breaking news
Public Figure
-
సెలబ్రిటీల అన్న తర్వాత అవి తప్పవు!
ప్రముఖులుగా పబ్లిక్ లైఫ్‌లో ఉన్నప్పుడు ప్రశంసలతో నిందలూ తప్పవంటున్నాడు బిగ్ బీ అమితాబ్ బచ్చన్. సెలబ్రిటీలుగా ఉన్నప్పుడు ఇవన్నీ సహజంగా జరుగుతూనే ఉంటాయని ఆయన భావిస్తున్నాడు. తనపై విమర్శలు వచ్చినా.. తనను తిట్టుకున్నా.. నలుగురు ప్రశంసించినా పెద్దగా చలించకుండా హుందాగా వ్యవహరించే ఈ బాలీవుడ్ మెగాస్టార్ తాజాగా ఓ దినప్రతికతో ముచ్చటించాడు. 'సృజనాత్మక రంగంలో ఉన్న వారిని ఉద్దేశించి కొన్నిసార్లు నిందాపూర్వకమైన కథనాలు వస్తూనే ఉంటాయి. ఇదొక చాలెంజ్. ఎదుర్కోక తప్పదు. మీరు పబ్లిక్ ఫిగర్ అని భావిస్తే ఇలాంటివాటికి సిద్ధపడాలి. వీటిని పెద్దగా పట్టించుకోకుండా ముందుకెళ్లాలి. సెలబ్రిటీగా ఉండి.. తమ గురించి ప్రజలు స్పందించుకూడదు అని అనుకోవడం సరికాదు. మీ కోసం కేకలు వేసి.. అరిచి.. ప్రశంసలు గుప్పించినప్పుడు వాటిని ఆనందంగా స్వీకరించి.. విమర్శలు వచ్చినప్పుడు 'మాపై ఇటుకలు వేయకండి' అని అనడం సరికాదు. విమర్శలను వినాలి. నాపై విమర్శలను వినడం ముఖ్యమైన విషయంగా నేను భావిస్తాను. విమర్శల వల్ల మన తప్పులు ఏమైనా ఉంటే తెలుస్తాయి. వాటిని నుంచి పాఠాలు నేర్చుకునే అవకాశం కలుగుతుంది' అని బిగ్ బి చెప్పాడు. తనపై చాలాసార్లు విమర్శలు వచ్చాయని, వాటిని మంచిగానే స్వీకరించానని అమితాబ్ చెప్పారు. 'నాపై విమర్శలు రావడం సహజం. ప్రతిరోజూ నువ్వు ఏం ధరించావు? ఏం చేశావు అన్నదానిపై విమర్శలు వస్తూనే ఉంటాయి. వాటిని నేను సానుకూలంగానే స్వీకరిస్తాను. ఎప్పుడూ మంచే చెప్పుకోవడం వల్ల వ్యక్తులు నాశనమవుతారు. ఎవరూ పరిపూర్ణులు కారు. అందరూ తప్పులు చేస్తారు' అని అమితాబ్ అన్నారు. -
తాప్సీ... చెబుతున్నదొకటి! చేస్తున్నదొకటి!
నటి తాప్సీ పేరు చెప్పగానే ఇప్పుడు సినిమాలతో పాటు వివాహ వేడుకల ప్లానింగ్ వ్యాపారం కూడా గుర్తుకొస్తోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకున్న ఈ తారక ఇటు సినిమాల్లో చేస్తూనే, ఈ పెళ్ళిళ్ళ ప్లానింగ్ పని చేపట్టింది. అందరి పెళ్ళిళ్ళూ ఆర్భాటంగా చేసి, నాలుగు రాళ్ళు వెనకేసుకొనే వ్యాపారం నడుపుతున్నప్పటికీ, తాప్సీ సొంత పెళ్ళి కోరిక మాత్రం విచిత్రంగా ఉంది. పెళ్ళి విషయంలో తనకే గనక అవకాశమిస్తే... హంగూ ఆర్భాటాలకు దూరంగా, అత్యంత సన్నిహితులు, ముఖ్యుల మధ్య సాదాసీదాగా మూడుముళ్ళూ వేయించుకుంటుందట! ‘‘మేము ఏం చేసినా, అనుక్షణం మా మీద బోలెడన్ని కెమేరాలు ఫోకసై్స ఉంటాయి. కానీ, ఎంత పేరున్న పబ్లిక్ ఫిగర్లమైనా, కొన్ని ప్రత్యేక్ష క్షణాలను మా కుటుంబం, స్నేహితుల మధ్యే గడపాలని కోరుకుంటాం కదా! కాబట్టి, నాకే గనక ఛాయిస్ ఇస్తే, మొన్నామధ్య జరిగిన షాహిద్ కపూర్ పెళ్ళి లాగా, ఆర్భాటాలేమీ లేకుండా సాదాసీదాగా లాగించెయ్యాలని ఉంది’’ అని ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చారు. అయితే, ఇప్పుడిప్పుడే పెళ్ళి చేసుకొనే ఉద్దేశమేదీ లేదనీ, కొన్నేళ్ళ తరువాతే ఆ ముచ్చట అనీ ప్రకటించేశారు. ‘‘పెళ్ళికి పక్కాగా ప్లాన్ చేస్తా. అందంగా అలంకరించుకుంటా. అంతా బాగా చేస్తా కానీ, హడావిడి లేకుండా మామూలుగా కానిచ్చేస్తా’’ అని తాప్సీ నవ్వేశారు. నిజానికి, తాప్సీ తన చెల్లెలితోనూ, ఆప్త మిత్రురాలు ఫరాతోనూ కలిిసి సదరు పెళ్ళి ఏర్పాట్ల ప్లానింగ్ కంపెనీ నడుపుతున్నారు. హిందీ సినిమా ‘రన్నింగ్ షాదీ డాట్‌కామ్’లో నటిస్తున్నప్పుడు ఈ వ్యాపారం ఆలోచన ఆమెకు వచ్చిందట! ఆలోచన మంచిదే... ఖర్చు, హంగామా లేని పెళ్ళి చేసుకోవాలన్న అభిప్రాయమూ మంచిదే... కానీ, ఆ మాట పబ్లిక్‌లో చెప్పేస్తే వ్యాపారం మాట ఏం కానూ! బహుశా బిజినెస్ సూత్రాలు అమ్మడికి ఇంకా పట్టుబడినట్లు లేవు!