breaking news
promotions Retirement
-
ఈ నెల 31లోగా.. పదోన్నతులు పూర్తి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు, కారుణ్య నియామకాలు, ప్రత్యక్ష పద్ధతిలో ఉద్యోగ నియామకాల ప్రక్రియలో పురోగతిపై ప్రభుత్వం స్పష్టమైన గడువును నిర్దేశించింది. ఈ నెలాఖరు వరకు పదోన్నతులు, నియామకాల ప్రక్రియకు సంబంధించి ప్రతీ వారం (జనవరి 6, 12, 20, 27 తేదీల్లో) సమీక్షా సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్.. అన్ని ప్రభుత్వ విభాగాల అధిపతులను ఆదేశించారు. సోమవారం బీఆర్కేఆర్ భవన్లో వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు, పలువురు జిల్లాల కలెక్టర్లతో ఆయన సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర సచివాలయంతో పాటు విభాగాధిపతు(హెచ్ఓడీ)లు, జిల్లా స్థాయిలో ఉద్యోగుల పదోన్నతులను ఎటువంటి జాప్యం లేకుండా జనవరి 31లోగా పూర్తి చేయాలని అన్ని శాఖల కార్యదర్శులు, హెచ్ఓడీలకు సూచించారు. పదోన్నతులు, కారుణ్య నియామకాల ప్రక్రియను జాప్యం లేకుండా పూర్తి చేయాలని, పదోన్నతులతో ఏర్పడే ఖాళీలను కూడా ప్రత్యక్ష నియమాల ప్రకటనల్లో చేర్చాలని ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆశయం మేరకు ఈ అంశాలకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తామని అన్ని శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం.. రాష్ట్ర, జోనల్, జిల్లా కేడర్ల వారీగా పోస్టుల విభజన ప్రక్రియను సత్వరంగా పూర్తి చేయాలని సీఎస్ సోమేశ్‌కుమార్ అన్ని ప్రభుత్వ శాఖల అధికారులను కోరారు. ఇంకా కొన్ని శాఖలు ఈ ప్రక్రియ పూర్తి చేయలేదని, సత్వరంగా ముగించాలని కోరారు. ఈ సమావేశంలో డీజీపీ మహేందర్ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రాణి కుముదిని, సురేశ్ చందా, అధర్ సిన్హా, జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. 7 లేదా 9న కలెక్టర్లతో ముఖ్యమంత్రి భేటీ! ► ఉద్యోగుల పదోన్నతులు, ధరణి సమస్యలే ప్రధాన ఎజెండా ►రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలు, గ్రామ నర్సరీలపైనా చర్చకు అవకాశం ►నేడు కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం కె.చంద్రశేఖర్ రావు మళ్లీ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 7 లేదా 9 తేదీల్లో ప్రగతిభవన్‌లో ఈ సమావేశం జరగనుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలోని అన్ని కేటగిరీల ప్రభుత్వోద్యోగుల పదోన్నతులు, డీపీసీల ఏర్పాటుతోపాటు, ధరణి పోర్టల్ ద్వారా భూముల రిజిస్ట్రేషన్లలో ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారమే ప్రధాన ఎజెండాగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. కారుణ్య నియామకా లు, రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలు, గ్రామ నర్సరీలు, ఉపాధి హామీ, రైతు కల్లాలు తదితరవాటిపైనా కలెక్టర్లతో సీఎం చర్చించే అవకాశముందని సమాచారం. కాగా, ఈ అంశాలపై చర్చించి, పురోగతిని సమీక్షించేందుకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లూ తమ జిల్లా కేంద్రాల నుంచి కాన్ఫరెన్స్‌లో పాల్గొనాలని, బీఆర్కేఆర్ భవన్ నుంచి ఉదయం 11:30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని అధికారిక సమాచారం కూడా పంపారు. -
దేవాదాయశాఖలో పదోన్నతుల గోల
పోస్టులు లేకున్నా పదోన్నతులు.. ఆపై మళ్లీ ప్రమోషన్లు అవన్నీ చెల్లవంటూ తాజాగా ట్రిబ్యునల్ తీర్పు సాక్షి, హైదరాబాద్: ఉన్న పోస్టులు ఆరు.. పదోన్నతి కల్పించింది తొమ్మిది మందికి... కొన్నేళ్లుగా జరిగిన ఈ తంతు సరికాదంటూ ఇప్పుడు ట్రిబ్యునల్ తీర్పు.. చిత్రమేమిటంటే ఆ పదోన్నతులు పొందినవారు ఈ కాలంలో మరోసారి కూడా పదోన్నతి పొందారు. వారిలో కొందరు రిటైరయ్యారు కూడా. ఇప్పుడు ఆ ఉద్యోగుల విషయంలో ఏం చేయాలి..!?.. దేవాదాయ శాఖ లో నెలకొన్న గందరగోళమిది. దేవాదాయ శాఖ ఆరో జోన్ పరిధిలో 2001 వరకు తొమ్మిది గ్రేడ్-1 కార్యనిర్వాహక అధికారుల(ఈవో) స్థాయి పోస్టులుండగా.. వాటిలో మూడింటి స్థాయిని పెంచి సహాయక కమిషనర్ పోస్టులుగా మార్చారు. దీంతో గ్రేడ్-1 ఈవో పోస్టుల సంఖ్య ఆరుకు తగ్గిపోయింది. అయినా అప్పటినుంచి నిబంధనలకు విరుద్ధంగా తొమ్మిది మందికి పదోన్నతులు కల్పిస్తూ వచ్చారు. ఇలా అదనంగా పదోన్నతులు పొందుతూ వచ్చినవారిలో.. ఆరుగురు 2012లో సహాయక కమిషనర్లుగా మరో పదోన్నతి పొందారు. దీనితో అక్రమ పదోన్నతులపై వచ్చిన వారికి సహాయక కమిషర్లుగా ఎలా పదోన్నతి కల్పిస్తారంటూ మిగతా అధికారులు ఎండోమెంట్ ట్రిబ్యునల్‌లో ఫిర్యాదు చేశారు. ట్రిబ్యునల్ వారి పదోన్నతులను సమీక్షించి ఆ ఆరుగురిని తిరిగి గ్రేడ్-1 ఈవోలుగా మార్చింది. దీనిపై ఆ ఆరుగురు రాష్ట్ర పరిపాలన ట్రిబ్యునల్‌కు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. వీరిలో నలుగురు సహాయక కమిషనర్లుగా పదవీ విరమణ చేశారు. తాజాగా ఈ వ్యవహారంపై లోతుగా పరిశీలించిన రాష్ట్ర పరిపాలన ట్రిబ్యునల్... ఆ స్టేను తొలగిస్తూ.. వారి పిటిషన్‌ను కొట్టివేసింది. దీని ప్రకారం ఆ ఆరుగురి పదోన్నతులు చెల్లకుండా పోయాయి. ట్రిబ్యునల్ తీర్పు నేపథ్యంలో ఆ ఇద్దరు సహాయక కమిషనర్లకు రివర్షన్ ఇవ్వాలని, పదవీ విరమణ చేసిన మిగతా నలుగురి బెనిఫిట్స్‌ను పునఃసమీక్షించాలని ఉన్నతాధికారులపై ఇతర అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. దీంతో పరిస్థితి గందరగోళంగా తయారైంది. అడ్డగోలు పదోన్నతులు కల్పించిన ఉన్నతాధికారులు ఇప్పటికే పదవీ విరమణ చేయడం గమనార్హం.