక్షన్ ఇవ్వలేదు. కేవలం భైంసా పట్టణంలోనే 300 మందికిపైగా కొత్త నల్లా కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మిగిలిన మున్సిపాలిటీల్లోనూ వేలాది మంది దరఖాస్తు చేసుకుని కనెక్షన్ల కోసం ఎదురుచూస్తున్నారు. మున్సిపాలిటీ అధికారులు మాత్రం పైప్‌లైన్ నిర్మాణాలు సక్రమంగా లేవని, సాంకేతిక కారణాలతో కొత్త కనెక్షన్లు ఇవ్వడం లేదంటున్నారు. ప్రచారం కరువు నీటివృథా అరికట్టడం, నీటి సరఫరా విస్తరణ కోసం పబ్లిక్ నల్లాలు తొలగించి, వాటి స్థానంలో ఇంటికో నల్లా కనెక్షన్ ఇస్తున్నట్లు ప్రజలకు అవగాహన కల్పించడంలో మున్సిపల్ అధికారులు విఫలమయ్యారు. పబ్లిక్ నల్లాలు అధికంగా ఉన్న వాడల్లో శిబిరాలు ఏర్పాటు చేయాలి. అక్కడే నల్లా కనెక్షన్ దరఖాస్తుఫారాలు తీసుకుని, రూ.200లకే నల్లా కనెక్షన్ మంజూరు చేయాలి. ఇది చాలాచోట్ల జరగలేదు. కానీ, బల్దియాల్లో పబ్లిక్ నల్లాలను మాత్రం చాలావరకు తొలగించారు. ఇదిలాఉండగా, గులాబీ కార్డుదారులకు కొత్త కనెక్షన్ కోసం ఒక్కో మున్సిపాలిటీలో రూ.3,600 నుంచి రూ.7,200 వరకు వసూలు చేస్తున్నారు. దీంతో గులాబీ కార్డుదారులూ పబ్లిక్ కుళాయిలపైనే ఆధారపడుతున్నారు. ఇంకొన్ని ప్రాంతాల్లో బడానాయకులు ఇంట్లో ఓ నల్లా ఉన్నా ఎక్కువ నీటి కోసం తమ పలుకుబడితో పబ్లిక్ కుళాయిలు తొలగింపుకు అడ్డంకులు సృష్టిస్తున్నారు. పైప్లైన్లు లేక.. బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలోని అశోక్‌నగర్, గంగారాంనగర్, కొత్తబస్టాండ్ ఏరియా, రవీందర్‌నగర్, అంబేద్కర్‌నగర్, సుబ్బరావుపల్లె తదితర ప్రాంతాల్లో పైప్లైన్లు ఉన్నా అధికారులు నల్లా కనెక్షన్లు ఇవ్వడం లేదు. కాగజ్‌నగర్ మున్సిపల్ పరిధిలోని ఆర్‌ఆర్‌వో కాలని, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏరియా, త్రినేత్ర శివాలయం ప్రాంతాల్లో పైప్‌లైన్ నిర్మాణమే జరగలేదు. దీంతో ప్రజలు ఏటా తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని సుమారు ఏడు శివారు ప్రాంతాల్లో పైప్‌లైన్ నిర్మాణం లేదు. దీంతో అధికారులు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని రాజీవ్‌నగర్ కొత్త కాలని, 345- ఇందిరమ్మ కాలని, తిలక్‌నగర్, వడ్డెరకాలని(కొంత ప్రాంతం) పలు శివారు కాలనిల్లో తాగునీటి సరఫరా చేసేందుకు మూడేళ్ల క్రితమే పైప్లైన్లు వేశారు. కానీ వెంటనే కనెక్షన్లు ఇవ్వలేదు. అవి పగిలిపోయాయి. దీంతో ఆ ప్రాంత ప్రజలు ట్యాంకర్లనే ఆశ్రయిస్తున్నారు. పైప్లైన్లు లేకపోవడంతోనే.. మంగతాయారు, కమిషనర్, బెల్లంపల్లి మున్సిపాలిటీ. పబ్లిక్ నల్లాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. నిరుపేదలకు రూ. 200లకే ఇంటికో నల్లా కనెక్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. కానీ, పలు చోట్ల పైప్‌లైన్ నిర్మాణం పూర్తికాక, సాంకేతిక కారణాల వల్ల ఇవ్వలేకపోతున్నాం. పనులు పూర్తయిన వెంటనే నల్లా కనెక్షన్లు ఇస్తాం. అలాగే చాలా మంది కొత్త నల్లా కనెక్షన్ కోసం సమర్పించిన దరఖాస్తులో వివరాలు సరిగా లేవు. అసంపూర్తి దరఖాస్తులున్న వారికి కనెక్షన్లు ఇవ్వం.